రెక్కీలు నిర్వహిస్తూ చోరీలు
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు
నిజామాబాద్ : మళ్లీ మహారాష్ట్రకు చెందిన దొంగలు నిజామాబాద్ జిల్లాలో కలకలం సృష్టిస్తున్నారు. రెక్కీలు నిర్వహిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ నగరంలోని వైష్ణవి అపార్టుమెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు చోరీకి యత్నించారు. వారి కదలికలు సీసీ కెమెరాల పుటేజీల్లో లభించాయి. దొంగతనానికి వచ్చిన ఈ ముఠా మహారాష్ట్రకు చెందినదేనని పోలీసులు నిర్ధారించారు. వైష్ణవి అపార్టుమెంట్ మొదటి అంతస్తులో 105 నంబరు ప్లాట్‌కు తాళం వేసి ఉన్నట్లు దొంగలకు ఎలా తెలిసి ఉంటుందోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.
దొంగతనానికి ఒకరోజు ముందుగా రెక్కీ నిర్వహించి ఉంటే.. పగటి పూట సాధారణ వేషధారణతో వచ్చిన దొంగలు అపార్టుమెంట్ వాచ్‌మన్ అనుమతి లేకుండా లోపలకు ఎలా ప్రవేశించారనేది తేలాల్సి ఉంది. పగలు దర్జాగా వచ్చి రెక్కీ నిర్వహించి, రాత్రివేళలో అపార్టుమెంట్ వెనుక భాగం ప్రహరీ దూకి లోపలకు ప్రవేశించారు. అదే సమయంలో అపార్టుమెంట్‌వాసి ఒకరు అక్కడకు వచ్చి దొంగలను చూసి కేకలు పెట్టడంతో దొంగతనానికి బ్రేక్ పడింది. అపార్టుమెంట్ వాసి ఆ సమయంలో రాకున్నట్లయితే తాళం వేసి ఉన్న ఇల్లు గుల్ల అయ్యేది.
జిల్లాకు సరిహద్దుల్లో..
జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలో దాదాపు 10 వరకు దొంగల ముఠాలున్నాయి. వీరు అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతూ పోలీసులు అప్రమత్తం అయ్యేలోపే జిల్లా సరిహద్దు దాటేస్తుంటారు. జిల్లా సరిహద్దు దాటేందుకు దొంగలు రైలు మార్గాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. మహా దొంగలు ఒక్కో ముఠా ఒక్కో పద్ధతిలో చోరీలకు పాల్పడుతుంది. కత్తులతో బెదిరిస్తూ, హత్యలు చేస్తూ నగదు, బంగారు సొత్తుతో ఉడాయిస్తారు. పోలీసులకు లభించిన ఆధారాలతో కొన్నిసార్లు దొంగలను అరెస్టు చేసి జైలుకు పంపినా.. వారిలో మార్పు లేదు. జైలునుంచి వచ్చాక మళ్లీ అదే పద్ధతిలో చోరీలకు పాల్పడుతుంటారు.
గతంలో ఏటీఎంలలో చోరీలు
జిల్లాలో గతేడాది నవంబరులో ఏటీఎంలలో చోరీలకు పాల్పడింది మహారాష్ట్ర ముఠాగా పోలీసులు గుర్తించారు. ఏటీఎంలను గ్యాస్ కట్టర్లతో తొలగించి చోరీలకు పాల్పడి లక్షలాది రూపాయలు ఎత్తుకుపోయారు. జిల్లాతో పాటు, మెదక్‌లోనూ దొంగలు ఏటీఎంలలో చోరీలకు పాల్పడ్డారు. కొంత కాలం తర్వాత పోలీసులు ఈ కేసు ఛేదించి దొంగలను అరెస్టు చేశారు. కాగా జిల్లాలో దొంగతనాలకు పాల్పడే వారికి ఎవరి సహకారమైన ఉండి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అపార్ట్ మెంట్లే టార్గెట్
నగరంలోని కొన్ని అపార్టుమెంటులలో వాచ్‌మన్‌లు పక్కాగా అపార్టుమెంట్‌కు వచ్చిపోయే వారి వివరాలు సేకరిస్తుండగా, మరికొన్నింలో ఇటువంటి విషయాలేమీ పట్టించుకోవడంలేదు. దీంతో దొంగల దృష్టి వీటిపై పడుతోంది. ప్రతి అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్‌శాఖ ఎప్పటి నుంచో సూచిస్తోంది. నగరంలో దాదాపు 120 వరకు అపార్టుమెంట్లు ఉండగా వీటిలో కేవలం 20 శాతం వరకు అపార్టుమెంట్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిసింది.
వైష్ణవి అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు ఉండడంతో దొంగలు సీసీ కెమెరాకు చిక్కారు. వాటి ఆధారంగా సీసీఎస్ పోలీసులు దొంగల కోసం గాలించే పనిలో పడ్డారు. దొంగలు వైష్ణవి అపార్టుమెంట్‌లో వెనుక భాగంలోని ప్రహరీ దూకి దొంగలు లోపలకు ప్రవేశించారు. అదే ప్రహరీపై కంచె ఏర్పాటు చేసుకుని ఉంటే దొంగలు లోపలకు వచ్చే అవకాశం ఉండేదికాదు. ప్రతి అపార్టుమెంట్ ప్రహరీపై ఇనుప వైరుతో కంచె ఏర్పాటు చేసుకుంటే మేలని భావిస్తున్నారు.