శిక్షణ ఇచ్చారు.. పోస్టింగ్ మరిచారు!
ఎన్నో ఆశలతో ఎస్‌ఐగా శిక్షణ పొందిన
అభ్యర్థులు.. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పోస్టింగ్ తీసుకోకుండానే రిటైరవుతున్న దుస్థితి నెలకొంది. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ కోసం 135 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని ఆరు నెలలు దాటినా వీరికి పదోన్నతులు మాత్రం ఇవ్వలేదు. తమలాగే శిక్షణ పొందిన పక్క జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఎస్‌ఐలుగా బాధ్యతలు చేపట్టినా మా గోడును మాత్రం పట్టించుకునే వారే లేకుండాపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైనింగ్ పొందిన కొందరు ఏఎస్‌ఐలు ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకోకముందే ఉద్యోగ విరమణ చేస్తున్నారు.
హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్‌ఐలుగా పని చేస్తున్న 184 మందికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి 135 రోజుల పాటు అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయితే ఇది జరిగి ఆరు నెలలైనా జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రం ఇప్పటివరకూ పదోన్నతిని లభించలేదు.
ఇదే సమయంలో పక్క జోన్‌లోని వివిధ జిల్లాల్లో ఎస్‌ఐ శిక్షణ పొందిన ఏఎస్‌ఐలు ట్రైనింగ్ పూర్తి కాగానే సబ్ ఇన్‌స్పెక్టర్లుగా చార్జ్ తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా హైదరాబాద్ జోన్ పరిధిలో మాత్రం పదోన్నతుల ముచ్చట కాగితాలకే పరిమితమైంది. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ వీరు పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే శిక్షణ పూర్తి చేసిన మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు ఏఎస్‌ఐలు ఎస్‌ఐగా ప్రమోషన్ రాకుండానే రిటైరయ్యే దశకు చేరుకున్నారు. హైదరాబాద్ జోన్ పరిధిలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపడితేనే శిక్షణ పొందిన వారికి తగిన న్యాయం జరిగే అవకాశం ఉంది.
ఆదేశాలు రాలేదు
జిల్లా నుంచి శిక్షణ పొందిన ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించే విషయంలో పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. పైనుంచి ఆదేశాలు వస్తే వాటి ప్రకారం నడుచుకుంటాం.
- శెముషీబాజ్‌పాయ్, ఎస్పీ