సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో అఖిల భారత కురుమల సంఘం ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారికున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ కురుమల సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సంక్షేమ భవనానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వచ్చే శాసన మండలి ఎన్నికల్లో కురుమలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలోని గొర్రెల కాపరులందరికి మొత్తం 84లక్షల గొర్రెలను పంపిణీ చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని రైతు సమస్యలపై సీఎం స్పందించారు. తెలంగాణలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రైతులకు వ్యవసాయంపై భరోసా కల్పించేందుకు వచ్చేఏడాది నుంచి ఎకరాకు రూ.8వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం మీడియాకు తెలిపారు.