పచ్చదనమే నా లక్ష్యం: సీఎం
* తెలంగాణను భూతలస్వర్గం చేద్దాం
* అందుకు ఏ చర్యకైనా వెనుకాడను
* హరితహారంపై సమీక్షలో సీఎం
* నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ‘‘పచ్చదనానికి నేను గాఢమైన ప్రేమికుడిని. రేపు మనం లేకపోయినా భావితరం ఉంటుంది. వారి కోసం మనం నాటే మొక్కలుంటాయి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఏ చర్యలకైనా వెనుకాడబోను. అంతిమంగా తెలంగాణలో అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడమే నా లక్ష్యం’’ అని పునరుద్ధాటించారు.
‘‘తెలంగాణ ఒకప్పుడు అడవులు, పచ్చదనం, వనసంపదతో తులతూగేది. పర్యావరణ సమతుల్యతతో భూతల స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గాన్ని మళ్లీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి. కాంక్రీట్ జంగిల్స్‌గా మారిన నగరాలు, పట్టణాల్లో వాతావరణాన్ని చల్లబరి చేందుకు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు, గాలిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేం దుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలి. జనావాసాల్లో మొక్కల పెంపకంతో సామాజిక అడవులను అభివృద్ధి చేయాలి. అటవీ ప్రాంతంలో మళ్లీ దట్టమైన చెట్లు పెరిగేలా చూడాలి. వనసంపదను రక్షించడంతో పాటు కనుమరుగైన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు పెంచాలి’’ అని ఆదేశించారు.
హరితహారం కార్యక్రమంపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వానాకాలంలోనే కాకుండా ఏడాదిలో పది నెలలూ మొక్కలు నాటవచ్చన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగాల న్నారు. పట్టణ ప్రాంత ఫారెస్టు బ్లాకులు, ఖాళీ జాగాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ‘‘రాష్ట్రంలో 45 శాతం ప్రజలు నగరాలు, పట్టణాల్లో నివసిస్తుండటంతో జనసాంద్రత పెరిగిపోతోంది. సరిపడా పచ్చదనం లేకుంటే విపరిణామాలు తప్పవు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొక్కల పెంపకానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.
దాని అమలుకు గ్రీన్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ సెల్‌కు కార్పొరేషన్లలో ఐఎఫ్‌ఎస్‌లను, మున్సిపాలిటీల్లో అటవీ శాఖ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించండి. మొక్కలు నాటడం, రక్షించడం, వచ్చే ఏడాదికి మొక్కల కోసం నర్సరీలు సిద్ధం చేయడం గ్రీన్ సెల్ ఆధ్వర్యంలో జరగాలి. మొక్కలు నాటిన వారికే ఇళ్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు జారీ చేసే విధానం తేవాలి’’ అని ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఇలా...
హైదరాబాద్ శివార్లలో హరిణ వనస్థలి, నారపల్లి, గుర్రంగూడ, బొంగులూరు, మంగల్‌పల్లి, తుర్కయాంజాల్, రావిర్యాల, మాదన్నగూడ, నాగారం, మైసారం, నందుపల్లి, మజీ ద్‌గడ్డ, పల్లెగడ్డ, సిరిగార్‌పూర్, తిమ్మలూరు, శ్రీనగర్ తదితర అటవీ బ్లాక్‌లను దట్టమైన అడవులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచిం చా రు. ఔటర్ రింగ్‌రోడ్డు వెంట అందమైన పూల మొక్కలు నాటాలి. ఇందుకు నీటి ట్యాంకర్లు కొనుగోలు చేయాలి’’ అని సీఎం అన్నారు.
స్మగ్లర్లపై పీడీ యాక్టు
‘అడవులను నరికేవారిపై, కలప స్మగ్లర్లపై పీడీ యాక్టు ప్రయోగించండని సీఎం అన్నారు. కలప స్మగ్లింగ్‌కు ఆస్కారమున్న చోట్ల నిఘా పెట్టాలని, అవసరమైన సిబ్బంది నిస్తామన్నా రు. ఐఎఫ్‌ఎస్ అధికారులు, అటవీ సబ్బందిని అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవాలన్నారు. ఈ విషయంలో రాజకీయ జోక్యముండదని, రిటైర్డ్ అటవీ సిబ్బంది సేవలనూ వినియోగించుకోండని సీఎం అన్నారు.
నివేదిక సమర్పించండి
పట్టణాలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు, వర్సిటీలు తదితర చోట్ల ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బతికాయి, చెట్ల పెంపకానికి ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారు వంటి వివరాలతో నివేదిక సమర్పించాలని సీఎస్ రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు, అటవీ మంత్రి జోగు రామన్న, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, పీసీసీఎఫ్ పీకే ఝా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.