మ్యూజియంగా పాతజైలు
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డిలోని పాత జిల్లా జైలును తెలంగాణలో మొట్టమొదటి మ్యూజియంగా ఏర్పాటు చేయనున్నట్టు జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వి.కె.సింగ్ తెలిపారు. సోమవారం ఆయన సంగారెడ్డి మండలం కందిలోని జిల్లా జైలును, పాత బస్టాండ్ సమీపంలోని పాత జైలును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత జైలులో తెలంగాణ చారిత్రక ఆనవాళ్లను ప్రదర్శించే మ్యూజియంగా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
పనులను ఈనెలలో ప్రారంభించి రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభింపజేస్తామని తెలిపారు. సంగారెడ్డిలోని పాత జైలుకు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇతర ప్రాంతాల వారు కూడా సంగారెడ్డికి వచ్చి ఈ మ్యూజియాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
శిథిలావస్థకు చేరుకున్న పాత జైలుకు మరమ్మతులు చేయడానికి రూ.20 లక్షలు వెచ్చించనున్నట్టు చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించే వారి నుంచి ఎంట్రీఫీజు కింద రూ.5 వసూలు చేస్తామని, దీని ద్వారా అదనపు ఆదాయం వస్తుందన్నారు. పిల్లలకు మాత్రం ఉచితంగా ప్రదర్శనకు అనుమతి ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం పాత జైలులోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. పెరిగిన పిచ్చి మొక్కలను, చెత్త, చెదారాన్ని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయించాలని ఆదేశించారు.
మొక్కల పెంపకంతో అదనపు ఆదాయం
జిల్లా జైలు ఆవరణలో నర్సరీ ఏర్పాటు చేయడం ద్వారా రానున్న మూడేళ్లలో జైలుకు సంవత్సరానికి రూ. 10 లక్షల చొప్పున ఆదాయం వస్తుందని వి.కె. సింగ్ తెలిపారు. నర్సరీ ఏర్పాటుకు కృషి చేసిన జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. జైలు ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ముగ్ధుడయ్యానని తెలిపారు. ఖైదీలకు ఏమైనా ఇబ్బందులు వున్నాయా? ఆని ఆరా తీశారు.
ఇతర వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వి.కె. సింగ్ వెంట జిల్లా ఎస్పీ డా.శెముషీ బాజ్‌పాయ్, ఏఎస్పీ పి.రవీందర్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, డిప్యూ టీ సూపరింటెండెంట్ సతీష్ రాయ్, జైలర్ చిరంజీవి, సంగారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు ఎస్.ఆంజనేయులు, శ్యామల వెంకటేష్ తదితరులు ఉన్నారు.
జైళ్లల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
జోగిపేట: రాష్ట్రంలోని అన్ని జైళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ వీకే సింగ్ అన్నారు. సోమవారం జోగిపేటలోని సబ్‌జైల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జైళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయిస్తోందన్నారు. దానికి తోడు జైళ్లల్లో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువుల ద్వారా ప్రతి సంవత్సరం జైళ్ల శాఖకు రూ.2 కోట్ల ఆదాయం వస్తోందన్నారు.
ఈ నిధులను జైళ్లలో క్యాంటిన్, లైబ్రరీల ఏర్పాట్లకు వినియోగించనున్నట్లు తెలిపారు. జైళ్లను మరింతగా పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. జైళ్లకు వస్తున్న ఖైదీల్లో పరివర్తన, అధ్యయనం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో చదువు చెప్పిస్తున్నామన్నారు.
అనంతరం సబ్‌జైలు రికార్డులు, బ్యారక్, వంట గదితో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అధికారులను అడిగి ఖై దీల వివరాలను తెలుసుకున్నారు. వీకే సింగ్ వెంట జిల్లా జైలు సూపరింటెండెంట్‌లు నాగేశ్వరరెడ్డి, సంతోష్‌రాయ్, ఇన్‌చార్జి సబ్‌జైలర్ గణేష్‌బాబు, జోగిపేట సీఐ వి.నాగయ్య, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయరావులు ఉన్నారు.