‘ఎంట్రీ’ అదిరింది!
4 చెక్‌పోస్టుల నుంచి ఒక్కరోజే రూ. 1.34 కోట్లు పన్ను వసూలు
సాక్షి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్: రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించే వాహనాలకు అంతర్రాష్ట్ర పన్ను విధింపు ద్వారా బుధవారం ఒక్కరోజే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని నాలుగు చెక్‌పోస్టుల నుంచి మొత్తం రూ. 1.34 కోట్లు వసూలయ్యాయి. వీటిలో ఏపీ నుంచి వచ్చిన బస్సుల ద్వారా వసూలైన మొత్తం రూ. 35 లక్షలని సమాచారం. నల్లగొండ జిల్లాలోని మూడు చెక్‌పోస్టుల నుంచి రూ. 54 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ చెక్‌పోస్టు నుంచి రూ. 80 లక్షలు వచ్చినట్లు రవాణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే నల్లగొండ జిల్లాలోని నల్లబండగూడెం(కోదాడ), వాడపల్లి, నాగార్జునసాగర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ చెక్‌పోస్టు వద్ద పన్ను వసూలు ప్రారంభించారు.
ప్రైవేటు ట్రావెల్స్ నుంచి త్రైమాసిక పన్ను(సీటుకు రూ. 3,675 చొప్పున), క్యాబ్‌ల నుంచి వారం రోజుల పన్ను(సీటుకు రూ. 220 చొప్పున), లారీలకు సాధారణ పన్ను వసూలు చేశారు. నల్లగొండ జిల్లాలోని మూడు చెక్‌పోస్టుల వద్ద దాదాపు 250 వాహనాలను తనిఖీ చేయగా వాటిలో 33 ప్రైవేట్ ట్రావెల్స్, 30 మ్యాక్సీ క్యాబ్‌లు, 187 లారీలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ చెక్‌పోస్టు వద్ద 37 ప్రైవేటు బస్సుల నుంచి రూ.56.32 లక్షలు, లారీలు, ఇతర గూడ్స్ వాహనాల నుంచి రూ.16,800, క్యాబ్‌ల నుంచి రూ.16,450 వసూలు చేసినట్లు స్థానిక ఆర్టీవో కిష్టయ్య తెలిపారు. పన్ను విధింపును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన బస్సులను సరిహద్దు ఆవలికే పరిమితం కావడంతో 37 బస్సులు మాత్రమే రాష్ర్టంలోకి ప్రవేశించాయి.