రూ.5,500 కోట్ల పనులకు టెండర్లు! | Rs 5,500 crore tender for work! | Sakshi
Sakshi News home page

రూ.5,500 కోట్ల పనులకు టెండర్లు!

Published Tue, Sep 4 2018 2:13 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

Rs 5,500 crore tender for work! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ పనులపై నీటి పారుదల శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులు, కాళేశ్వరంలోని కాల్వల పనులను ప్రారంభించేందుకు వీలుగా టెండర్లకు అనుమతి తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా రూ.5,500 కోట్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెండర్లు పిలిచే పనిలో పడింది. 

మలిదశకు ‘పాలమూరు’ 
12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టారు. ఈ పథకంలో 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గతేడాదిలోనే పనులు ప్రారంభించారు. అయితే ఉద్దండాపూర్‌ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం అవన్నీ కొలిక్కి వస్తుండటంతో ఈ పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. 

మూడు ప్యాకేజీలు.. రూ.4,268 కోట్లు 
ఉద్దండాపూర్‌ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియను ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు, ఇక్కడ 18 కిలోమీటర్ల మేర ఓపెన్‌ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్‌ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. దీనికి రూ.1,260 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్యాకేజీ–20లో స్టేజ్‌–5 పంప్‌హౌజ్‌ నిర్మాణానికి రూ.885 కోట్లు, 2.80 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.915.90 కోట్లు అంచనా వేశారు. ఈ రిజర్వాయర్‌ కింద 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్‌ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. దీంతోపాటే ఉద్దండాపూర్‌ నుంచి లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ నిర్మాణానికి మరో రూ.1,207 కోట్లతో ప్రతిపాదించారు. మొత్తంగా రూ.4,268 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, వీటిని ఆమోదించి, టెండర్లు పిలిచేందుకు అనుమతి కోసం ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. అక్కడ ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు. 

రూ.1,369 కోట్లతో కాళేశ్వరం కాల్వల పనులు! 
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ దిగువన పూర్వ మెదక్‌ జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే సంగారెడ్డి కెనాల్‌ వ్యవస్థకు అంచనాలు సిద్ధమయ్యాయి. మొత్తంగా రూ.1,369 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. వర్గల్‌ మండలం గౌరారం గ్రామం నుంచి మొదలయ్యే ఈ కాల్వ సంగారెడ్డి మండలం కల్వకుంట గ్రామం వద్ద ముగియనుండగా.. ఈ కాల్వ పొడవు 127 కిలోమీటర్ల మేర ఉండనుంది. ఈ కాల్వను మూడు రీచ్‌లుగా విడగొట్టి పనులకు ఆమోదం, ఆపై టెండర్లు పిలిచేందుకు నీటి పారుదల శాఖ సమాయత్తమైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement