దొంగతనం బయటపడకూడదని పూజలు | robbery case of attapur gas godown | Sakshi
Sakshi News home page

దొంగతనం బయటపడకూడదని పూజలు

Published Wed, Apr 1 2015 8:39 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery case of  attapur gas godown

హైదరాబాద్ :   హైదరాబాద్ అత్తాపూర్ గ్యాస్ గోదాములో చోరీకి పాల్పడిన వ్యక్తులు తమ ఘనకార్యం బయటపడకూడదని ఓ బాబాను ఆశ్రయించి పూజలు చేశారు. కానీ  రాజేంద్రనగర్ పోలీసుల ముందు వారి ఎత్తులు ఫలించలేదు. పోలీసులు దొంగతనం కేసును ఛేదించి దొంగలను, దొంగ సొత్తును పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... గత నెల 25వ తేదీన అత్తాపూర్ చింతల్‌మెట్ గ్యాస్ గోదాములో మేనేజర్ నాగేశ్వర్‌రావు తన గదిలోని కప్‌బోర్డ్‌లో ఏజెన్సీకి చెందిన రూ.4 లక్షల 66 వేలను ఉంచి తాళం వేసి రాత్రి ఇంటికి వెళ్లాడు. మరునాడు ఉదయం వచ్చి చూడగా కప్‌బోర్డు విరగగొట్టి కనిపించగా అందులో డబ్బు కనిపించలేదు. దీంతో ఆయన రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ గోదాములో దొంగతనం ఘటనకు నాలుగు రోజుల ముందు షేక్ నిజాముద్దీన్(26) అనే వ్యక్తి  గోదాములో పెయింటింగ్ పనిచేశాడు. ఆ సమయంలో డబ్బును కప్‌పోర్డులో పెట్టడాన్ని గమనించాడు. ఎలాగైనా ఆ డబ్బును దొంగిలించాలని పథకం వేసిన నిజాముద్దీన్ సమీపంలోని బస్తీకి చెందిన సురేష్(25), విష్ణు(22)ల సాయం తీసుకున్నాడు. అంతా కలసి గత నెల 25వ తేదీన రాత్రి గ్యాస్ గోదాములో ప్రవేశించి నగదును దొంగిలించారు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఓ బాబాను కలసి రూ.10వేలతో పూజలు చేయించారు. వాటిని పంచుకుని, తమ అప్పులు తీర్చుకున్నారు. పూజలేవీ ఫలితం చూపించక చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement