ఏం మాయ చేశారో..! | RJD center Inverted Orders | Sakshi
Sakshi News home page

ఏం మాయ చేశారో..!

Published Mon, Jun 16 2014 2:08 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ఏం మాయ చేశారో..! - Sakshi

ఏం మాయ చేశారో..!

- మొన్న ఎంఈవోల సస్పెన్షన్.. నిన్న ఎత్తివేత
- అవినీతి, అక్రమాలకు అధికారుల జేజేలు  
- ఎమ్మెల్యే ఒత్తిడితో జీ హుజూర్
- పది రోజుల్లోనే సస్పెన్షన్ల ఎత్తివేత  
- ఆర్‌జేడీ కేంద్రంగా తారుమారైన ఉత్తర్వులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్: బాల కార్మికులకు నిర్దేశించిన రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో (ఆర్‌ఎస్‌టీసీ) భారీగా అవినీతి జరిగింది. పర్యవేక్షణ లోపంతోనే స్వచ్ఛంద నిధులు దుర్వినియోగం చేసిన అభియోగాలపై ప్రాథమిక బాధ్యులుగా  అయిదుగురు ఎంఈవోలను, ఒక ఆల్‌స్కో కో-ఆర్డినేటర్‌ను సస్పెండ్ చేశారు. విజిలెన్స్ నివేదికల ఆధారంగా కలెక్టర్ సిఫారసు మేరకు వరంగల్‌లోని విద్యాశాఖ ఆర్‌జేడీ కార్యాలయం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులు తిరక్కముందే కథ మొదటికొచ్చింది. వీరిలో కొందరి సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు  శనివారం ఆర్‌జెడీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

వారం రోజుల్లోనే ఏం జరిగిందో...? ఎవరు సచ్ఛీలురని తేలిందో.. ఉన్నపళంగా సస్పెన్సన్లను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ కావటం అనుమానాలకు తెరలేపింది. వరంగల్‌లోని ఆర్‌జెడీ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ సస్పెన్షన్ల వ్యవహారం ప్రహసనాన్ని తలపించింది. ఇంతకీ తెర వెనుక ఏం జరిగింది... రాజకీయ నేతల  ఒత్తిళ్లా... అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలా.. డబ్బులు, పైరవీలకు ఫైళ్లు కదిపారా... అనేది అందరి నోటా చర్చనీయాంశంగా మారింది. కారణమేదైనా.. ఆర్‌జేడీ కార్యాలయం నుంచి ఇటీవల వెలువడ్డ సప్పెన్షన్ ఉత్తర్వులు ఒక్కటొక్కటిగా అభాసుపాలైన తీరు విద్యాశాఖ పరువును బజారుకీడిస్తున్నాయి.
 
ఏప్రిల్‌లో మల్లాపూర్ ఎంఈవో రవీందర్ సస్పెండయ్యారు. ప్రైవేటు పాఠశాలలో చదివిన తన కుమార్తెకు ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లు తప్పుడు సర్టిఫికెటు ఇప్పించినఫిర్యాదులపై ఆయనపై విచారణ జరిగింది. డీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్‌జేడీ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలోనే ఆయన సస్పెన్షన్ ఎత్తివేయటంతో పాటు ఎల్కతుర్తి ఎంఈవోగా బాధ్యతలు అప్పగించారు. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయ వర్గాలు బిత్తరపోయాయి. తప్పు చేసినందుకు రవీందర్‌పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. సస్పెన్షన్ చేసినట్లు నాటకమాడి తాను కోరుకున్న చోటికి బదిలీ చేయటం విమర్శల పాలైంది.  బదిలీల నిషేధం అమల్లో ఉన్న సమయంలో తాము కోరుకున్న చోటికి బదిలీ చేసేందుకు ఆర్‌జేడీ కేంద్రంగా సస్పెన్షన్ల డ్రామా సాగుతోందని.. పైసలు, పైరవీలతోనే అక్కడ ఫైళ్లు కదులుతున్నాయనే ఆరోపణలకు తెరలేచింది.
 
అదే వరుసలో బాలకార్మికుల ప్రత్యేక శిక్షణ కేంద్రాల సస్పెన్షన్లు సైతం ఇప్పుడు నవ్వుల పాలయ్యాయి. ఈనెల 3న ఆర్‌ఎస్‌టీసీల్లో అక్రమాలకు బాధ్యులుగా జిల్లాలో అయిదుగురు ఎంఈవోలు, ఆర్‌వీఎం ప్రత్యామ్నాయ పాఠశాలల కో-ఆర్డినేటర్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్‌జేడీ బాలయ్య ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ఎంఈవో వేణుగోపాల్, ఎల్లారెడ్డిపేట ఎంఈవో రాజయ్య, రామగుండం ఎంఈవో మధుసూదన్, కాటారం ఎంఈవో కిషన్‌రావు,  మంథని ఎంఈవో గంగాధర్, అలెస్కో జిల్లా కో-ఆర్డినేటర్ జయరాజ్ సస్పెండైన వారిలో ఉన్నారు. వీరి పర్యవేక్షణ లోపంతోనే ఆర్‌ఎసీటీసీల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ సిఫారసు మేరకు ఈ వేటు పడింది. కనీసం పది రోజులు తిరక్కముందే... వీరి సస్పెన్షన్లు ఎత్తి వేయటం అనుమానాలకు తావిచ్చింది.

ఆర్‌ఎస్‌టీసీ నిధుల విషయంలో  తమ ప్రమేయం లేదని ఎంఈవోలు అధికార పార్టీకి చెందిన ఓ యువ ఎమ్మెల్యేకు విన్నవించుకోవటంతో... ఆయనే ఆర్‌జేడీపై ఒత్తిడి పెంచి సస్పెన్షన్లు ఎత్తి వేయించినట్లు  తెలుస్తోంది. నిధులు దుర్వినియోగమవుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తిన తరుణంలోనే జిల్లా అధికారులు ఆర్‌ఎస్‌టీసీలకు విడుదల చేసే నిధుల్లో 30 శాతం కోత విధించారు. దీంతో అవినీతికి మోకాలడ్డనట్లయింది. అదే నిధుల కోతను సాకు చూపించి.. అవినీతి, అక్రమాల్లో తమ ప్రమేయం లేదని ఎంఈవోలు సస్పెన్షన్ల వేటు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆర్‌ఎస్‌టీసీలు అవినీతి కూపాలుగా మారినట్లు విజిలెన్స్ విభాగం వేలెత్తి చూపటం కొసమెరుపు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement