
చోరీకి యత్నించి.. తెల్లమొహంతో ఇంటికి!
ఘట్ కేసర్: కొన్నిసార్లు చోరీ యత్నాలు కాస్త విచిత్రంగానూ, కాస్త నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. సరిగా అలాంటి ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల పరిధిలోని అన్నోజిగూడలో శనివారం అర్ధారత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక అన్నోజిగూడలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎం ఉంది. ఇందులో చోరీ చేయాలని ఇద్దరు గుర్తు తెలియని యువకులు ప్లాన్ చేశారు. శనివారం అర్ధరాత్రి దాదాపు ఒంటిగంట ప్రాంతంలో ఓ యువకుడు ఏటీఎం సెంటర్లోకి వెళ్లగా, రెండో వ్యక్తి బయట కాపాలా ఉన్నాడు.
ఎలాంటి ఆయుధం లేకుండా, ముఖానికి ఎలాంటి ముసుగు లాంటివి ధరించని ఆ యువకుడు చేసిన చోరీ యత్నం కాస్త విచిత్రంగానూ, నవ్వు తెప్పించేదిగా ఉంది. కేవలం చేతినే ఆయుధంగా చేసుకుని ఏటీఎం మేషిన్‌ను తెరవాలని శక్తికొద్దీ యత్నం చేశాడు. ఈ క్రమంలో ఓ చోరుడు నాలుగైదు పర్యాయాలు బయటకు వెళ్లి, మళ్లీ లోపలకి రావడం చేసినా ప్రయోజనం లేకపోయింది. నగదు పెట్టె భాగంలో ఉండే భాగం కాస్త ఊడి రావడంతో సంతోషించారు కానీ దాని లోపల అసలైన నగదు బాక్స్ ఉండటంతో తెల్లమొహాలు వేశారు ఆ యువకులు. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆదివారం ఉదయం బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీకి యత్నించిన యువకుల కోసం ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.