Sakshi Excellence Awards 2021: Presented by YS Bharathi Reddy - Sakshi
Sakshi News home page

Sakshi Excellence Awards 2021: సేవకు మకుటం.. ప్రతిభకు పట్టం

Published Sun, Oct 30 2022 1:18 AM | Last Updated on Sun, Oct 30 2022 12:19 PM

Sakshi Excellence Awards 2021 Presented by YS Bharathi Reddy

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు స్వాగతం పలుకుతున్న వై.ఎస్‌.భారతీ రెడ్డి

నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. తిండిలేని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... పిన్న వయస్సులోనే ప్రతిభ చూపే వారు కొందరైతే... తమ ప్రతిభ ను సమాజ హితం కోసం, దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు ఇంకొందరు. ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు మరికొందరు! ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది... గౌరవించి సత్కరిస్తోంది.

ఇందులో భాగంగా 2021 సంవత్సరానికి సంబంధించి సాక్షి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో అక్టోబర్‌ 21, శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు.

మరుప్రోలు జస్వంత్‌ రెడ్డి : (తల్లి వెంకటేశ్వరమ్మ, తండ్రి శ్రీనివాసులురెడ్డి)  – స్పెషల్‌ జ్యూరీ పురస్కారం (మరణానంతరం)
బాపట్లలోని దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన  జశ్వంత్‌ 18 ఏళ్ల వయసులోనే మద్రాస్‌ రెజిమెంట్‌లో శిక్షణ పూర్తి చేశాడు. తర్వాత ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జమ్ముకాశ్మీర్‌కు వెళ్లాడు. 2021 జులై 8న జమ్మూకాశ్మీర్లోని సుందర్‌ బని సెక్టార్లో ఉన్న లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వద్ద టెర్రరిస్టులతో తలపడ్డ జశ్వంత్, ఎదురు కాల్పులలో తీవ్రంగా గాయపడి తుది శ్వాస విడిచాడు.

అమ్మా! కంగారు వద్దు... అవే చివరి మాటలు!!

మా అబ్బాయి ఎప్పుడు ఫోన్‌ చేసినా ‘అమ్మా! నేను బాగున్నాను. మీరు జాగ్రత్త’ అని చెప్పేవాడు. గతేడాది సరిహద్దులో ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో... జూలై 6న ఫోన్‌ చేసినప్పుడు కూడా ‘ఇక్కడ (జమ్ము) బాగుంది. నా నుంచి ఫోన్‌ లేకపోయినా మీరేం కంగారు పడకండి. మీరు జాగ్రత్త’ అన్నాడు. అవే చివరి మాటలు. ఎనిమిదవ తేదీ ప్రాణాలు వదిలాడు.

డాక్టర్‌ డి. పరినాయుడు : జట్టు సంస్థ – ఎక్సలెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌
ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తూ పురుగుమందులు లేకుండా వ్యవసాయం ఎలా చేయాలో గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది జట్టు సంస్థ. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో 206 గ్రామాలకు చెందిన దాదాపు పదివేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడంతోపాటు స్కూల్‌ టు ఫీల్డ్‌ స్కూల్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యార్థులకు నాచురల్‌ ఫార్మింగ్‌ పట్ల అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఈ సంస్థ.

సేద్యానికి సేవ చేశాను: పదహారేళ్లుగా వ్యవసాయ పద్ధతుల్లో ఆచరణీయమైన ప్రయోగాలు చేశాను. అవార్డులు అందుకున్నాను. నాచురల్‌ ఫార్మింగ్‌కి ప్రచారం బాగానే ఉంది. కానీ రైతులు రావాల్సినంత స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇలాంటి గుర్తింపులు, అవార్డులు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి.

సహదేవయ్య–విక్టోరియా :  ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ – నవజీవన్‌ సంస్థ, నెల్లూరు
ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రంగా అణగారిన వర్గాలకు అండగా నిలవడం కోసం 1996లో ఏర్పడిన ఈ సంస్థ అణచివేతకు గురైన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పర్చేందుకు కృషి చేస్తోంది. సాధికారత, స్వయంసమృద్ధి, సహజ వనరుల సంరక్షణ, సమాన అవకాశాలు, రక్షిత మంచినీరు, బాలల హక్కులు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. నిరుపేదలు, నిస్సహాయుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది.

ప్రచారం లేకుండా పని చేశాం: ప్రచారం చేసుకోకుండా మా పని మేము చేసుకుంటూ ఉన్న సమయంలో సాక్షి మా సేవలను గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ప్రోత్సాహాన్నిస్తాయి. మరింత ఉత్సాహంగా పని చేయడానికి దోహదం చేస్తాయి.  

బొల్లంపల్లి ఇంద్రసేన్‌ రెడ్డి: ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌
బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్‌ హౌస్‌ వాయువులను నియంత్రించి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీతో ఉన్న ప్రయోజనాల గురించి, సౌరశక్తి వినియోగం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీలో నివసించేవారికి పర్యావరణ పరిరక్షణ గురించి వర్క్‌షాప్‌లు నిర్వహించారు. యునైటెడ్‌ నేష¯Œ ్స ఆధ్వర్యంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీ¯Œ  రెవల్యూష¯Œ  నిర్వహించే పలు సదస్సుల్లో పాల్గొన్నారు.

ప్రకృతి విలువ తెలియచేయాలి: చిన్నప్పటి నుంచి ప్రకృతికి దగ్గరగా పెరిగాను. ప్రకృతి మీద ప్రత్యేకమైన మమకారం కూడా. అది కాలుష్యపూరితం అవుతుంటే చూస్తూ ఊరుకోలేక దాని పరిరక్షణ కోసం చిన్నచిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరికీ ప్రకృతి విలువ తెలియజేయాలనేది నా ప్రయత్నం.

అనిల్‌ చలమలశెట్టి, భార్య స్వాతి : గ్రీన్‌ కో గ్రూప్‌ – ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ క్లీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది గ్రీన్‌కోగ్రూప్‌. ఈ కంపెనీ అధినేతలు అనిల్‌ చలమలశెట్టి, ఆయన భార్య స్వాతి. 2030 నాటికి ఒక గిగా వాట్‌ సామర్థ్యం గల సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని, 2040 నాటికి పర్యావరణ సమతుల్యతను నెట్‌ జీరో కార్బన్‌ స్థాయికి తీసుకురావాలనేది వారి లక్ష్యం. ఈ సంస్థ కర్నూలులో 15 వేల కోట్ల వ్యయంతో 5,410 మెగావాట్ల విద్యుత్‌ కేంద్ర నిర్మాణం తలపెట్టింది. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్‌ని ఉత్పత్తి చేయడం వీరి ప్రాజెక్టు ప్రత్యేకత.


పర్యావరణం కోసం పనిచేస్తాం: ఈ పురస్కారం మా టీమ్‌లో అందరికీ కలిపి సంయుక్తంగా ఇచ్చిన గౌరవం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా కార్య క్రమాలను ఇంకా ఇంకా కొనసాగిస్తాం.  

తిమ్మయ్యగారి సుభాష్‌ రెడ్డి : ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌
ప్రముఖ పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌ రెడ్డి స్వస్థలం కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలోని జనగామ గ్రామం. తల్లిదండ్రులు సుశీల, నారాయణ రెడ్డి. భవన  నిర్మాణ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన సుభాష్‌రెడ్డి ఆరు కోట్ల రూపాయలతో బీబీపేట్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల భవనాన్ని అత్యాధునికంగా పునర్నిర్మించి ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు మన బడి కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారు. సీతారాంపల్లిని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు.

నాణ్యతకు నా పనే గీటురాయి: దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాటి నాయకులలా మనం జీవితాలను త్యాగాలు చేయలేకపోయినా సమాజానికి మనకు చేతనైనంత సహాయం చేయాలనేది నా అభిమతం. రోడ్డు, స్కూలు బిల్డింగ్‌... ఏ పని చేసినా సరే... నాణ్యతకు నేనే గీటురాయి అన్నట్లుగా చేశాను. ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది. ఈ సర్వీస్‌ని ఇలాగే కొనసాగిస్తాను.

అక్షత్‌ సరాఫ్‌ : (రాధా టీఎమ్‌టీ) – బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ లార్జ్‌ స్కేల్‌
1960లో శ్రీ రాధేశ్యామ్‌ జీ షరాఫ్‌ టి.ఎమ్‌.టి. సంస్థను స్థాపించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో హై క్వాలిటీ స్టీల్‌ ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుతున్నారు రాధా టి.ఎమ్‌.టి. కంపెనీ డైరెక్టర్‌ అక్షత్‌ షరాఫ్‌.హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఈ సంస్థ శంకరంపేట్, చిన్న శంకరంపేట్‌ గ్రామాల ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పాటునందిస్తోంది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మొక్కలు నాటించడం, స్టీల్‌ ప్లాంట్లలో కాలుష్య నివారణకు కృషి చేస్తోంది.

ఇదే బాధ్యతను కొనసాగిస్తాం: మా వంతు సామాజిక బాధ్యతగా విద్యారంగానికి తోడ్పాటునందిస్తున్నాం. ఈ అవార్డు స్ఫూర్తితో... మా సేవలను నాణ్యత తగ్గకుండా ఇలాగే కొనసాగిస్తామని తెలియచేస్తున్నాను.

పి.జ్ఞానేశ్వర్‌ : యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌
సంగారెడ్డి జిల్లా నాగిల్‌గిద్ద మండలం ముక్తాపూర్‌ గ్రామానికి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్‌ జువాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. తాను పుట్టిపెరిగిన గ్రామంలో పచ్చదనం తగ్గిపోవడం, మంజీరా నదీతీరం కళ తప్పడం చూసి  పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్నారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తున్నారు. పిల్లలను గ్రీన్‌ బ్రిగేడ్‌గా తయారుచేసి వారి చేత మొక్కలు నాటిస్తున్నారు.

