
సాగుకు సిద్ధం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఈ సారి ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 6.50లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యే వీలుందన్న ఆ శాఖ అధికారుల అభిప్రాయం. షరా మామూలుగానే ఈసారి కూడా పత్తి పంట 3లక్షల హెక్టార్లలో సాగు కానుంది. వరి 2లక్షల హెక్టార్లు, ఇతర అన్ని రకాల పంటలు కలిపి 1.50లక్షల హెక్టార్లలో సాగుకానున్నాయి. కాగా, దీనికి సంబంధించి ప్రభుత్వం రాయితీపై అం దించే విత్తనాలు సిద్ధంగా ఉంచారు. వరి, కం దులు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, ఆముదం పంటల విత్తనాలు మాత్రమే సబ్సిడీపై అందిస్తున్నారు. జిల్లాలో 38వేల క్వింటాళ్ల సబ్సిడీ వరి విత్తనాలనుఇప్పటికే 10వేల క్వింటాళ్లను వివిధ మండలాలకు పంపిణీ చేశారు. పత్తి, వరి మినహా ఇతర వాణిజ్య పంటలవైపు రైతులు అంత ఆసక్తి చూపడం లేదు.
ఆయకట్టు ప్రాంతంలో వరి, ఆయకట్టేతర ప్రాంతంలో పత్తి పంటల వైపు రైతులు పూర్తిగా మొగ్గు చూపుతున్నారు. కాగా, ప్రైవే టు మార్కెట్లో పత్తి విత్తనాలకోసం రైతుల కష్టాలు మొదలయ్యా యి. ఖరీఫ్ సీజన్‌లో పంటల కోసం అవసరమైన ఎరువుల నిల్వలూ సరిపోనే ఉన్నాయంటున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా ఇండెంటును సమర్పించింది. జిల్లాకు 1,81,252 మెట్రి క్ టన్నుల యూరియా అవస రం. కాగా, ఈ నెలాఖరుకు వరకు కచ్చితంగా 44,590టన్నులు కావాల్సిందే. ఈ రోజు వరకు జిల్లాలో 19వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. రైతాంగం అత్యధికంగా విని యోగిస్తున్న కాంప్లెక్స్ ఎరువులు 1,09,058మెట్రిక్ టన్నులు ఈ సీజన్ మొత్తానికీ అవసరం. అయితే, ఈ నెలాఖరు వరకు 22,656టన్నులు కావాలి. కాగా, నేటివరకు జిల్లాలో 16,128 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి.
ఇవే కాకుండా, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువుల నిల్వలు సైతం తగినంత ఉన్నాయని చెబుతున్నారు. కాగా, డీఏపీ ధర బస్తా రూ.1300కు చేరడంతో రైతులు కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఖరీఫ్ సీజన్‌లో పంట రుణాలు అందించాల్సిన బ్యాంకులు ఆ దిశలో ఇంకా మందకొడిగానే ఉన్నాయి. జిల్లా క్రెడిట్ ప్లాన్ ఇంకా ప్రకటించలేదు. కాగా, ఖరీఫ్‌లో 1,226కోట్ల రూపాయలు రుణాలుగా అందించాలన్న ప్రణాళిక మేరకు నేటి వరకూ నయా పైసా రుణం రైతులకు అందలేదు. కాగా, రబీ రుణలక్ష్యం రూ.525కోట్లుగా నిర్ణయించారు. మొత్తంగా ఈ వ్యసాయ సీజన్ ఆరంభం రైతులను నిరీక్షణలో నిలబెట్టింది.