సీతమ్మ మంగళ సూత్రాలు మాయం
భద్రాద్రి ఆలయంలో బంగారు నిల్వలపై గందరగోళం
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామి వారి ఆలయం లో సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామి మెడలోని బంగారు లాకెట్ మాయమయ్యాయి. ఈ విషయాన్ని దేవస్థానం ఈవో రమేష్‌బాబు ధ్రువీకరించారు. ఆలయంలో 2 ఆభరణాలు మాయమైనట్లు శనివారం ప్రచారం జరగడం.. ఆ విషయాలు పత్రికల్లో రావడంతో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయంలోని ఆభరణాలు ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలోని 11 మంది అర్చకుల బృందం పర్యవేక్షణలో ఉంటాయని ఈవో చెప్పారు. ఇందులో రెండు ఆభరణాలు కని పించలేదని అర్చకులు తన దృష్టికి తీసుకు రాగా వాటి లెక్క తేల్చాలని ఆదేశించి నట్లు చెప్పారు.
అర్చకులు సోమవారం వరకు గడువు కోరినట్లు, వారు నివేదిక ఇచ్చాక.. తానూ స్వయంగా ఆభరణాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అర్చకులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, స్వామివారి ఉత్సవమూర్తులను అమెరికా వారికి అమ్మకానికి పెట్టడం, బంగారు తాపడం చేయించే విషయంలో తీవ్రమైన గోప్యత పాటించటంతో అప్పట్లో రేగిన దుమారం చర్చనీయాంశమైంది. తాజాగా ఆలయంలో ఆభరణాలు మాయం కావడం ఇక్కడి పాలన తీరును ఎత్తిచూపుతోంది. తాజా పరిణామాలతో భద్రతా ప్రమాణలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.