పనిచేసిన ఇంటికే కన్నం
Published Sat, Apr 16 2016 6:04 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
జూబ్లీహిల్స్ (హైదరాబాద్) : పని చేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-10సీ లోని ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో నివసించే డాక్టర్ వర్షిణి తన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. అస్మన్‌ఘాట్ విద్యానగర్‌కు చెందిన జి.శ్రీనివాస్(29) గత నెల రోజుల నుంచి ఆ ఇంట్లో పెయింటింగ్ పని చేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన పండుగ సందర్భంగా ఆ ఇంట్లో పనులు ఆపేశారు. అయితే ఆ ఇంట్లో ఎక్కడ ఏం ఉందో.. అలమారా తాళం చెవులు ఎక్కడుంటాయో పసిగట్టిన శ్రీనివాస్ దొంగతనానికి ప్లాన్ వేశాడు. అయిదు రోజుల క్రితం వర్షిణి ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లిపోయిన విషయం కనిపెట్టిన శ్రీనివాస్.. ఇంటి వెనుక గోడకు ఏసీ కోసం ఏర్పాటు చేసిన కన్నంలోనుంచి లోపలికి ప్రవేశించాడు.
బెడ్‌రూం అలమారాలో ఉన్న విలువైన ఆభరణాలు తస్కరించి పరారయ్యాడు. వర్షిణి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ఇంటికి ఎవరెవరు వస్తుండేవారో చిట్టా తయారు చేశారు. ఇటీవల పనిమానేసిన వారి వివరాలు కూడా సేకరించారు. సరిగ్గా నగలు పోయిన రోజున శ్రీనివాస్ ఫోన్ సిగ్నల్స్ పరిశీలించగా ఆ రోజు గంటపాటు ఎమ్మెల్యే, ఎంపీల కాలనీలో ఉన్నట్లు తేలింది. దీంతో శ్రీనివాస్‌ను విచారించగా దొంగతనం బయటపడింది. నిందితుడి నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక నెక్లెస్‌ను తన స్నేహితుడు మహేష్‌తో కలిసి విక్రయించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌తో పాటు మహేష్‌ను కూడా అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement