ఆర్టీఏ ‘సేవ’ మరింత ఖరీదు
రవాణా శాఖ సేవల రుసుములు పెంచిన సర్కార్
సాక్షి, హైదరాబాద్:
రవాణా శాఖకు సంబంధించిన సేవలు ఇకపై మరింత భారం కాబోతున్నాయి. రవాణా శాఖ ఫీజులను జనవరిలో కేంద్రం పెంచగా ఇప్పుడు దానికి అనుబంధంగా సేవా రుసుములను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఫీజుల నియంత్రణ పూర్తిగా కేంద్రం పరిధిలో ఉండగా, సేవా రుసుములను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సవరించుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు సేవా రుసుములు పెంచేందుకు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం వాటిని ఖరారు చేసింది. దీంతో లైసెన్సు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఆర్‌సీ, పర్మిట్ ఫీజులు పెరగబోతున్నాయి.
డ్రైవింగ్ లెసెన్సుపై సేవా రుసుము రూ.50 నుంచి రూ.100, రవాణా వాహనాల రుసుము రూ.50 నుంచి రూ.200, భారీ వాహనాల లైసెన్సు రుసుము రూ.150 నుంచి రూ.300, ఆర్‌సీ రుసుము ఆటోలతో పాటు ఇతర భారీ వాహనాలకు రూ.200 నుంచి రూ.400, ద్విచక్రవాహనాలకు రూ.100 నుంచి రూ.250, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌కు సంబంధించి ఆటోలకు రూ.30 నుంచి రూ.100, ఇతర వాహనాలకు రూ.60 నుంచి రూ.200, పర్మిట్లకు సంబంధించి ఆటోలకు రూ.50 నుంచి రూ.100, ఇతర వాహనాలకు రూ.100 నుంచి రూ.200గా నిర్ధారించారు. కొంతకాలంగా రవాణా శాఖ నుంచి ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలని చూస్తున్న ప్రభుత్వం వీటిని పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,700 కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా రూ.2,400 కోట్లు సమకూరింది. ఈసారి ఆ మొత్తం కనీసం రూ.3 వేల కోట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.