త్వరగా సన్నాహాలు చేయాలని కేసీఆర్‌కు రాపోలు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ప్రతిని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌కు కూడా పంపింది. ఆనందభాస్కర్ నాలుగు రోజుల క్రితం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనల కింద తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు సంబంధిత సొసైటీ స్పందించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని, ఒక ప్రతిని తనకూ పంపిందని ఆనందభాస్కర్ వివరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంగళవారం ఒక లేఖ రాశారు. సొసైటీ చైర్మన్ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖ గురించి దీనిలో ప్రస్తావించారు. ‘నవంబర్ 17న కేంద్ర రక్షణ శాఖ అండర్ సెక్రటరీ నుంచి సొసైటీకి ఒక లేఖ అందింది. సైనిక్ స్కూల్ ఏర్పాటుకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. 2015-16 విద్యాసంవత్సరంలోనే ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని తెలంగాణ జిల్లాలో కేటాయించాలి’ అని సొసైటీ చైర్మన్ రాసిన విషయాలను ఆనందభాస్కర్ ప్రస్తావించారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే ఈ సైనిక్ స్కూల్ ప్రారంభం కావాలంటే జనవరి ఒకటో తేదీ కల్లా సంబంధిత ఏర్పాట్లు చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణకు సైనిక్ స్కూల్
Published Wed, Dec 3 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement