ఫోర్స్ లేదట! | police not allowed to take a tour of the helicopter to jagan | Sakshi
Sakshi News home page

ఫోర్స్ లేదట!

Published Fri, Apr 25 2014 11:54 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

police not allowed to take a tour of the helicopter to jagan

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సంగారెడ్డి క్రైం: ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో కూడా అదే ద్వంద్వ నీతి కొనసాగుతోంది. ‘అగ్రనాయక’ వస్తోందని అధికార గణం ఆమె సేవలోనే తరిస్తోంది. జిల్లాలో ఉన్న మొత్తం ఫోర్స్‌ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సభకే కేటాయించిన జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఫోర్స్ లేదనే సాకుతో పర్యటనకు అనుమతించకపోవడం ఏమిటని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు.

ఈ నెల 27న జిల్లాకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు రానున్నారు. వీరిద్దరూ హెలికాప్టర్ ద్వారా జిల్లాలో పర్యటించనున్నారు. వీరి సభల నిర్వహణ సందర్భంగా జిల్లా పోలీసు బలగాలను వినియోగించనున్నారు. మొత్తం 40 మంది సీఐలు, 120 మంది ఎస్‌ఐలు, 580 మంది ఎఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 2,500 మంది కానిస్టేబుళ్లు, 500 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు. అదే రోజున నారాయణఖేడ్ నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్‌కు అనుమతి కోసం ఆ పార్టీ ఇన్‌చార్జి జనక్ ప్రసాద్ శుక్రవారం ఎస్పీ బాజ్‌పాయ్‌ని కలిసి అనుమతి కావాలని విన్నవించారు. జిల్లాలో పోలీసు బలగాలు తగినంత లేనందున అనుమతి ఇవ్వలేమని ఎస్పీ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.  


 ఈ నెల 27న నారాయణఖేడ్ నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైంది. హెలికాప్టర్‌లో జగన్ నారాయణఖేడ్‌కు చేరుకోవాల్సి ఉంది, అయితే సోనియాగాంధీ పర్యటన నేపథ్యంలో ఉన్న ఫోర్స్‌ను మొత్తం అటువైపే వినియోగిస్తున్నామని చెప్తూ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల వేళ ముఖ్య నాయకుల పర్యటనలు ఉన్నప్పుడు వారికి సరిపడా ఫోర్స్ అందుబాటులో లేకపోతే  ఎస్పీ అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పక్క జిల్లాల నుంచి గాని, పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి అదనపు బలగాలను తెప్పించుకోవచ్చు. కానీ ఎస్పీ ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండానే ఏకపక్షంగా హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్, ప్రభుగౌడ్, అప్పారావు షెట్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 సమన్యాయం అంటే ఇదేనా?
 ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించుకొనే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఎంత రాష్ట్రపతి పాలన అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారుల తీరు ఏకపక్షంగా ఉండటంపై వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. సోనియాగాంధీకి, కేసీఆర్‌కు అనుమతినిచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి అనుమతినివ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ఆ పార్టీ జహీరాబాద్ పార్లమెంటు పరిశీలకుడు జనక్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమన్యాయం ఎక్కుడుందని ఆయన ప్రశ్నిం చారు.

ఫోర్స్ లేదనే నెపంతో జగన్ సభ నిర్వహణకు అనుమతినివ్వకపోవడం సరైంది కాదన్నారు. నిజంగా ఫోర్స్ లేకుంటే ఇతర జిల్లాల నుంచికానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ తీసుకోవాలే తప్ప అగ్రనేతల సభలకు అనుమతి నిరాకరించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. జగన్ సభ ఏర్పాటుకు నారాయణఖేడ్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చేశామని అన్నారు. జగన్ సభకు అనుమతికి ఎస్పీ నిరాకరించడంతో సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహార శైలి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉందన్న అనుమానాలను వారు వ్యక్తం చేశారు.

 జగన్ పర్యటన రద్దు
 పోలీసులు అనుమతి నిరాకరించడంతో జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనను రద్దు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ మెదక్ పార్లమెంటు పరిశీలకుడు జనక్‌ప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement