తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి
* రాజ్యసభలో రాపోలు డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఈ విషయమై ప్రత్యేక ప్రస్తావన చేశారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌లోని కోరుకొండ, కలికిరి సైనిక్ స్కూళ్లు రాష్ట్ర విభజన ఫలితంగా ఏపీకే వెళ్లిపోయాయి.
ప్రత్యేక ఉద్యమ నేపథ్యంలో ఆయా పాఠశాలలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్లు రద్దు చేసుకోవాలని బెదిరింపులు వచ్చాయి. దీని ఫలితంగా రాష్ట్ర విద్యార్థులు అక్కడి సైనిక్ స్కూళ్లలో చదివే పరిస్థితి లేదు’ అని వివరించారు. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో సైనిక్ స్కూలు ఏర్పాటును పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.