‘ఎంట్రీ’ మామూలే! | RTA Check posts Care Off Illegal Collections In Kamareddy | Sakshi
Sakshi News home page

‘ఎంట్రీ’ మామూలే!

Published Mon, Jul 22 2019 2:14 PM | Last Updated on Mon, Jul 22 2019 2:14 PM

RTA Check posts Care Off Illegal Collections In Kamareddy - Sakshi

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన చెక్‌పాయింట్లు అవినీతికి అడ్డాలుగా మారాయి. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సిన సిబ్బంది.. సరుకులు రవాణా చేసే వాహనాలను పరిశీలించకుండానే డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు మామూలయ్యాయి. గతంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్‌లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పూ రావడం లేదు.

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 44వ నంబ రు (బెంగుళూరు–నాగ్‌పూర్‌) జాతీయ రహదారి తో పాటు 161 వ నంబరు (సంగారెడ్డి–నాందే డ్‌–అకోలా) జాతీయ రహదారులపై రవాణా శాఖ చెక్‌పాయింట్, చెక్‌పోస్టులు ఉన్నాయి. ఆ యా రహదారుల మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉత్తర, దక్షిణ భారత దేశాల్లోని వివిధ రాష్ట్రాలకు సరకుల రవాణాకు సంబంధించిన వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని పొందుర్తి సమీపంలో ఆర్టీఏ చెక్‌పాయింట్‌ ఉంది. దీని మీదుగా నిత్యం వందలాది లారీలు, ఇతర రవాణా వాహనాలు వెళ్తుంటాయి. ప్రతి రవాణా వాహనం ఆగాల్సిందే.. అక్కడి సిబ్బంది అడిగినంత ముట్టజెప్పాల్సిందే.. ఇది బహిరంగ రహస్యం.

రవాణా చెక్‌పాయింట్‌లతో పాటు చెక్‌పోస్టుల వద్ద వాహనాలకు సంబంధించిన పత్రాలు, రవాణా అవుతున్న సామగ్రికి సంబంధించిన పత్రాలు, లోడ్, పన్నులు చెల్లించిన పత్రాలతో పాటు వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే డ్రైవర్లు లారీని ఆపడం, అక్కడి సిబ్బందికి డబ్బులు ఇచ్చి తిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. 161వ నంబరు జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్‌పూర్‌ ఆర్టీఏ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రవేశం పేరుతో ‘ఎంట్రీ’ అంటూ డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది.

అయితే చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్‌ల వద్ద పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో రవాణా శాఖ చెక్‌పోస్టులు, చెక్‌పాయింట్‌లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అప్పుడు లెక్కకు మించిన డబ్బులు ఉన్నాయన్న ఆరోపణలతో పలువురిపై చర్యలు తీసుకున్నారు. దానికితోడు చెక్‌పోస్టులు, పాయింట్‌ల వద్ద రవాణా శాఖ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తులే ఎక్కువ హల్‌చల్‌ చేస్తుంటారు. జాతీయ రహదారులపై రవాణా శాఖ వసూళ్లపై లారీ డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్‌ చేసిన వీడియో సంచలనం రేపింది. మూడు రోజుల్లో వేలాది మంది ఆ వీడియోను వీక్షించారు. ఆర్టీఏ వసూళ్లపై సోషల్‌ మీడియాలో ఎన్నో కామెంట్లు వస్తున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement