
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు 31 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలు దేరింది. ప్రయాణికులు భోజనం చేసేందుకు రాత్రి 11:30 ప్రాంతంలో చిట్యాల శివారులోని ఓ హోటల్ వద్ద ఆపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూళ్లూరుపేటకు చెందిన కూన ప్రభాకర్ తన యజమాని అయ్యప్పరెడ్డికి చెందిన సుమారు రూ.17 లక్షల నగదును తీసుకుని ప్రయాణిస్తున్నాడు.
భోజనానికి దిగి వచ్చేసరికి నగదు బ్యాగు కనిపించకపోవడంతో 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. చిట్యాల పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకువెళుతున్న కోటీ మూడు లక్షల ఎనబై వేల రూపాయలున్న నగదు బాక్స్ లభ్యమైంది. జగ్గయ్యపేటలో జ్యువెలరీ షాపు నిర్వహించే రాయపూడి రాజశేఖర్‌కు చెందిన నగదును తాను వ్యాపార నిమిత్తం చెన్నైకు తీసుకువెళుతున్నట్లు ప్రయాణికుడు సోమశేఖర్ తెలిపారు. దీంతో తగిన ధ్రువీకరణ పత్రాలు లేవని పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ.17 లక్షల నగదు బ్యాగ్ మాత్రం దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment