లక్షలొచ్చి పడ్డాయ్‌!  | Rs 13 lakhs above into account of Medchal Person | Sakshi
Sakshi News home page

లక్షలొచ్చి పడ్డాయ్‌! 

Published Wed, Jun 19 2019 3:39 AM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

Rs 13 lakhs above into account of Medchal Person - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిన్న పొరపాటు అధికారులకు చుక్కలు చూపెడుతోంది. సర్కారీ నిధులు ముక్కుమొహం తెలియని వ్యక్తి ఖాతాలో జమ కావడం అధికారుల ముప్పుతిప్పలకు కారణంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.13.57 లక్షలు మేడ్చల్‌ జిల్లా వాసి ఖాతాలో జమ కావడంతో ఈ నిధులను రాబట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక కలెక్టర్‌ సాయం అర్థించింది. బిహార్‌ పంచాయతీరాజ్‌ శాఖ 14వ ఆర్థిక సంఘం నిధులను ´పట్నాలోని ఎస్‌బీఐ బహేలి రోడ్డు బ్రాంచి నుంచి ఒకసారి రూ.5,946, రెండోసారి రూ.13,51,898.99లను ఆర్‌టీజీఎస్‌ ద్వారా బదిలీ చేయమని కోరింది. అయితే, సదరు ఎస్‌బీఐ బ్యాంకు నిర్వాకమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ, నిధులు బదలాయించాలని పేర్కొన్న బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నంబర్‌ను తప్పుగా నమోదు చేయడంతో ప్రభుత్వ పద్దులో జమ కావాల్సిన నిధులు కాస్తా మేడ్చల్‌ జిల్లా వాసి ఖాతాలోకి వెళ్లాయి.

బోడుప్పల్‌లోని బృందావన్‌ కాలనీలో నివాసముండే చల్లా విక్రమ్‌రెడ్డి ఖాతాలోకి రూ.13.57 లక్షలు జమయ్యాయనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బిహార్‌ ప్రభుత్వం, నిధుల రికవరీకి నానా తంటాలు పడుతోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి అమృత్‌లాల్‌ మీనా మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. విక్రమ్‌రెడ్డి చిరునామాను పేర్కొంటూ డబ్బులు వసూలు చేయాలని కోరారు. అయితే, విక్రమ్‌రెడ్డి ఖాతాలో జమ అయిన నిధులను ఆయన ఖర్చు చేయకుంటే ఇబ్బందిలేదు.. లేనిపక్షంలో అతడి నుంచి నిధులెలా రికవరీ చేయాలనేదానిపై పంచాయతీరాజ్‌ శాఖ తలపట్టుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement