తగ్గిన పట్టభద్రులు
తాజాగా జాబితా విడుదల చేసిన యంత్రాంగం
⇒జిల్లాలో పట్టభద్రులైన ఓటర్లు : 87,208
⇒పురుషులు : 54,494
⇒మహిళలు : 32,714
⇒గతంతో పోలిస్తే తగ్గిన ఓటర్లు : 8,450
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జనాభా గణాంకాలు, ఓటర్ల సంఖ్యలో అగ్రగామిగా ఉన్న జిల్లా.. తాజాగా పట్టభద్రుల ఓటర్ల సంఖ్యలో మెట్టు దిగింది. గతంలో 95,658 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదై.. హైదరాబాద్ కంటే జిల్లా ముందువరుసలో ఉంది. ఇటీవల పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించిన యంత్రాంగం.. తాజాగా ఓటర్ల గణాంకాలను విడుదల చేసింది. ఇందులో గతంలో కంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా తగ్గి 87,208కి పడిపోయింది.
తగ్గిన ఓటర్ల సంఖ్య 8,450
ఎన్నికల అధికారులు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం జిల్లాలో 87,208 మంది పట్టభద్రులైన ఓటర్లున్నారు. ఇందులోపురుషులు 54,494 మంది ఉండగా, మహిళలు 32,714 ఉన్నారు. ఓటరు నమోదులో పట్టభద్రులు నిరాసక్తత చూపారో.. లేక నమోదుపై అధికారగణం సరైన ప్రచారం నిర్వహించలేదోగానీ.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 8,450 తగ్గింది.
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం గతేడాది డిసెంబర్ చివరివారం వరకు ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా దరఖాస్తులు పరిశీలించిన అధికారులు.. తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. పట్టభధ్రుల నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలున్నాయి. గతంలో ఓటర్ల సంఖ్యలో జిల్లా ముందువరుసలో ఉండగా ప్రస్తుతం రె ండో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్ జిల్లా 1,33,003 ఓటర్లతో ప్రథమస్థానంలో ఉంది. 66,100 ఓటర్లతో మూడోస్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా ఉంది.
‘ఆధార్’ అనుసంధానంతో..
ఓటరు జాబితాలో అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఓటరు వివరాలను ఆధార్ కార్డులతో అనుసంధానం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధార్ సీడింగ్ (అనుసంధానం) ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా పట్టభధ్రుల ఓటరు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. ముందుగా వారి ఓట్ల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు.
ఇలా చేయడంతో ఒకవ్యక్తి కేవలం ఒకే చోట ఓటు నమోదు చేసుకునే వీలుంటుంది. మహానగరానికి చుట్టూ జిల్లా విస్తరించి ఉన్న నేపథ్యంలో వలసల తాకిడి కూడా భారీగా ఉంటుం ది. దీంతో గతంలో పెద్దఎత్తున ఓటర్లుగా నమోదయ్యారు. తాజాగా ఆధార్ లింకును ఎన్నికల సంఘం తెరపైకి తేవడంతో ఓటరు నమోదులో పట్టభద్రులు సొంత ప్రాంతాల్లోనే దరఖాస్తు చేసుకునే ఆలోచనలో ఉండడంతో జిల్లాలో నమోదు తగ్గిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.