Gas godown
-
చర్లపల్లి గ్యాస్ గోడౌన్లో అగ్నిప్రమాదం
♦ సిలిండర్లలో గ్యాస్ నింపుతుండగా ఎగసిపడిన మంటలు ♦ భారీ శబ్దాలతో పేలిపోయిన సిలిండర్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామికవాడలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్లాంటులో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్లలో ఎల్పీజీ గ్యాస్ నింపుతున్న సమయంలో చిన్న నిప్పురవ్వతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలాయి. అయితే వెంటనే అందులో పనిచేసే కార్మికులు, కంపెనీ చుట్టుపక్కల నివసించే ప్రజలు దూరంగా పరుగులు తీశారు. దీంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదని రాచకొండ పోలీసులు వెల్లడించారు. నీటిని వదిలేయడంతో తప్పిన ముప్పు హెచ్‌పీసీఎల్ ప్లాంటులో షిఫ్టు పద్ధతిలో 24 గంటల పాటు సిలిండర్లలో గ్యాస్ ఫిల్లింగ్ పని నడుస్తుంటుంది. అయితే వారం రోజుల నుంచి సిలిండర్లలో గ్యాస్ నింపుతున్న సమయంలో పైపులు పగిలి నిప్పురవ్వలు వస్తున్నట్లు కార్మికులు గుర్తించారు. అలా పగిలిన పైపులైన్ల మరమ్మతు పని కొనసాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి యథావిధిగా సిలిండర్లు నింపుతున్న సమయంలో నిప్పురవ్వలు వచ్చి, మంటలు చెలరేగాయి. చిన్న మంటగా ఉన్నప్పుడే కార్మికులు గుర్తించి బయటికి పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే వరుసగా సిలిండర్లు పేలడం మొదలైంది. కొందరు కార్మికులు అగ్ని ప్రమాద హెచ్చరిక (ఫైర్ అలారం)ను మోగించారు. దీంతో ప్లాంటులో ఉన్న ఇతర సిబ్బంది.. 45 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన రెండు వాటర్ ట్యాంకుల్లోని నీటిని ప్లాంటులోకి వదిలారు. దాంతో ప్లాంట్‌లో మొత్తం నీరు వ్యాపించి మంటలు తగ్గాయి. ప్రమాద సమయంలో ప్లాంటులో 200 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. వారిలో గ్యాస్ నింపే కార్మికులతో పాటు సిలిండర్ల లోడ్లు తీసుకెళ్లే లారీ డ్రైవర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం విషయం తెలిసిన రాచకొండ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. ప్లాంటు గేట్లు మూసివేశారు. రెండు అంబులెన్సులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఘటనలో ప్రాణ నష్టమేమీ జరగలేదని పోలీసులు చెప్పారు. పరుగులు పెట్టిన ప్రజలు హెచ్‌పీసీఎల్ ప్లాంటులో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో సమీపంలోని జనం భయకంపితులయ్యారు. సమీపంలోని ఇళ్లలోని వారు తమ సామగ్రి తీసుకుని ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టారు. చర్లపల్లి, భరత్‌నగర్, బీఎన్ రెడ్డి నగర్, పెద్ద చర్లపల్లి సమీపంలోని ప్రజలు కుషాయిగూడ, నాగారం వైపు వెళ్లారు. ఇక ప్లాంటులో పనిచేసే కొందరు కార్మికుల కుటుంబ సభ్యులు, మహిళలు ప్లాంటు గేటు వద్దకు వచ్చి తమవారికి ఏమైందోనన్న ఆందోళనతో ఏడవడం కనిపించింది. -
చర్లపల్లి గ్యాస్ గోడౌన్లో అగ్నిప్రమాదం..
-
చర్లపల్లి గ్యాస్ గోడౌన్లో అగ్నిప్రమాదం
-
దొంగతనం బయటపడకూడదని పూజలు
హైదరాబాద్ : హైదరాబాద్ అత్తాపూర్ గ్యాస్ గోదాములో చోరీకి పాల్పడిన వ్యక్తులు తమ ఘనకార్యం బయటపడకూడదని ఓ బాబాను ఆశ్రయించి పూజలు చేశారు. కానీ రాజేంద్రనగర్ పోలీసుల ముందు వారి ఎత్తులు ఫలించలేదు. పోలీసులు దొంగతనం కేసును ఛేదించి దొంగలను, దొంగ సొత్తును పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి బుధవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... గత నెల 25వ తేదీన అత్తాపూర్ చింతల్మెట్ గ్యాస్ గోదాములో మేనేజర్ నాగేశ్వర్రావు తన గదిలోని కప్‌బోర్డ్‌లో ఏజెన్సీకి చెందిన రూ.4 లక్షల 66 వేలను ఉంచి తాళం వేసి రాత్రి ఇంటికి వెళ్లాడు. మరునాడు ఉదయం వచ్చి చూడగా కప్బోర్డు విరగగొట్టి కనిపించగా అందులో డబ్బు కనిపించలేదు. దీంతో ఆయన రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ గోదాములో దొంగతనం ఘటనకు నాలుగు రోజుల ముందు షేక్ నిజాముద్దీన్(26) అనే వ్యక్తి గోదాములో పెయింటింగ్ పనిచేశాడు. ఆ సమయంలో డబ్బును కప్పోర్డులో పెట్టడాన్ని గమనించాడు. ఎలాగైనా ఆ డబ్బును దొంగిలించాలని పథకం వేసిన నిజాముద్దీన్ సమీపంలోని బస్తీకి చెందిన సురేష్(25), విష్ణు(22)ల సాయం తీసుకున్నాడు. అంతా కలసి గత నెల 25వ తేదీన రాత్రి గ్యాస్ గోదాములో ప్రవేశించి నగదును దొంగిలించారు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు మహబూబ్‌నగర్‌కు వెళ్లి ఓ బాబాను కలసి రూ.10వేలతో పూజలు చేయించారు. వాటిని పంచుకుని, తమ అప్పులు తీర్చుకున్నారు. పూజలేవీ ఫలితం చూపించక చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. -
పోలీసుల కోసం గ్యాస్ గోడౌన్
అనంతగిరి, న్యూస్‌లైన్: జిల్లా పోలీసుల కోసం ప్రత్యేకంగా వికారాబాద్‌లోని డీటీసీ వద్ద ఏర్పాటుచేసిన గ్యాస్ గోడౌన్‌ను శుక్రవారం రాష్ట్ర డీజీపీ బీ. ప్రసాదరావు ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన డీజీపీకి ఐజీ, డీఐజీ, ఎస్పీ, సబ్ కలెక్టర్ తదితరులు పూల బొకేలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏఆర్ పోలీసులకు విశ్రాంతి కోసం మెన్ బ్యారక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏఎస్పీ నివాసంలో సిబ్బంది ఉండేందుకు అదనపు గదిని డీజీపీ ప్రారంభించారు. అనంతరం అనంతగిరి గుట్టలోని హరిత రిసార్ట్స్‌లో భోజనం చేసిన డీజీపీ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ రాజకుమారి, సబ్ కలెక్టర్ ఆమ్రపాలి, ఏఎస్పీ వెంకటస్వామి, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, డీటీసీ డీఎస్పీ బుచ్చయ్య, వికారాబాద్ డీఎస్పీ నర్సింలు, ఆర్ఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.