ఏ సెంటర్లోనైనా ఎంసెట్ రాయొచ్చు
హైదరాబాద్ : ఎంసెట్ పరీక్షకు నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయిని ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు విద్యార్థులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఎంసెట్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష నిర్వహణపై ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు, జేఎన్టీయూ ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతర కన్వీనర్ రమణారావు మాట్లాడుతూ... సమ్మె నేపథ్యంలో బస్సుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేలా బయలుదేరాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హాల్ టిక్కెట్లో ముందుగా ఇచ్చిన సెంటర్లోనే కాకుండా దానికి బదులుగా మరో పరీక్షా సెంటర్లో అయినా పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అనుమతి ఇస్తామని రమణారావు తెలిపారు.