
శనివారం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేదికపై పురస్కార గ్రహీతలతో ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతి, ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, జ్యూరీ చైర్‌పర్సన్ ప్రణతీరెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిభకు ‘సాక్షి’పట్టం కట్టింది. భవిష్యత్ తరాల స్ఫూర్తిదాతలను సమున్నతంగా సత్కరించింది. ఎక్స్‌లెన్స్ అవార్డులతో గౌరవించింది. సమాజంలోని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందజేసే ‘సాక్షి’ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకలకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, బుర్రా వెంకటేశం, పల్సెస్ హెల్త్‌టెక్ సీఈవో శ్రీను బాబు, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమురయ్య, రఫీ ఫుడ్స్ ప్రతినిధి రఫతుల్లా విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు.
శనివారం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డులకు హాజరైన సినీ ప్రముఖులు
ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్, సినీనటులు కోట శ్రీనివాసరావు, అలీ, జ్యూరీ చైర్‌పర్సన్ ప్రణతీరెడ్డి, సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ వైఈపీ రెడ్డి తదితరులు వేడుకలకు హాజరయ్యారు. విద్యావేత్త చుక్కా రామయ్యతోపాటు సినీరంగ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌కు ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’అవార్డును అందజేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షల కోసం ఎంతో మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్న దివ్యాంగురాలైన విద్యావేత్త మల్లవరపు బాలలత ‘యంగ్ అచీవర్ అఫ్ ది ఇయర్’అవార్డును అందుకున్నారు.
సామాజిక సేవా విభాగంలో గ్రాఫిటీ చిత్రాల ద్వారా కృషి చేస్తున్న స్వాతి, విజయ్ దంపతులు, స్పోర్ట్స్ విభాగంలో టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్, అజయ్‌కుమార్‌రెడ్డిలు జ్యూరీ స్పెషల్ అవార్డును అందుకున్నారు. వ్యవసాయరంగంలో ఎక్స్‌లెన్స్ ఫార్మింగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గుండ్లపల్లి సుజాత, సేంద్రియ వ్యవసాయరంగంలో జగదీశ్ యాదవ్‌లకు అవార్డులు లభించాయి. వైద్య రంగంలో నైస్ ఫౌండేషన్, బిజినెస్ ఆఫ్ ద ఇయర్‌గా చీకోటి వెంకటేశ్వర్‌రావు, సోషల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అలోల దివ్యారెడ్డి, ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో వి.కిషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో డాక్టర్ రెడ్డీ ల్యాబొరేటరీస్, తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్‌గా సురేష్, తదితరులు ‘ఎక్స్‌లెన్స్’అవార్డులను అందుకున్నారు. సినీరంగంలోనూ వివిధ విభాగాల్లో అవార్డులను ప్రదానం చేశారు.
ఉర్రూతలూగించిన ఆటపాటలు..
అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అదరహో అనిపించాయి. ఆ పాత సుమధుర గీతాలు ఆçహూతులను వీనుల విందు చేశాయి. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆదర్శ సినీ జంట కృష్ణ, విజయనిర్మల సినిమాల నుంచి పాడిన హిట్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినీ సంగీత ప్రముఖులు ఆర్పీ పట్నాయక్‌తోపాటు గాయకులు సింహా, అంజనా సౌమ్య, రక్షిత తమ గాన లాహిరితో ఆహూతులను అలరించారు. స్టార్ సింగర్స్ రేవంత్, మధుప్రియలు సైతం పాటలతో అబ్బురపరిచారు. ఎన్‌జీ డ్యాన్స్ అకాడమీ యువ డ్యాన్సర్లు తమ తుఫాన్ నృత్యాలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. నవ్వుల పువ్వులు పూయించి రచ్చ రవి (జబర్దస్త్ ఫేం) బృందం ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది.
చుక్కా జీవితం స్ఫూర్తిదాయకం
సామాజిక రంగాల్లో అపారమైన సేవలు అందజేసిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు జస్టిస్ నర్సింహారెడ్డి సాక్షి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నేత చుక్కా రామయ్య అని, విద్యారంగంలో ఆయన అపారమైన సేవలు అందజేశారని కొనియాడారు. వేలాది మంది జీవితాలను, వారి కుటుంబాలను గొప్పగా ప్రభావితం చేసిన రామయ్యకు అవార్డును అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘సాక్షి’చేస్తున్న కృషిని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు స్ఫూర్తినిస్తాయన్నారు. మంచిని గుర్తించి ప్రోత్సహించడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు.
శిశువులకు స్వచ్ఛమైన పాలు
పాల కల్తీపై చాలా ఆందోళన చెందా. కేవలం నా పిల్లలకే కాదు చిన్నారులందరికీ స్వచ్ఛమైన పాలు అందించాలని భావించా. ఆ మేరకు గుజరాత్ నుంచి ఆవులను తెప్పించి డెయిరీ నడుపుతున్నా. పిల్లలకు కల్తీలేని నాణ్యమైన పాలను సరఫరా చేయగలుగుతున్నాం. దేశీ ఆవుల ప్రాముఖ్యత తెలుసుకున్నాం. వాటిని పెంచుతున్నాం. మంచి ఫలితాలు పొందుతున్నాం.
– ఎ.దివ్యారెడ్డి, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది స్టార్టప్ అవార్డీ
పది మందిని నడిపించలేకపోతేనే బాధ
మా నాన్న విలువలతో కూడిన జర్నలిస్ట్. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన స్ఫూర్తితోనే ఇదంతా చేస్తున్నా. జీవితంలో కష్టాలకు ఎప్పుడూ వెరవలేదు. అందరిలా నడవలేకపోతున్నానని ఏనాడూ బాధపడలేదు. పదిమందిని జీవితంలో ముందుకు నడిపించలేనప్పుడే నిజంగా బాధే స్తుంది. ఏనాడైతే తోటివారికి సహాయపడలేనో.. ఆ రోజే వికలాంగురాలిగా భావిస్తాను. సమాజానికి సేవచేసే అదృష్టం చాలా తక్కువ మందికే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలి. అంగవైఖల్యంతో బాధపడుతున్న నాకు అండగా నిలిచి, నన్నెంతగానో ప్రోత్స హించిన నాన్నతో పాటు దీపంవెలుగులో చదువుకుని సివిల్స్‌లో రాణిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నా.
– బాలలత, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అవార్డు గ్రహీత
గౌరవంగా భావిస్తున్నా
ఇంటి నుంచి పారిపోయిన పిల్లలను ఆశ్రిత ఫౌండేషన్ ద్వారా పోలీసుల సహకారంతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నాం. చదువు ఆపేసిన వారికి, భిక్షాటన చేస్తున్న పిల్లలకు విద్యను అందిస్తున్నాం. నేషనల్ రెయిన్ బో సహకారంతో హోం నిర్వహిస్తున్నాం. మా సేవను గుర్తించి సాక్షి అవార్డు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా.
– నాగరాజు, ఆశ్రిత ఫౌండేషన్,ఎక్స్‌లెన్సీ ఇన్ సోషల్ డెవలప్‌మెంట్ అవార్డు
‘సాక్షి’మీడియాకు కృతజ్ఞతలు
వివిధ రంగాల్లో సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డులు ఇవ్వడం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ విద్యార్థుల మెరుగైన చదువు కోసం తీసుకుంటున్న చర్యలకు అవార్డు ఇవ్వడం ఎంతో సంతృప్తినిచ్చింది.
– వల్గోట్ కిషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్
జీరో నాలెడ్జ్‌తో సాగు మొదలు పెట్టా
రైతులంటే మగవారు మాత్రమే కాదు. మహిళలు కూడా వ్యవసాయం చేయగలరు అని చాటి చెప్పాలని భావించా. జీరో నాలెడ్జ్‌తో ప్రకాశం జిల్లాలో నాకున్న 40 ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలు పెట్టా. సంప్రదాయ పద్ధతులకు ఆధునికత జోడించా. మంచి ఫలితాలు సాధిస్తున్నా. రైతులు విషరహిత పంటలనే సాగు చేయాలి.
– సుజాత, మహిళారైతు, ప్రకృతి వ్యవసాయం
మా బాధ్యతను మరింత పెంచింది
రెండేళ్ల క్రితం ఇద్దరం కలిసి ఇదే హాల్ పక్కన అర్ధరాత్రి ఓ పెయింటింగ్ వర్క్ చేశాం. అదే వర్క్‌ను ప్రస్తుత వేడుకలో ప్రదర్శించడం గర్వకారణంగా ఫీలవుతున్నాం. మేం అందుకున్న తొలి అవార్డు ఇదే. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది.
– స్వాతి, విజయ్, యంగ్ అచీవర్ ఆఫ్ ది సోషల్ సర్వీసెస్
మట్టినే మందుగా పిచికారీ చేశా
చాలా మంది రైతులు సాగుపై అవగాహన లేక అడ్డగోలుగా రసాయన పురుగుమందులు వాడి దిగుబడి రాక నష్టపోతుంటా రు. సేంద్రియ వ్యవసాయం చాలా మందికి తెలియదు. భూమిలోనే పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మట్టినే మందుగా శనగపై పిచికారీ చేశాను. మంచి ఫలితం వచ్చింది.
– తుమ్మల జగదీష్ యాదవ్, సేంద్రియ వ్యవసాయం
వెలుగులు నింపినప్పుడే సంతృప్తి
వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంతోపాటు ఆ రంగంలో ఆధారపడిన కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నింపినప్పుడే నిజమైన సంతృప్తి. గోదావరి పైప్స్ సంస్థను వ్యాపారపరంగా విస్తరింపజేయడమే కాదు అనేక మందికి ఉపాధి కల్పించింది.
– చీకోటి వెంకటేశ్వరరావు,బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ గ్రహీత
రైతు కష్టం చూడలేక
రైతు సంక్షోభంలో ఉండటం ఎంతగానో కలిచివేసింది. వారికి నా వంతు సహాయ, సహకారాలు అందజేస్తున్నా. రైతు కష్టపడితే కానీ మనం మూడు పూటలా భోజనం చేయలేం. కానీ అదే రైతు తన కుటుంబానికి రెండు పూటలు కూడా తిండి పెట్టలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలవాలి.
– సురేష్ ఏడిగ, తెలుగు ఎన్‌ఆర్‌ఐ అవార్డు
నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు
నాపై నమ్మకం ఉంచి నాకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సంస్థలకు, వ్యక్తులకు కృతజ్ఞతలు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయను.
– పుల్లెల గోపీచంద్,తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్
‘సాక్షి’ ప్రేరణతో మరింత ముందుకెళ్తా
నాన్న జహీర్ ఇచ్చిన ప్రోత్సాహంతో టెన్సిస్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నా. నా కోసం ఇల్లు తాకట్టు పెట్టి మరీ వెన్నుతట్టారు. సాక్షి ఇచ్చిన ప్రేరణతో మరిన్ని పతకాలు సాధిస్తా.
– షేక్ జాఫ్రీన్, జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు స్పోర్ట్స్
బాధ్యతను పెంచింది
సంపాదించిన డబ్బులో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే విధానంతో అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. వారికి మెరుగైన విద్యను అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఈ అవార్డు మాపై మరింత బాధ్యతను పెంచింది.
– వి.నారాయణరెడ్డి,డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషన్
కష్టానికి తగిన గుర్తింపు ఇది
చిన్నప్పుడు జరిగిన ప్రమాదంతో ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా పో యింది. మరో కన్ను పాక్షికంగా కనిపిస్తుంది. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కు వను చంపుకోలేదు. 2010 నుంచి అంతర్జాతీయ స్థాయిలో భారత అంధుల క్రికెట్‌కు ఆడుతున్నా. 2016లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాను. నా కష్టాన్ని గుర్తించి సాక్షి గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.
– అజయ్ కుమార్ రెడ్డి, జ్యూరీ స్పెషల్ రికగ్నేషన్ అవార్డు స్పోర్ట్స్
సేవకు తగిన గుర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద బాలికలు, గర్భిణులకు ఉచిత వైద్య సేవలందిస్తున్నాం. కమ్యూనిటీ హెల్ప్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లో మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం. నవజాత శిశువుల ఆరోగ్యం కోసం తక్కువ ఖర్చుకే సేవలందిస్తున్నాం.
– డాక్టర్ పద్మనాభరెడ్డి,నైస్ ఫౌండేషన్, ఎక్స్‌లెన్స్ ఇన్ హెల్త్‌కేర్
Comments
Please login to add a commentAdd a comment