వరంగల్ : తలకు గాయమైందని ఓ మహిళ ఆసుపత్రికి వెళితే అక్కడి వైద్యుడు... గాయానికి కుట్లకు బదులు స్టాప్లర్‌తో పిన్నులు వేసి పంపించాడు. ఫలితంగా ఆమె గాయం ఇంకాస్త ముదిరింది. ఈ చోద్యం వరంగల్ జిల్లా తొర్రూరులో జరిగింది. తొర్రూరు మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలసి నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళుతూ ప్రమాదానికి గురై గాయపడింది.
నుదుటిపై గాయం కావడంతో భారతమ్మ అదే రోజు తొర్రూరులోని ఎంబీబీఎస్ వైద్యుడు స్వరూప్‌కుమార్ వద్దకు వెళ్లారు. గాయానికి కుట్లకు బదులు వైద్యుడు పిన్నులు వేస్తుంటే భర్త కూరయ్య అదేంటని ప్రశ్నించగా... ఏమీకాదని చెప్పి పంపించాడు. నొప్పి తీవ్రం కావడంతో భారతమ్మ ఆదివారం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లింది. పిన్నులు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందన్న వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. కాగా పిన్నులు వేసిన వైద్యుడు స్వరూప్‌కుమార్‌ను విలేకరులు ప్రశ్నించగా... ఇలా చాలామందికి పిన్నులు వేస్తున్నామని, ఎవరికీ ఇన్ఫెక్షన్ రాలేదని సూటిగా చెప్పడంతో విన్నవారు విస్తుపోవాల్సి వచ్చింది.