సంగారెడ్డి క్రైం: సంగారెడ్డిలో 218 సంవత్సరాల చారిత్రక కట్టడం తెలంగాణ ఉద్యమ చరిత్రకు కేంద్రంగా మారబోతోంది. పరాయి పాలకుల చేతిలో స్వాతంత్య్ర సమరయోధుల నిర్భందానికి, స్వయం పాలకుల హయాంలో నేరస్తుల నిర్భందానికి వినియోగించిన ఈ భవనం త్వరలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను తెలిపే కేంద్రంగా రూపాంతరం చెందనుంది.
1796 నాటి పాలకుల హయాంలో ఎకరం 12 గుంటల స్థలంలో యుద్ధానికి వినియోగించే గుర్రాలను కట్టేసేందుకు నిర్మించిన ఈ కట్టడం రానురాను ఇతర కార్యక్రమల కోసం వినియోగించారు. స్వాతంత్య్రానికి ముందు సాగిన ఉప్పు సత్యాగ్రహం, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని నిర్భందించేందుకు కూడా అప్పటి పాలకులు ఈ కట్టడాన్ని వినియోగించారు. తర్వాత కాలంలో అది న్యాయశాఖ, ఆరోగ్య శాఖ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగించారు.
స్వాతంత్య్రం అనంతరం 1977లో ఈ భవనాన్ని ప్రభుత్వం జైళ్ల శాఖకు బదలాయించింది. అప్పటి నుంచి సంగారెడ్డిలో జిల్లా జైలుగా ఉపయోగపడింది. రెండు శతాబ్దాల నాటి కట్టడం కావడం, రోజురోజుకు నేరస్తుల సంఖ్య పెరగడం, జైళ్ల శాఖలో సంస్కరణలు అమల్లోకి రావడం వల్ల ప్రభుత్వం జిల్లా జైలును సంగారెడ్డి మండలం కంది శివారులోని 15 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించింది. దాంతో గత రెండేళ్లుగా జిల్లా పాత జైలు వృథాగా ఉండిపోయింది.
చారిత్రక క ట్టడమైన ఈ భవనం శిథిలావస్థకు చేరకుండా భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో జైళ్ల శాఖ డిజి వినయ్‌కుమార్ సింగ్ ఈ ప్రాంగణాన్ని తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే విధంగా మ్యూజియంగా మార్చడానికి నిర్ణయించారు. ఇటీవల సంగారెడ్డికి జిల్లా జైలు అధికారులు చేరుకొని ఈ పురాతన కట్టడాన్ని మ్యూజియంగా మార్చడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా గాంధీ మహాత్ముడు ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం మొదలుకొని తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనేక మంది సమరయోధులను కూడా అప్పటి పాలకులు ఈ భవనంలోనే నిర్భందించారు. 1947 స్వాతంత్య్ర పోరాటంతో పాటు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఇదే జైల్లో నిర్భందించబడ్డ జోగిపేటకు చెందిన లింగాగౌడ్ తదితరుల నుంచి జిల్లా జైలు అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పురావస్తు శాఖను కూడా సంప్రదించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు.
60 ఏళ్లపోరాటం తర్వాత సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ చరిత్రకు అద్దం పట్టే తొలి మ్యూజియాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించడానికి జైళ్ల శాఖ చర్యలు తీసుకుంటుంది. మరో నాలు గు నెలల్లో ఏర్పాట్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యూజియంలో ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటంలో జిల్లా పాత్ర, తెలంగాణ పోరాటం, ప్రత్యేక తెలంగాణా కోసం 1969 నుంచి ఇప్పటి వరకు సాగిన ఉద్య మం, ప్రాణ త్యాగం చేసిన వారి ఫోటోలు, చర్రితను భద్రపర్చాలని అధికారులు నిర్ణయిం చారు.
ప్రస్తుతం ఈ ప్రాంగణంలో 9 గదులు ఉన్నాయి. జైలుగా వినియోగించినప్పుడు ఎనిమిది గదుల్లో పురుషుల్ని, ఒక గదిలో మహిళలను ఉంచేవారు. వీటితో పాటు వార్డెన్ గది, బాత్‌రూమ్‌లు ఉన్నాయి. జిల్లా జైలును మ్యూజియంగా మార్చాలన్న ఆలోచనతో జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం సీనియర్ క్యూరేటర్ కేసర్ అమ్మద్‌అలీని సంగారెడ్డికి రప్పించి మ్యూ జియం అభివృద్ధికి గల అవకాశాలు, ఏ విధం గా ఏర్పాటు చేయాలన్న విషయంపై చర్చిం చారు.
అహ్మద్ అలీ గతంలో ఏపీ పోలీస్ అకాడెమీలో కూడా మ్యూజియం ఏర్పాటుకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను కూడా ఇక్కడికి రప్పించి జైలు భవనాన్ని మ్యూజియం గా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలు, కట్టడాల మరమ్మతులపై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని కోరారు. వారం పది రోజుల్లో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రతిపాదనలు రాగానే ప్రభుత్వానికి పంపించి నిధులు మంజూరు చేయించేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ జైలు.. చారిత్రక ఆనవాలు
Published Mon, Oct 6 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement
Advertisement