ఆర్టీసీ బస్సులు కాదు, యమపాశాలు.
అవి ఆర్టీసీ బస్సులు కాదు, యమపాశాలు. గమ్యాలకు చేర్చాల్సిన ప్రగతి రథ చక్రాలు శ్మశానానికి చేరుస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాలం చెల్లిన బస్సులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అసలే గుంతలు పడ్డ రోడ్లు, ఆపై పాతబస్సులు ఇంకేం వుంది,, రోడ్డుమీద పోతున్న ఆటోలను, ద్విచక్రవాహనాలను ఢీ అంటే ఢీ అంటూ ఢీ కొడుతున్నాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం క్షేమం అని రాసిపెట్ట్డడం తప్ప ఇతరుల భద్రత గురించి అసలు ఆలోచించట్లేదు . రోడ్లమీద ఇతర వాహనాలని ఢీ కొడుతూ ప్రజల ప్రాణాలని బలితీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే ఏడు మంది ప్రాణాలను తీశాయి.
► వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ వద్ద ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన బాలేమియా(70), నర్సింగావపల్లికి చెందిన గొల్లమణ్యం(65) అక్కడికక్కడే మృతిచెందారు.
► కరీంనగర్ వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాసాని శ్రీనివాస్, ఆయన భార్య జలజ, బంధువుల అమ్మాయి ప్రజ్ఞ అక్కడికక్కడే మృతిచెందారు.
► తూర్పుగోదావరి జిల్లా ఎల్.గన్నవరం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆదిమూలంవారిపాలెంకు చెందిన ఆదిమూలం గంగరాజు(35) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొంది.
► చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం చౌడసముద్రం గ్రామానికి చెందిన అబుబకర్(5) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.