నిర్వాసితులను ఆదుకుంటాం | Residents will save | Sakshi
Sakshi News home page

నిర్వాసితులను ఆదుకుంటాం

Published Mon, Jul 6 2015 2:04 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

నిర్వాసితులను ఆదుకుంటాం - Sakshi

నిర్వాసితులను ఆదుకుంటాం

- రూ.5లక్షల పరిహారం, లేదంటే ఇంటికో ఉద్యోగం
- కోర్టుకు వెళ్లినా ఎలాంటి అభ్యంతరం లేదు
- ‘పాలమూరు’ ముంపు బాధితరైతులతో మంత్రి జూపల్లి, కలెక్టర్ శ్రీదేవి సమావేశం
- భూమికి భూమే ఇవ్వాలని రైతుల డిమాండ్
కొల్లాపూర్:
పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోనున్న నిర్వాసిత రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసాఇచ్చారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలో నిర్మించనున్న పాలమూరు ఎత్తిపోతల, రిజర్వాయర్ నిర్మాణాల కారణంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులతో ఆదివారం స్థానిక కేఎల్‌ఐ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. ఎల్లూరు, సున్నపుతండా, బోడబండతండా, నార్లాపూర్ గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. భూములు కోల్పోయే రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మార్కెట్ విలువ ప్రకారం 9రేట్లు అధికంగా చెల్లిస్తామన్నారు. తద్వారా ఒక్కోరైతుకు రూ.ఐదు లక్షల పరిహారం వస్తుందన్నారు. ఇది ఇష్టంలేని రైతులకు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని వివరించారు. ఈ రెండింటిలో ఏదో ఒక అంశాన్ని మాత్రమే రైతులు కోరుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించే పరిహారం ధర నచ్చని వారు కోర్టును ఆశ్రయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

నిర్వాసితులకు రూ.ఐదులక్షల వ్యయంతో డబుల్‌బెడ్‌రూం ఇల్లు కట్టించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వీలైతే భూ పంపిణీ ద్వారా భూములు ఇస్తామన్నారు. తమశాఖ ద్వారా నిర్వాసితుల్లో చదువుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తామన్నారు. బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను అందిస్తామన్నారు. రైతుల అభిప్రాయాలను మరో రెండుమూడు రోజుల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగ కల్పన, పరిహారం చెల్లింపుపై చర్చిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల కోసం రైతులు భూములు త్యాగం చేయకతప్పదన్నారు.
 
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. కొల్లాపూర్ మండలంలో మూడొందల పక్కాఇళ్లు, 1684 ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణం కారణంగా రైతులు కోల్పోతారని వివరించారు. ప్రభుత్వ ధర ప్రకారం వారికి పరిహారం చెల్లిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలుగకుండా పరిహారం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని వెల్లడించారు.

అయితే పలువురు రైతులు తమ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. పరిహారం చెల్లింపు తమకు ఆమోదయోగ్యంగా లేదని వాగ్వాదానికి దిగారు. భూములకు భూములు ఇవ్వాలని, ఎకరాకు రూ.పదిలక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని, ఇంటికో ఉద్యోగం తప్పనిసరిగా కల్పించాలని, పక్కాఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. లేదంటే తాము భూములిచ్చే ప్రసక్తేలేదన్నారు. సమావేశంలో పాలమూరు ఎత్తిపోతల పథకం పర్యవేక్షకులు రంగారెడ్డి, ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి, తహశీల్దార్ పార్థసారధి, ఎంపీపీ నిరంజన్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, సింగిల్‌విండో చైర్మన్ రఘుపతిరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement