సోమవారం ఆలిండియా కురుమ సంఘం ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్. చిత్రంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: గొల్ల కురుమల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, రూ.10 కోట్ల సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం లేని వెనకబడిన తరగతుల వారికి శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించే ఆలోచనా ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు ఇప్పటివరకు 23.8 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు సీఎం చెప్పారు. 84 లక్షల గొర్రెలను ఎక్కడ నుంచి తెచ్చి పంపిణీ చేస్తారని కొందరు ఎద్దేవా చేశారని, ఇప్పటికే భారీగా పంపిణీ జరగడమే వారికి సమాధానమని అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కురుమల సమావేశానికి వచ్చిన పలు రాష్ట్రాల ప్రతినిధులు సీఎంతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గొల్ల కురుమలకు ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం చాలా బాగుందని వారు హర్షం వెలిబుచ్చారు. లక్షలాది కుటుంబాలకు లబ్ధి కల్పించే సంక్షేమ పథకాన్ని రూపొందించడమే గాక విజయవంతంగా అ మలు చేశారంటూ సీఎంను అభినందించారు.
పథకాలను వివరించిన సీఎం
‘‘నేను 40 సంవత్సరాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నాను. తెలంగాణ కోసం పోరాడాను. అందుకే ప్రజలకు ఏం చేయాలనే విషయంలో నాకు స్పష్టత ఉంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ గురించి అర్థం చేసుకోవడానికి చాలా అధ్యయనం చేశాం. అధికారంలోకి వచ్చాక కూడా అధ్యయనం కొనసాగుతోంది’’అని వారికి సీఎం వివరించారు. యాదవులు దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్నారని గుర్తు చేశారు. ‘‘అయినా మాంసం దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి! తెలంగాణలో 35 నుంచి 40 లక్షల మంది గొల్ల కురుమలున్నారు. అయినా రోజూ దాదాపు 650 లారీల మాంసాన్ని రాష్ట్రం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది! ఒక్క హైదరాబాద్‌కే పలు రాష్ట్రాల నుంచి రోజూ 350 లారీల గొర్రెలు వస్తున్నాయి. ఇది సిగ్గుపడాల్సిన విషయం. అందుకే సుదీర్ఘంగా చర్చించి, రూ.4,500 కోట్లతో గొర్రెల పంపిణీ ప్రణాళిక రూపొందించాం’’అని వివరించారు. మానవ వనరులను అభివృద్ధి ప్రణాళికలో భాగంగా గొర్రెల కాపరుల సంక్షేమానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు.
రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో షెపర్డ్ సభలు
రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అఖిల భారత షెపర్డ్ కమ్యూనిటీ సభలు జరుపుతామని సీఎం ప్రకటించారు. అప్పటికి ప్రపంచంలోనే ధనవంతమైన సామాజికవర్గంగా తెలంగాణ షెపర్డ్ కమ్యూనిటీ రూపొందుతుందన్నారు. ‘‘వ్యవసాయాన్ని గతంలో ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. పట్టించుకోలేదు. అందుకే రైతు ఆత్మహత్యలు జరిగేవి. ఈ దుస్థితిని నివారించేందుకు తెలంగాణ రైతులను సంఘటితపరిచే చర్యలకు శ్రీకారం చుట్టాం. అందు లో భాగంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశాం. ప్రతి రైతుకూ ఏటా ఎకరానికి రూ.8,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం. రైతులు, గొర్రెల పెంపకందారులు, పాల విక్రయదారులు... ఇలా అందరూ బాగుపడితే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది’’అంటూ సీఎం భవిష్యద్దర్శనం చేశారు.
సీఎంను కలిసిన ప్రతినిధుల బృందంలో కర్ణాటక మంత్రులు రేవణ్న, బందప్ప, ఎమ్మెల్యే ప్రకాశ్ వార్తుర్, మహారాష్ట్ర మంత్రులు మహాదేవ జంకార్, రాం షిండే, ఎమ్మెల్యే వి.రామారావు, ఢిల్లీ వాటర్ బోర్డ్ వైస్ చైర్మన్ దినేశ్ మొహారియా, తమిళనాడు కురుమ సంఘానికి చెందిన ఆర్.కృష్ణమూర్తి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులున్నారు. భేటీలో మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం తదితరులు పాల్గొన్నారు.