![Rs. 535 crores worth of Fisherman - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/22/Untitled-19.jpg.webp?itok=o4f46kEb)
సాక్షి, హైదరాబాద్: చేపల ఉత్పత్తి పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో నీలి విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగిం చింది. దీనిలో భాగంగా మత్స్యకారులకు రూ. 535 కోట్ల విలువైన పరికరాలను సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సబ్సిడీపై అందజేసింది. ఈ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో 1.69 లక్షలు అర్హమైనవిగా నిర్ధారించి 1.60 మందికి వివిధ రకాల పరికరాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకూ 80 వేలమంది లబ్ధిదారులు తమ వాటా సొమ్మును ప్రభుత్వానికి చెల్లించగా వారికి రూ. 535.93 కోట్ల విలువైన 77,448 యూనిట్ల పరికరాలను అందజేసింది. 60,398 మందికి వెండింగ్ యూనిట్ల కింద పంపిణీ చేసే మోపెడ్లను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకూ 50,460 మందికి పంపిణీ చేసింది. ప్లాస్టిక్ ఫిష్ క్రేట్స్ 30 వేలకు గాను, 3,515 ఇచ్చారు. 9,759 లగేజీ ఆటోలకు గాను, 2 వేలు పంపిణీ చేశారు.
రూ. వెయ్యి కోట్లు మంజూరు
సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద లబ్ధిదారులకు అందజేసే పరికరాలకు ప్రభుత్వం 75% నుంచి 100% వరకు రాయితీని కల్పిస్తోంది. దీని అమలుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసింది. చేపలు అమ్మేందుకు 50 వేల బైక్‌లను 75% రాయితీపై ఇస్తోంది. ద్విచక్ర వాహనం ధర రూ. 50 వేలు కాగా, లబ్ధి దారుడు రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ చేపల క్రేట్లు 30 వేలు ఇస్తారు. వాటి ధర ఒక్కోటి రూ.4 వేలు కాగా, లబ్ధిదారుడు రూ. వెయ్యి చెల్లిస్తే సరిపోతుంది. 45 వేల వలలు, క్రాఫ్టులు అందజేస్తారు. పోర్టబుల్ చేపల అమ్మకానికి కియోస్కూలు 19 వేల యూనిట్లు ఇస్తారు. వాటి ధర రూ. 20 వేలు కాగా, లబ్ధిదారుడు రూ. 5 వేలు చెల్లిస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment