ఆర్టీసీ కండక్టర్ల అవస్థలు
- ఒక చేత్తో యంత్రం.. మరో చేత్తో టికెట్ల పెట్టె!
- తరచూ మొరాయిస్తున్న మిషీన్లు..
- పాత పద్ధతిలో టికెట్ల జారీ
సాక్షి, హైదరాబాద్: ఇవీ ఆధునికత తెచ్చిన అవస్థలు. ఆర్టీసీలో కండక్టర్ల పనిభారం తగ్గించటంతోపాటు ప్రయాణికులకు వేగంగా టికెట్ల జారీ చేసేందుకు ఉద్దేశించిన యంత్రాలు భారంగా మారాయి. టికెట్ల జారీకి కండక్టర్లు రెండు రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చాలా మెట్రో నగరాల్లో కొన్నేళ్ల క్రితమే టికెట్ జారీ యంత్రాలు (హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్లు) అమలులోకి తెచ్చారు. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ కూడా దాన్ని ప్రారంభించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వాటి నిర్వహణలో చిక్కు వచ్చి పడింది. మూడు కంపెనీలకు ఈ బాధ్యత అప్పగించారు. అందులో ఓ కంపెనీ యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి. మరోవైపు... అధికారుల కక్కుర్తి వల్ల ఆ యంత్రాలకు నాణ్యత లేని పేపర్ సరఫరా అవుతోంది.
నాణ్యత లేని పేపర్‌రోల్స్ కొన్ని సందర్భాల్లో లోపల పేపర్ ఇరుక్కుపోయి టికెట్ వెలువడటం లేదు. మీటను గట్టిగా నొక్కితే యంత్రమే మొరాయిస్తోంది. దీంతో టికెట్ జారీ సాధ్యం కావటం లేదు. ప్రయాణికులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుండటంతో బస్సునునిలిపేసి ప్రయాణికులను మరో బస్సులోకి మార్చాల్సి వస్తోంది. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో కండక్టర్లు విధిగా తమ వెంట పాతకాలపు టికెట్ల గుత్తులుండే పెట్టెలను కూడా తీసుకెళ్లాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. టికెట్ జారీ యంత్రం మొరాయించిన వెంటనే పాత పద్ధతిలో టికెట్ల పెట్టెలను వినియోగిస్తున్నారు. యంత్రాలు అందుబాటులోకి వచ్చినా పాత విధానంలో టికెట్ పెట్టెల మోత మాత్రం కండక్టర్లకు తప్పటం లేదు.
ఫిర్యాదు చేసినా: కాగితపు చుట్టలు నాణ్యతగా ఉండటం లేదని, ఓ కంపెనీ యంత్రాలు సరిగా పనిచేయటం లేదని కండక్టర్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టిం చుకోవటం లేదు. కండక్టర్ డ్యూటీ దిగిన వెంటనే సదరు యంత్రాన్ని నిర్దారిత సమ యం మేరకు చార్జింగ్ చేయాలి. ఈ బాధ్యత పర్యవేక్షించే డిపో క్లర్కులు సరిగా చార్జ్ చేయకుండానే యంత్రాలను అందిస్తుండటంతో మధ్యలో చార్జింగ్ తగ్గిపోయి యం త్రాలు మొరాయిస్తున్నాయి. ఏదైనా యంత్రానికి మరమ్మతు చేయాలంటే ఇమ్లీబన్ బస్టాండులోని కేంద్రానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. ఐదారు యంత్రాలుంటేగాని డిపో సి బ్బంది మరమ్మతు కోసం తీసుకెళ్లటం లేదు. ఒకటి రెండు యంత్రాలు చెడిపోతే, వా టిని అలాగే డిపోలో పడేసి మరిన్ని యంత్రాలు మరమ్మతుకు వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. అప్పటివరకు కండక్టర్లు పాత పద్ధతిలోనే టికెట్లు జారీ చేయాల్సి వస్తోంది.