హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఒకే చిరునామాతో లెక్కకు మించిన కంపెనీలను రిజిస్టరు చేసి... వాటి ఖాతాలు సైతం సరిగా నిర్వహించకుండా పలు అవకతవకలకు పాల్పడుతున్న కంపెనీలపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మూడు రోజులుగా నగరంలో సోదాలు చేస్తున్న ఆర్‌ఓసీ అధికారులు... శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఇన్‌ఫ్రా, ఇంజనీరింగ్ కంపెనీ అయిన నవయుగ... విద్యుత్, స్టీలు, ఐటీ, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి పలు రంగాల్లో ఉంది. కృష్ణపట్నం పోర్టు కూడా ఈ గ్రూపుదే. రాష్ట్ర విభజన తరవాత పలు కంపెనీల రిజిస్టర్డ్ చిరునామాలను ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు మార్చింది. ఇందులో భాగంగా కొన్ని కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయాలు విశాఖపట్నానికి మారాయి. అయితే హైదరాబాద్‌లో 25కు పైగా గ్రూపు కంపెనీలో జూబ్లీహిల్స్‌లోని ఒకే చిరునామాతో ఉండటంతో ఆర్‌ఓసీ అధికారులు శుక్రవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ సోదాల్లో ఆర్‌ఓసీ అధికారులతో పాటు ఆర్థిక నేరాలను, అవకతవకలను గుర్తించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) అధికారులు కూడా పాలు పంచుకున్నారు. రీజనల్ డైరెక్టరేట్ సూచనల మేరకే ఈ సోదాలు జరిగినట్లు తెలిసింది. సోదాల సంద ర్భంగా పలు రికార్డులు పరిశీలించటంతో పాటు వాటిపై అక్కడి సిబ్బందిని ఆరా తీశారు. ఉదయం 12 గంటల నుంచి రాత్రి వరకూ ఈ సోదాలు కొనసాగాయి. నిజానికి ఆర్‌ఓసీ ప్రాథమిక నిబంధనల ప్రకారం ప్రతి కంపెనీ తన నమోదిత కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు రిజిస్టర్డ్ కార్యాలయంలోనే సంబంధిత రికార్డులన్నీ నిర్వహించాలి. ఒకవేళ వేరే చోట నిర్వహించాలని అనుకుంటే దానికి బోర్డు ప్రత్యేక తీర్మానం చేయాలి. చాలా కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తూ ఏదో ఒక ఫ్లాగ్‌షిప్ కంపెనీ బోర్డును మాత్రమే ఏర్పాటు చేస్తున్నాయి. దీనికితోడు ఒకే కార్యాలయంలో భారీ కంపెనీలున్న సందర్భంలో వారి ఖాతాల నిర్వహణలో పలు అవకతవకలు ఉంటున్నాయనేది ఆర్‌ఓసీ అధికారుల మాట. ఇలాంటి ఉల్లంఘనల్ని పట్టుకోవడంతో పాటు ఖాతాల్లో అవకతవకలుంటే బయటపెట్టడానికి ఎస్‌ఎఫ్‌ఐఓ సహకారం తీసుకుంటున్నారు.
నవయుగ గ్రూపు ప్రమోటర్ చింతా విశ్వేశ్వరరావు. నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు ప్రమోటర్ కూడా ఈయనే. ప్రధానంగా ఈయన కుటుంబానికి చెందిన చింతా శశిధర్, చింతా శ్రీధర్, చింతా శ్రీనివాసరావు వివిధ కంపెనీలకు డైరెక్టర్లుగా కొనసాగుతూ పర్యవేక్షిస్తున్నారు. విడివిడిగా, ఉమ్మడిగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీల సంఖ్య దాదాపు 50కి పైనే ఉంది. వీటిలో కొన్ని కంపెనీల్లో అసలు కార్యకలాపాలే లేవని, నగదు లావాదేవీలు మాత్రం చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. దీనికితోడు ఆయా డైరెక్టర్లు తమ ఆదాయపు పన్ను రిటర్నుల్లో అన్ని కంపెనీల పేర్లూ పేర్కొన్నారా? లేదా? అన్నింటి నుంచీ వచ్చే ఆదాయాన్ని చూపించారా లేదా? అనే కోణంలో కూడా తదుపరి దశలో పరిశీలించనున్నట్లు సమాచారం. నవయుగ గ్రూపునకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఏపీలో పలు భారీ ఇన్‌ఫ్రా, ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని ఈ సంస్థ దక్కించుకుంది కూడా. అంతేకాకుండా బాబుకు బినామీగా పేరున్న ఓ పత్రికాధిపతితో ఈ గ్రూపునకు ఆర్థిక బంధాలూ ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment