Govt funding
-
లక్షలొచ్చి పడ్డాయ్!
సాక్షి, హైదరాబాద్: చిన్న పొరపాటు అధికారులకు చుక్కలు చూపెడుతోంది. సర్కారీ నిధులు ముక్కుమొహం తెలియని వ్యక్తి ఖాతాలో జమ కావడం అధికారుల ముప్పుతిప్పలకు కారణంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.13.57 లక్షలు మేడ్చల్ జిల్లా వాసి ఖాతాలో జమ కావడంతో ఈ నిధులను రాబట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక కలెక్టర్ సాయం అర్థించింది. బిహార్ పంచాయతీరాజ్ శాఖ 14వ ఆర్థిక సంఘం నిధులను ´పట్నాలోని ఎస్బీఐ బహేలి రోడ్డు బ్రాంచి నుంచి ఒకసారి రూ.5,946, రెండోసారి రూ.13,51,898.99లను ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయమని కోరింది. అయితే, సదరు ఎస్బీఐ బ్యాంకు నిర్వాకమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ, నిధులు బదలాయించాలని పేర్కొన్న బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్‌ను తప్పుగా నమోదు చేయడంతో ప్రభుత్వ పద్దులో జమ కావాల్సిన నిధులు కాస్తా మేడ్చల్ జిల్లా వాసి ఖాతాలోకి వెళ్లాయి. బోడుప్పల్‌లోని బృందావన్ కాలనీలో నివాసముండే చల్లా విక్రమ్‌రెడ్డి ఖాతాలోకి రూ.13.57 లక్షలు జమయ్యాయనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బిహార్ ప్రభుత్వం, నిధుల రికవరీకి నానా తంటాలు పడుతోంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి అమృత్లాల్ మీనా మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. విక్రమ్‌రెడ్డి చిరునామాను పేర్కొంటూ డబ్బులు వసూలు చేయాలని కోరారు. అయితే, విక్రమ్‌రెడ్డి ఖాతాలో జమ అయిన నిధులను ఆయన ఖర్చు చేయకుంటే ఇబ్బందిలేదు.. లేనిపక్షంలో అతడి నుంచి నిధులెలా రికవరీ చేయాలనేదానిపై పంచాయతీరాజ్ శాఖ తలపట్టుకుంటోంది. -
జీఎస్టీ...అయితే ఏంటి?
ఒకే దేశం..ఒకే పన్ను నినాదంతో రూపుదిద్దుకున్న జీఎస్టీ(వస్తు సేవల పన్ను) విధానం దేశంలో అమల్లోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆచరణలో వినియోగదారుడికి కలిగిన ప్రయోజనం శూన్యంగా ఉంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు అమాంతం దిగివస్తాయని కేంద్ర ప్రభుత్వం ఆడంబరంగా చెప్పిన మాటలు వాస్తవ రూపం దాల్చలేదు. ధరలు ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరిగాయి. అక్రమ వ్యాపారం కూడా యథేచ్ఛగా జరుగుతూనే ఉంది. సాక్షి, పాతగుంటూరు: జీఎస్టీ అమల్లోకి వచ్చాక వ్యాట్ కంటే ఈ విధానం కింద ప్రభుత్వానికి గణనీయంగా పన్ను వసూళ్లు పెరిగిన మాట వాస్తవమే. అయితే ఇదే సందర్భంలో కొద్దిమంది వ్యాపారులు ఈ పన్నును సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చి పలు దఫాలుగా పన్ను రేట్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తెచ్చినా ధరల్లో ఏమాత్రం వ్యత్యాసం కనబడటం లేదు.పూర్తిస్థాయిలో ఆన్లైన్ ప్రక్రియ అమలు కాక, రూ.200 దాటిన సరుకులకు బిల్లులు ఇవ్వకపోవడంతో వినియోగదారుల జేబుకు చిల్లుపడుతోంది. వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించకపోవడం ఈ విషయంలో ఆ వ్యాపారులకు కలిసివస్తోంది. రాత్రి వేళల్లో సరుకు ఎలాంటి వేబిల్లు లేకుండా రవాణా జరుగుతున్నా అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. 30 శాతం పెరిగిన రాబడి దేశంలో 2017 జూలై ఒకటో తేదీ నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలో గతం కంటే పన్ను రాబడులు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యాట్‌తో పోలిస్తే జీఎస్టీ వలన 30 శాతం రాబడి అధికంగా వస్తోందని సీటీవో వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి జీఎస్టీ పన్ను విధానం ఫలితంగా ఆదాయం పెరిగినా వినియోగదారులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలగడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీ అమలులో కొందరు వ్యాపారులు సాగిస్తున్న అక్రమాలపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.బిల్లులు లేకుండా ఇష్టారాజ్యంగా ధరలను పెంచి విక్రయాలు నిర్వహిస్తున్నారనే క్రమంలో ప్రభుత్వ ఆదేశాలతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డెకాయ్ ఆపరేషన్ పేరుతో దుకాణాలపై దాడులు తనిఖీలు చేపట్టారు. ఇదే సందర్భంలో వ్యాపార సంఘాల నుంచి వచ్చిన ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గింది. ఆపై తదుపరి చర్యలను పక్కన పెట్టింది. దీన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రూ.200 విలువ దాటిన ఏ వస్తువుకైనా డీలర్‌కు కేటాయించిన రిజిస్ట్రేషన్ గుర్తింపుతో బిల్లు ఇవ్వాలన్న నిబంధన ఉండేది. జీఎస్టీ ప్రకారం పన్ను వసూలు, వినియోగదారులకు చిల్లు పడకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పర్యవేక్షణ ఉన్నా అక్కడక్కడ వ్యాపారులదే పైచేయి అవుతోంది. తెల్ల కాగితాలపై కాకుండా దుకాణం, సంస్థ పేరు మీదుగా బిల్లులు ఇవ్వడం లేదు. అయినా వినియోగదారుల నుంచి రాతపూర్వక ఫిర్యాదులు అందడం లేదన్న కారణం చూపి అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు. జిల్లాలోని రెండు డివిజన్ల(నరసరావుపేట, గుంటూరు)లో జీఎస్టీ వసూళ్లు పెరిగి ఆదాయం గణనీయంగా లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రారంభమైన 2018–19 ఆర్థిక సంవత్సరంలో నరసరావుపేట డివిజన్‌కు రూ.211,72,47 కోట్లు, వాహన తనిఖీల ద్వారా రూ.61,71 లక్షల రూపాయలు ఆదాయం రాగా, గుంటూరు డివిజన్లో రూ.45254.51 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నరసరావుపేట డివిజన్లో రెగ్యులర్ డీలర్లు మొత్తం 14746 వేల మంది ఉండగా, కాంపోజిషన్ స్కీమ్ ద్వారా 6753 మంది డీలర్లు నమోదై ఉన్నారు.గుంటూరు డివిజన్లో మొత్తం డీలర్లు 18,899 మంది ఉండగా,వారిలో రెగ్యులర్13,339, కాంపోజిషన్ స్కీంలో 5,689 మంది డీలర్లు నమోదై ఉన్నారు. పన్ను పరిధిలోకి... వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటిన వ్యాపారులు జీఎస్టీ కింద డీలర్‌గా నమోదు చేసుకోవాల్సి ఉంది. ఏడాదికి రూ.1.50 కోట్ల లావాదేవీలు దాటితే కాంపోజిట్ డీలర్‌గా గుర్తింపు పత్రం తీసుకోవాలి. నిబంధనలు ప్రకారం కాంపోజిట్ డీలరు వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేయరాదు. ఈ విషయాన్ని తెలిపేందుకు దుకాణాల ముందు బోర్డు ప్రదర్శించాల్సి ఉంది. 2018 ఏప్రిల్ నుంచి రూ.50 వేలు దాటితే సరుకు, సామాగ్రి, ఇతర వాటికి వేబిల్లు ఉండాల్సిందేనని జీఎస్టీలో నిబంధన విధించారు. రూ.200 దాటిన విక్రయాలపై బిల్లులేవీ? రూ.200 దాటిన విక్రయాలపై ఆన్లైన్ బిల్లులు ఇవ్వని కారణంగా వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. ధరల వ్యత్యాసంలో కూడా తేడా కనిపించడం లేదు.కొందరు వ్యాపారులు సరకు నాణ్యతను సాకుగా చూపించి ఇష్టారాజ్యంగా ధరలను వసూలు చేస్తున్నారు. ప్రధాన వ్యాపార కూడళ్లలోని దుకాణాలలో ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. జీఎస్టీలో గుర్తింపు పొందిన వ్యాపారి(డీలర్)విధిగా జారీ చేసిన ధ్రువీకరణ పత్రం దుకాణాల్లో ప్రదర్శించాలి. దీన్ని బేఖాతరు చేసిన వర్తకులపై ఆకస్మిక తనిఖీలు చేసి అపరాధ రుసుం విధించాల్సి ఉంది. కానీ అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదు.రూ.50 వేలు విలువ దాటిన సరుకు, సామాగ్రిని రవాణా చేసే కొందరు వ్యాపారులు వేబిల్లు లేకుండా రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు చేస్తే చర్యలు జీఎస్టీలో వినియోగదారుల ప్రయోజనాలకు గండికొడుతున్న వ్యాపారులపై రాత పూర్వకంగా ఫిర్యాదులు అందలేదు. రూ.200 విలువ దాటిన వస్తువులపై తప్పకుండా బిల్లు తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపాలి. అప్పుడే ధరలు వ్యత్యాసం కనబడి, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. వ్యాపారులు ప్రతి లావాదేవీ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాలి.జీఎస్టీ పరంగా వినియోగదారులను మోసగించవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని డీలర్ల సమావేశాల్లో స్పష్టం చేస్తున్నాం. రూ.50 వేలు దాటిన సరుకు వేబిల్లుతో రవాణా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. –పి.రాజాబాబు, జాయింట్ కమిషనర్, రాష్ట్ర పన్నుల శాఖ, గుంటూరు డివిజన్ -
రూ.1,000 కోట్ల కమీషన్లకు ముఖ్యనేత ‘టెండర్’
సాక్షి, అమరావతి: కంచె.. చేను మేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సినవారే దొరికినంత దోచుకుంటున్నారు. రాయలసీమలో తాజాగా చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల టెండర్లే అందుకు నిదర్శనం. కోటరీ కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు జరిపారు.. కమీషన్ల లెక్క తేలడంతో వారికి తలా ఒక ప్రాజెక్టు కేటాయించారు. రూ.4,515.61 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు ప్రాజెక్టులకు సోమవారం వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. ఈ క్రమంలో అధికారుల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేశారు. టెండర్లను పారదర్శకంగా నిర్వహిస్తే కనీసం పది శాతం తక్కువ ధరలకు కాంట్రాక్టర్లు కోట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖజానాకు రూ.474.24 కోట్ల మేర మిగిలేది. ముఖ్యనేత కాంట్రాక్టర్లను కుమ్మక్కయ్యేలా చేయడంతో సగటున 4.99 శాతం అధిక ధరలకు కోట్ చేస్తూ దాఖలు చేసే షెడ్యూళ్లను ఎల్–1గా తేల్చి టెండర్లు ఖరారు చేయనున్నారు. దీని వల్ల ఖజానాకు రూ.272 కోట్ల మేర నష్టం వాటిల్లుతుంది. అంచనా వ్యయ ప్రతిపాదనల్లోనే అక్రమాలకు పాల్పడటం వల్ల వ్యయాన్ని సుమారుగా రూ.1,000 కోట్లకుపైగా పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. టెండర్లను ఖరారు చేశాక కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి రూ.వెయ్యి కోట్లకుపైగా ముడుపులు వసూలు చేసుకుని ఎన్నికల్లో వెదజల్లడానికి స్కెచ్ వేశారు. వివరాల్లోకి వెళితే.. ఆర్డీఎస్ కుడి కాలువతోపాటు వేదవతి ఎత్తిపోతల, గాలేరు–నగరి రెండో దశ, హంద్రీ–నీవా రెండో దశలో మిగిలిపోయిన పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని 2014లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇన్నేళ్లపాటు వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి ఇస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆర్డీఎస్కు మినహా మిగిలిన ప్రాజెక్టులకు హైడ్రాలాజికల్ క్లియరెన్స్ లేదు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పక్కన పెట్టేసి.. ఉజ్జాయింపుగా అంచనాలు వేసి.. వాటి ఆధారంగానే టెండర్లు పిలవాలంటూ అధికారులపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అక్రమాలకు నిదర్శనాలివే.. - ఆర్డీఎస్ కుడి కాలువ (ఆర్డీఎస్ ఆనకట్ట ఎగువన కోసిగి మండలం బాత్రబొమ్మలాపురం నుంచి ఉల్చాల వరకూ 162.849 కి.మీ.ల మేర కాలువ తవ్వాలి. నాలుగు రిజర్వాయర్లు, నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోయడం ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులు చేయాలి) పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని కర్నూలు జిల్లా అధికారులు ప్రతిపాదించారు. కానీ వాటిని తోసిపుచ్చిన సర్కార్ రూ.1,557.37 కోట్లతో ఒకే ప్యాకేజీ కింద ఆ పనులను ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే గడువు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - వేదవతి ఎత్తిపోతల పథకం (వేదవతి నుంచి 4.20 టీఎంసీలను మూడు దశల్లో ఎత్తిపోసి 2.029 టీఎంసీల సామర్థ్యంతో హాలహర్వి రిజర్వాయర్, 1.027 టీఎంసీల సామర్థ్యంతో మొలగవల్లి రిజర్వాయర్‌ను నిర్మించి 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా డిస్ట్రిబ్యూటరీలు చేయాలి) పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవడానికి అనుమతి ఇవ్వాలని కర్నూలు జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను సర్కార్ బుట్టదాఖలు చేసింది. ఈ పనులను ఒకే ప్యాకేజీ కింద రూ.1,536.28 కోట్ల అంచనా వ్యయంతో, ఎల్ఎస్–ఓపెన్ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే గడువుతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ – యోగి వేమన రిజర్వాయర్– హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల పథకం (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి అనంతపురం జిల్లాలోని యోగి వేమన రిజర్వాయర్‌కు జలాలను తరలించి 12,880 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు.. యోగి వేమన రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం రెండో దశకు కాలువలోకి నీటిని ఎత్తిపోయడం) పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అనంతపురం జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలను సర్కార్ తుంగలో తొక్కింది. ఈ పనులను ఒకే ప్యాకేజీ కింద రూ.1,182.35 కోట్ల వ్యయంతో, ఎల్ఎస్–ఓపెన్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేయాలనే గడువు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - మేర్లపాక చెరువు నుంచి–మల్లెమడుగు రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పనులకు రూ.239.61 కోట్లతో ఎల్ఎస్–ఓపెన్ విధానంలో 12 నెలల్లో పూర్తి చేయాలనే నిబంధన పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. - అధికారులు సూచించినట్టు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే.. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉండేది. అప్పుడు తక్కువ ధరలకే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే అవకాశం ఉండేది. కానీ.. సర్కార్ ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవడంతో కోటరీలోని నలుగురు బడా కాంట్రాక్టర్లు మాత్రమే ఈ పనులు చేయడానికి అర్హత సాధిస్తారు. ఆ మేరకే నిబంధనలు పెట్టారు. ఎన్నికలకు ఇం‘ధనం’ కోసమే.. నాలుగు ప్రాజెక్టులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్.. ఇందులో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ – యోగివేమన రిజర్వాయర్–హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల మినహా మిగిలిన 3 ప్రాజెక్టుల టెండర్లలో షెడ్యూలు దాఖలు చేయడానికి 18న తుది గడువుగా విధించింది. 19న టెక్నికల్ బిడ్.. 21న ప్రైస్ బిడ్ ఖరారు చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు 4 ప్రాజెక్టుల పనులను చేపట్టడానికి కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి రూ.1,000 కోట్లు కమీషన్లు దండుకుని వాటినే ఎన్నికల్లో వెదజల్లడమేనన్నది స్పష్టమవుతోంది. -
వేర్పాటువాదులకు ప్రభుత్వ ధనంపై పిల్
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు ప్రభుత్వం నిధులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. వేర్పాటువాదుల విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యవహారాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా చూడాలని పిల్ లో కోరారు. వేర్పాటువాదులకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలుపైగా ఖర్చు చేసిందని వెల్లడించారు. ప్రభుత్వ ధనాన్ని వేర్పాటువాదులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. పిటిషన్ వెల్లడించిన అంశాలతో ఏకీభవిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. అయితే పిల్ ను కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్పించాలని సూచించింది.