ఉద్యమం చేస్తే.. పోలీసులతో తన్నిస్తారా?
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినవారిని, నాటి ఉద్యమంలో పాల్గొన్నవారిని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో తన్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలవడానికి కారణం కేసీఆరేనని ఆయన అన్నారు. విద్యార్థుల బలిదానం వల్లే రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్కు అధికారం వచ్చిందని.. అలాంటిది ఇప్పుడు వాళ్లందరినీ కేసీఆర్ తన్నిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ తన అవినీతికి సెంటిమెంట్ ముసుగు వేసుకున్నారని, ఉద్యోగాలు అడుగుతున్న విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తున్నారని అన్నారు. విజయనగరం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం అయ్యారు కానీ, ఇక్కడివాళ్లు స్థానికులు కారా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేనిపోని విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హరీష్‌రావు సంధించిన 10 ప్రశ్నలకు సమాధానాలు తన మామ కేసీఆర్‌నే అడగాలని చెప్పారు. విద్యుత్ కావాలని అడుగుతున్న రైతుల కాళ్లు విరగొడుతున్నారని, సెంటిమెంట్ ముసుగులో ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు.