వికారాబాద్: విద్యుత్ బిల్లులు కొండలా పేరుకుపోతున్నా ఆ శాఖ అధికారులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. వికారాబాద్ డివిజన్‌లో ప్రభుత్వ సంస్థలనుంచి సుమారుగా రూ.50 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిలు క్రమంగా పెరిగిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
డీఈ, ఏడీఈలతోపాటు సిబ్బంది ఏమైనా చేతివాటం ప్రదర్శిస్తూ ఆయా సంస్థలకు వెసులుబాటు కల్పిస్తున్నారా.. లేక వసూలు చేసిన డబ్బులను లెక్కలో చూపడం లేదా.. అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం కరెంట్ కష్టాలతో అల్లాడుతుంటే ఎందుకింత నిర్లక్ష్యమని విద్యుత్ అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పట్టించుకోరా..
గ్రామీణ, గిరిజన తండాల్లో నేరుగా విద్యుత్ స్తంభాలకు రాత్రి పూట కొండ్లు వేసి అక్రమ కరెంట్‌ను వాడుతున్నారని ఆ శాఖ అధికారులే అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గట్టిగా బిల్లు విషయం ఎత్తితే తెలిసిన రాజకీయ నాయకుడితో ఇంకొంత సమయం ఇవ్వాలని సిఫార్సు చేయిస్తున్నారు. వికారాబాద్ నియోజవర్గంలో రూ.25కోట్లు, పరిగిలో రూ.25 కోట్లు, చేవెళ్లలో రూ.20 కోట్లు, తాండూరులో రూ.30 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో రెవెన్యూ, పోలీస్ శాఖలే ఎక్కువ బకాయిలున్నట్లు సమాచారం. అయితే విద్యుత్ అధికారులు బిల్లుల గూరించి ఆ శాఖలను టచ్ చేయాలంటేనే జంకుతున్నారు. అదే సామాన్యులయితే ముక్కు పిండి మరీ బిల్లులు వసూలు చేస్తున్నారు.
వారిపైనా ఒత్తిడి తెస్తాం: డీఈ
వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లిస్తేనే మేం మరిన్ని సేవలను అందించే అవకాశం ఉంటుందని డీఈ సాంబశివరావు అన్నారు. ఉన్నతాధికారులను సంప్రదించి ఇప్పటివరకు ఉన్న పాత బకాయిలను సర్‌చార్జి లేకుండా తీసుకొనే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎవరైనా సకాలంలో కరెంట్ బిల్లులు చెల్లించకుంటే వారి ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వ సంస్థల బిల్లులు రూ.50 కోట్ల వరకు పేరుకుపోయినమాట వాస్తవమేనన్నారు. ఇక మీదట వారిపై కూడా ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.
బకాయి కుప్ప!
Published Thu, Nov 6 2014 11:31 PM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement