Semusi Bajpai
-
అమరుల త్యాగం చిరస్మరణీయం
సంగారెడ్డి క్రైం: సమాజం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల త్యాగం మరువలేనిదని, అలాంటి అమరవీరులను అక్టోబర్ 21వ తేదీన ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ డా.శెముషీ బాజ్‌పాయ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సంద ర్భంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పౌరుల క్షేమం కోసం పోలీసులు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధంగా ఉంటారన్నారు. పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం అంకితం చేస్తారన్నారు. దేశం కోసం, ప్రజలకోసం అమరులైన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులు ఏ రోజైనా వచ్చి వారి సమస్యలు తెలియజేయవచ్చన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ, పోలీసుల సేవలు మరువలేనివన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబీకులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని సూచించారు. వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అడిషనల్ ఎస్పీ పి.రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, పోలీసు అమరవీరులు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరంజీవులుగా ఉన్నారన్నారు. అంతకుముందు దేశంలో అమరులైన 653 మంది పోలీసుల పేర్లను చదివిన ఏఎస్పీ రవీందర్‌రెడ్డి వారికి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఇక జిల్లాలో అమరులైన 21 మంది పోలీసుల కుటుంబాలతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలీసు అమరవీరుల స్థూపానికి ఎస్పీ శెముషీ, కలెక్టర్ రాహుల్ బొజ్జా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీ బాబురావు, జ్యోతిప్రకాష్, సంగారెడ్డి స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ విజయ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ కిషన్‌రావు, మహిళా పీఎస్ డీఎస్పీ లాల్ అహ్మద్, పట్టణ సీఐ ఆంజనేయులు, జహంగీర్, మస్తాన్‌వలీ, దుర్గారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
శిక్షణ ఇచ్చారు.. పోస్టింగ్ మరిచారు!
ఎన్నో ఆశలతో ఎస్ఐగా శిక్షణ పొందిన అభ్యర్థులు.. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో పోస్టింగ్ తీసుకోకుండానే రిటైరవుతున్న దుస్థితి నెలకొంది. సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ కోసం 135 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకుని ఆరు నెలలు దాటినా వీరికి పదోన్నతులు మాత్రం ఇవ్వలేదు. తమలాగే శిక్షణ పొందిన పక్క జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఎస్ఐలుగా బాధ్యతలు చేపట్టినా మా గోడును మాత్రం పట్టించుకునే వారే లేకుండాపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైనింగ్ పొందిన కొందరు ఏఎస్ఐలు ఎస్ఐగా బాధ్యతలు తీసుకోకముందే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. హైదరాబాద్ జోన్ పరిధిలోని హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్ఐలుగా పని చేస్తున్న 184 మందికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి 135 రోజుల పాటు అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పూర్తి కాగానే ఎస్ఐలుగా పదోన్నతి కల్పిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయితే ఇది జరిగి ఆరు నెలలైనా జిల్లాకు చెందిన అభ్యర్థులకు మాత్రం ఇప్పటివరకూ పదోన్నతిని లభించలేదు. ఇదే సమయంలో పక్క జోన్‌లోని వివిధ జిల్లాల్లో ఎస్ఐ శిక్షణ పొందిన ఏఎస్ఐలు ట్రైనింగ్ పూర్తి కాగానే సబ్ ఇన్స్పెక్టర్లుగా చార్జ్ తీసుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా హైదరాబాద్ జోన్ పరిధిలో మాత్రం పదోన్నతుల ముచ్చట కాగితాలకే పరిమితమైంది. దీనిపై తమకు న్యాయం చేయాలని కోరుతూ వీరు పలుమార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే శిక్షణ పూర్తి చేసిన మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు ఏఎస్ఐలు ఎస్ఐగా ప్రమోషన్ రాకుండానే రిటైరయ్యే దశకు చేరుకున్నారు. హైదరాబాద్ జోన్ పరిధిలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు చేపడితేనే శిక్షణ పొందిన వారికి తగిన న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆదేశాలు రాలేదు జిల్లా నుంచి శిక్షణ పొందిన ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి కల్పించే విషయంలో పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. పైనుంచి ఆదేశాలు వస్తే వాటి ప్రకారం నడుచుకుంటాం. - శెముషీబాజ్‌పాయ్, ఎస్పీ -
బల్క్ ఎస్ఎంఎస్లు నిషేధం : ఎస్పీ
సంగారెడ్డి క్రైం : ఉపఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ వారైనా తమకు ఓటు వేయాలని బల్క్ మెసేజ్‌లు చేయడం నిషేధమని ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా వారికి అనుకూలంగా మెసేజ్‌లు పంపినట్లయితే దాన్ని తన సెల్ (94406 27000)కు పంపాలని సూచించారు. మెసేజ్‌లు పంపిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మెదక్ ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా 87 ప్రొహిబిషన్ కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. 743.815 లీటర్ల అక్రమ మద్యం, రూ. 75,24,280 నగదు, రూ. 22,200 విలువైన ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా 49 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. గత సాధారణ ఎన్నికలు జరిగిన సమయంలో బైండోవర్ చేసిన 7535 మంది బైండోవర్ కాల పరిమితి ఇప్పటివరకు అమలులో ఉందదని ఆమె గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు శనివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జిల్లాకు చేరుకున్న సెంట్రల్ పారా మిలిటరీ బలగాలు, అందుబాటులో ఉన్న పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలను వారం రోజుల క్రితమే రంగంలోకి దింపారు. జిల్లాలో 30 పోలీసు యాక్టు, సెక్షన్ 144 అమలులో ఉం ది. జిల్లాలోని సమస్యాత్మక, అతి సున్నితమైన ప్రాంతా ల్లో పోలీసుల నిఘా పెంచారు. మెదక్ పార్లమెంట్ పరిధి లో ఈనెల 13న ఉపఎన్నిక జరుగనుంది. మెదక్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 1101 పోలింగ్ ప్రాంతాలు, 1817 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని 177 మొబైల్ పెట్రోలింగ్ పార్టీల ద్వారా పర్యవేక్షించనున్నారు. 160 అతిసమస్యాత్మక ప్రాంతాలుగా, 339 సమస్యాత్మకమైనవిగా, 542 సాధారణమైనవిగా గుర్తించారు. ఎన్నికలు జరిగే ప్రాంతానికి సంబంధించి ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన హెడ్‌క్వార్టర్ లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. -
సీఎం రాక కోసం పడిగాపులు
వర్గల్: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగదేవ్‌పూర్ మండలంలోని తన ఫాంహౌస్‌కు వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచే గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వర్గల్ క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు రాకపోకలను నియంత్రించారు. మరోవైపు వర్గల్ క్రాస్‌రోడ్డు నుంచి గౌరారం స్టేజీ, పాములపర్తి క్రాస్‌రోడ్డు వరకు పోలీసు అధికారులు వాహనాల్లో తిరుగుతూ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షించారు. సిబ్బందికి తగు సూచనలందించారు. సీఎం రాక సందర్భంగా అడ్వాన్స్ పెలైట్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో గౌరారం చేరుకున్నాయి. సీఎం ఇప్పుడొస్తున్నారు..అప్పుడొస్తున్నారంటూ గంటకోసారి సమాచారం అందడంతో పోలీసులంతా దాదాపు 12 గంటల పాటు రోడ్డుపైనే నిల్చున్నారు. మరోవైపు సాయంత్రం నుంచి జల్లులు కూడా కురవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే సీఎం రాకకోసం నిరీక్షించి నీరపడిన పోలీసులకు రాత్రి 10 గంటల సమయంలో కేసీఆర్ టూర్ రద్దయినట్లు సమాచారం అందింది. దీంతో వారు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఐపీఎస్‌ల పడిగాపులు మరోవైపు సీఎం రాకకోసం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఫాంహౌస్ వద్ద వేచి చూసిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, మెదక్-నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, ఐజీ మహేశ్ భగవత్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్‌లు రాత్రి 10 గంటల తర్వాత సీఎం పర్యటన రద్దయినట్లు సమాచారం రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సంగారెడ్డిలో సోమవారం పోలీసులు భారీగా మోహరించారు. డీఆర్డీఏ, మహిళా ప్రాంగ ణం వద్ద లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ నేతృత్వంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను ఆ రోడ్డుపై కాకుండా ఇతర దారుల్లోకి మళ్లించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు వాహనాలను అనుమతించలేదు. లెక్కింపు కేంద్రాలకు కౌన్సిలర్ అభ్యర్థులను, వారి తరఫున నియమించిన ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా సీఐలు 10 మంది, ఎస్ఐలు 38, ఎఎస్ఐలు- హెడ్‌కానిస్టేబుళ్లు 49, కానిస్టేబుళ్లు 216, మహిళా కానిస్టేబుళ్లు 17, హోంగార్డులు 56, ఆర్ఎస్ఐలు ఇద్దరు, ఏఆర్ఎస్ఐలు-హెడ్‌కానిస్టేబుళ్లు 10, ఏఆర్ కానిస్టేబుళ్లు 60 మంది విధుల్లో పాల్గొన్నారు. డీఆర్డీఏ, మహిళా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఎస్పీ, ఎఎస్పీ ఆర్.మధుమోహన్‌రెడ్డి, సంగారెడ్డి డిఎస్పీ వెంకటేష్, డీఎస్పీ రాజేంద్ర, సీఐలు శివశంకర్ నాయక్, చెన్నకేశవులు తదితరులు పర్యవేక్షించారు. -
ఫోర్స్ లేదట!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సంగారెడ్డి క్రైం: ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో కూడా అదే ద్వంద్వ నీతి కొనసాగుతోంది. ‘అగ్రనాయక’ వస్తోందని అధికార గణం ఆమె సేవలోనే తరిస్తోంది. జిల్లాలో ఉన్న మొత్తం ఫోర్స్‌ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సభకే కేటాయించిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఫోర్స్ లేదనే సాకుతో పర్యటనకు అనుమతించకపోవడం ఏమిటని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ నెల 27న జిల్లాకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు రానున్నారు. వీరిద్దరూ హెలికాప్టర్ ద్వారా జిల్లాలో పర్యటించనున్నారు. వీరి సభల నిర్వహణ సందర్భంగా జిల్లా పోలీసు బలగాలను వినియోగించనున్నారు. మొత్తం 40 మంది సీఐలు, 120 మంది ఎస్ఐలు, 580 మంది ఎఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 2,500 మంది కానిస్టేబుళ్లు, 500 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. అదే రోజున నారాయణఖేడ్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌కు అనుమతి కోసం ఆ పార్టీ ఇన్చార్జి జనక్ ప్రసాద్ శుక్రవారం ఎస్పీ బాజ్‌పాయ్‌ని కలిసి అనుమతి కావాలని విన్నవించారు. జిల్లాలో పోలీసు బలగాలు తగినంత లేనందున అనుమతి ఇవ్వలేమని ఎస్పీ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఈ నెల 27న నారాయణఖేడ్ నియోజకవర్గంలో జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారైంది. హెలికాప్టర్లో జగన్ నారాయణఖేడ్‌కు చేరుకోవాల్సి ఉంది, అయితే సోనియాగాంధీ పర్యటన నేపథ్యంలో ఉన్న ఫోర్స్‌ను మొత్తం అటువైపే వినియోగిస్తున్నామని చెప్తూ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల వేళ ముఖ్య నాయకుల పర్యటనలు ఉన్నప్పుడు వారికి సరిపడా ఫోర్స్ అందుబాటులో లేకపోతే ఎస్పీ అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పక్క జిల్లాల నుంచి గాని, పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి అదనపు బలగాలను తెప్పించుకోవచ్చు. కానీ ఎస్పీ ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండానే ఏకపక్షంగా హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్, ప్రభుగౌడ్, అప్పారావు షెట్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్యాయం అంటే ఇదేనా? ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించుకొనే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఎంత రాష్ట్రపతి పాలన అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారుల తీరు ఏకపక్షంగా ఉండటంపై వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. సోనియాగాంధీకి, కేసీఆర్‌కు అనుమతినిచ్చి జగన్మోహన్రెడ్డికి అనుమతినివ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ఆ పార్టీ జహీరాబాద్ పార్లమెంటు పరిశీలకుడు జనక్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమన్యాయం ఎక్కుడుందని ఆయన ప్రశ్నిం చారు. ఫోర్స్ లేదనే నెపంతో జగన్ సభ నిర్వహణకు అనుమతినివ్వకపోవడం సరైంది కాదన్నారు. నిజంగా ఫోర్స్ లేకుంటే ఇతర జిల్లాల నుంచికానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ తీసుకోవాలే తప్ప అగ్రనేతల సభలకు అనుమతి నిరాకరించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. జగన్ సభ ఏర్పాటుకు నారాయణఖేడ్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని అన్నారు. జగన్ సభకు అనుమతికి ఎస్పీ నిరాకరించడంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహార శైలి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉందన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు. జగన్ పర్యటన రద్దు పోలీసులు అనుమతి నిరాకరించడంతో జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనను రద్దు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ మెదక్ పార్లమెంటు పరిశీలకుడు జనక్‌ప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ప్రకటించారు.