సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే చర్యల్లో భాగంగా శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేయనుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమని ప్రకటిస్తూనే సమ్మెను మాత్రం ఆపేది లేదని ప్రకటించింది. బంద్ లో భాగంగా శుక్రవారం 14వ రోజున సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలతో ఆర్టీసీ జేఏసీ హోరెత్తించింది. అన్ని డిపోల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్‌లు నిర్వహించింది. వ్యాపారులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్న బంద్ అయినందున ప్రజలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. బంద్‌కు టీఆర్‌ఎస్, మజ్లిస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఆటో, క్యాబ్ సంఘాలు మద్దతు ఇప్పటికే పలి కాయి. బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ శనివారం మధ్యాహ్నం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీల్లో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని రామ్ నగర్ కూడలి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు, òకార్మికులు జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. అంతకుముందు బాగ్‌లింగంపల్లి వద్ద ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. ఇబ్రహీంపట్నం డిపో ఎదుట కార్మికులు బస్సులను బయటకు రాకుండా అడ్డుకోగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. షాద్‌నగర్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ కార్మికులు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బైక్ ర్యాలీకి కేవీసీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాదిగ దండోరా నాయకులు మద్దతు పలికారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ తాత్కాలిక డ్రైవర్ గురువారం రాత్రి‡ అదే బస్సులోని తాత్కాలిక మహిళా కండక్టర్‌పై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు.
బస్సులు తిప్పేలా సర్కారు ఏర్పాట్లు
ఆర్టీసీ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంద్ ప్రభావం పడకుండా వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో శుక్రవారం చాలా బస్సుల్లో కండక్టర్లకు టికెట్ల జారీ యంత్రాల వాడకంపై శిక్షణ ఇచ్చి అందించినా చాలా మంది కండక్టర్లు వాటిని ఆపరేట్ చేయలేక సంప్రదాయ టికెట్ ట్రేలు అడిగి తీసుకెళ్లారు.
సమ్మె యథాతథం: అశ్వత్థామరెడ్డి
కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వమే స్పందించలేదని, కోర్టు ఆదేశంతోనైనా సర్కారు చర్చలకు సిద్ధం కావాలన్నారు. తాము ప్రభుత్వం ముందుంచిన 26 డిమాం డ్లపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధం కావాలని కోర్టు చెప్పినంత మాత్రాన సమ్మెను విరమించాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా శనివారం రాష్ట్ర బంద్ నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల కడుపు మండి ఉద్యమం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతుగా జరిగిన సదస్సులో అశ్వత్థామరెడ్డి పాల్గొని మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చర్చలపై ప్రతిష్టంభన!
ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు సీఎంతో భేటీ కోసం ప్రగతి భవన్ వెళ్లారు. అయితే ఓ వివాహ కార్యక్రమం, మరో వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ వెళ్లడంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. శనివారం ఉదయం చర్చిద్దామని సీఎం చెప్పడంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. చర్చల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం ప్రారంభించాలంటూ హైకోర్టు స్పష్టం చేయడంతో ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ అందుకు సమాయత్తమవుతున్నారు. చర్చలు ప్రారంభిస్తే అనుసరించాల్సిన వ్యూహం కోసం ఆర్టీసీ ఈడీలతో శనివారం ఉదయం 10 గంటలకు ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మంత్రులతో కలసి సీఎంతో భేటీ అయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment