నిప్పులుగక్కిన నిర్లక్ష్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆర్టీఏ అధికారుల అవినీతి, బస్సు ఓనర్ అత్యాశ, డ్రైవర్ నిర్లక్ష్యమే బీజీఆర్ ఓల్వో బస్సును కాల్చివేశాయి. ఎలాంటి పర్మిషన్లు లేకుండా 4 నెలలుగా అక్రమంగా ముంబై నుంచి హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్న ఈ ఏసీ బస్సు ప్రమాదకర స్థితిలోనే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. జహీరాబాద్ వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న శ్రీనివాస్ ప్రమాదాన్ని పసిగట్టి ఉండకపోతే మరో పాలెం సంఘటన పునరావృతం అయ్యేది.
బ్యాటరీ నుంచి యాసిడ్ లీకు...
బస్సు బ్యాటరీ నుంచి యాసిడ్ లీక్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. యాసిడ్ కారుతున్న విషయాన్ని పూణేలోనే గమనించిన బస్సు డ్రైవర్ జావీద్ విషయాన్ని ఓవర్‌కు ఫోన్ చేసి చెప్పినట్టు ప్రయాణికులు తెలిపా రు. అయితే బ్యాటరీని ఎలాగోలా రిపేర్ చేయించి బస్సును హైదరాబాద్ వరకు తీసుకురావాలని చెప్పినట్టు తెలిసింది.బ్యాటరీలో వాడే యాసిడ్ కొద్దికొద్దిగా కారుతూ పక్కనే ఉన్న రబ్బర్ మ్యాట్ మీద పడటంతో పడటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ఫిట్‌నెస్ లేకున్నా...
చిరాగ్‌పల్లివద్ద ప్రమాదానికి గురైన సహారా ట్రావెల్స్ ఓల్వో వాహనం (ఏపీ 13వై-0952) ఫిట్‌నెస్ గడువు సెప్టెంబర్ 30, 2014తోనే ముగిసింది. ఇక తరువాత బస్సుకు ఎలాంటి ఫిట్‌నెస్ గుర్తింపు పత్రాలు లేకుండానే నడుస్తోంది. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను గడువు కూడా జూన్ 20, 2014తో ముగిసింది.
ముఖ్యంగా వోల్వో వాహన బీమా గడువు సెప్టెంబర్ 25, 2013 ముగిసింది. ఏపీ 13వై-0952 వోల్వో బస్సుపై ట్రావెల్స్ టూరిజం శాఖ నుంచి తీసుకున్న అనుమతి సెప్టెంబర్ 25, 2013 ముగియడం గమనార్హం. ఫిట్‌నెస్, బీమా, పన్ను చెల్లింపుల్లో ఒక్కటీ రెన్యూవల్ చేయించుకోకున్నా బస్సును రహదారులపై ప్రయాణించేందుకు అనుమతించడం రవాణాశాఖ అధికారులపై వచ్చే ఆరోపణలకు మరిం త బలం చేకూరుస్తోంది. ఫిట్‌నెస్ ముగిసిన విషయాన్ని గుర్తించి తనిఖీ చేయాల్సిన అధికారులు పట్టనట్టుగా ఉండిపోయారు.