
టెలీకాలర్ ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్
మాదాపూర్: ప్రేమ పేరుతో మోసం చేసి టెలీకాలర్ సునీత ఆత్మహత్యకు కారకుడైన కేసులో నిందితుడిని శనివారం మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమణకుమార్, డీఐ శశాంక్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రవణ్‌కుమార్ శ్రీ చైతన్య ఇన్ఫోసిస్ సిస్టమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. కంపెనీ మూసివేయడంతో పంజగుట్టలోని జస్ట్ డయల్‌లో కొద్దికాలం పనిచేశాడు. ఆ తరువాత అతను గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌లో ప్రాసెసర్ డెవలఫర్‌గా పని చేస్తున్నాడు. జస్ట్ డయల్‌లో పనిచేస్తున్న సమయంలో టెలీకాలర్‌గా పని చేస్తున్న సునీతతో అతడికి పరిచయం ఏర్పడింది. ప్రేమపేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని సునీత ఒత్తిడి చేయడంతో ఆమె వద్ద రూ. 1 లక్ష తీసుకొని ఇంకా డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు.
ఆమెతో పాటు మరికొందరు అమ్మాయిలతో స్నేహం చేసి మోసం చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. సునీతను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న అతను ఆమెను బెదిరిస్తూ మెసేజ్‌లు పంపాడు. ఈ నెల 14న పెళ్లి విషయం తేల్చాలని సునీత మెసేజ్‌లు ఇచ్చినా శ్రవణ్‌కుమార్ పట్టించుకోలేదు. ‘నీవు రాకపోతే చనిపోతానని’ మెసేజ్ పంపించింది. అయినా అతను స్పందించకపోవడంతో ఈ నెల 15న భాగ్యనగర్ కో–ఆపరేటివ్ సొసైటీ ఖాళీ స్థలంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణమైన శ్రవణ్‌కుమార్ అరెస్టు చేసి అతని నుండి బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.