ఎర్త్‌ లీడర్లను తయారు చేస్తాను: మంజీర నది ఎండిపోయి నీరు లేక పక్షులు చనిపోయాయి. చెట్లు ఎండిపోయాయి. నా వంతుగా పరిరక్షణ బాధ్యత చేపట్టాలనుకుని, పర్యావరణవేత్తల సహకారంతో పనిచేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం కోటి మంది ఎర్త్‌ లీడర్‌లను తయారు చేయాలనేది నా లక్ష్యం.

నిఖత్‌ జరీన్‌ : యంగ్‌ ఎచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – స్పోర్ట్స్‌
బాక్సింగ్‌ రింగులో పవర్‌ ఫుల్‌ పంచ్‌లతో విజృంభిస్తూ ఒక్కో పతకాన్ని ఒడిసిపట్టుకుంటూ తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిన నిఖత్‌ జరీన్‌ 1996 జూన్‌ 14న తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జమీల్‌ అహ్మద్, పర్వీన్‌ సుల్తానా దంపతులకు జన్మించింది. 13 సంవత్సరాల వయసులో తండ్రి వద్ద బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న నిఖత్, ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకాన్ని అందుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదు చేసింది.

తల్లిగా గర్వపడుతున్నాను: మా అమ్మాయికి అవార్డు రావడం తల్లిగా నాకు ఎంత సంతోషంగా ఉంది.  తను హైదరాబాద్‌లో లేదు. ఆమె తరఫున నేను అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది.

సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి : యంగ్‌ ఎచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌  (స్పోర్ట్స్‌)
బ్యాడ్మింటన్‌లో అద్భుతాలు సృష్టిస్తు్తన్న ఈ అమలాపురం కుర్రాడు అంతర్జాతీయ పోటీల్లో రాకెట్‌లా దూసుకుపోతూ పతకాల పంట పండిస్తున్నాడు. చిరాగ్‌ శెట్టితో కలిసి భారత పురుషుల డబుల్స్‌ టీమ్‌లో సత్తా చాటుతున్నాడు. 2022లో జరిగిన థామస్‌ కప్‌లో స్వర్ణ పతకాన్ని, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకాన్నీ గెలుచుకుని  అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు.

సాత్విక్‌ తండ్రి కాశీవిశ్వనాథం, తల్లి రంగమణి
సాక్షి ప్రోత్సాహాన్ని మరువలేం: మా అబ్బాయికి అర్జున అవార్డు వచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఇప్పుడూ అంతే సంతోషిస్తున్నాను.. మా సాత్విక్‌ క్రీడాప్రస్థానంలో తొలి నుంచి సాక్షి పత్రిక అండగా వెన్నంటే ఉందని చెప్పాలి. మా బాబు ఫైల్‌ తిరగేస్తే సాక్షి పత్రికలో వచ్చిన వార్తలే ఎక్కువగా ఉంటాయి.  

షేక్‌ సాదియా అల్మాస్‌ : యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌  (స్పోర్ట్స్‌)
మంగళగిరికి చెందిన షేక్‌ సాదియా అల్మాస్‌ పవర్‌ లిఫ్టింగ్‌లో సత్తా చాటుతోంది. పవర్‌ లిఫ్టింగ్‌లో నేషనల్‌ చాంపియన్‌ అయిన తండ్రిని చూసి ప్రేరణ పొందిన సాదియా పదవ తరగతి నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించి ఒక్కో పతకం గెలుచుకుంటూ సంచలనాలు సృష్టిస్తోంది. మన దేశంలో జరిగిన పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. 2021లో టర్కీలో జరిగిన ఏషియన్‌ చాంపియన్షిప్‌ పోటీల్లో 57 కిలోల విభాగంలో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంది.

ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: మన నేల మీద నాకు వచ్చిన గుర్తింపు, అందుతున్న గౌరవం ఇది. ఎంతో మంది క్రీడాకారులున్నారు. అంతమంది నుంచి ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.∙  

డాక్టర్‌ రామారెడ్డి కర్రి : ఎక్సలెన్స్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌
రాజమండ్రిలో మానస ఆస్పత్రిని స్థాపించి మానసిక వైద్యుడిగా దాదాపు 40 ఏళ్లుగా వైద్యం చేస్తూనే మరోవైపు పలు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కళాసంస్థల్లో వివిధ పదవులు నిర్వహించారు రామారెడ్డి. మానసిక సమస్యలు, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీడియోలు రూపొందించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

అవార్డులు శక్తినిస్తాయి: మానసిక రుగ్మతల గురించి మన సమాజంలో సరైన అవగాహన లేని రోజుల్లో నా సర్వీస్‌ మొదలుపెట్టాను. నలభై రెండేళ్లలో దాదాపుగా ఒకటిన్నర లక్షల మంది తెలుగు వాళ్లకు స్వస్థత చేకూర్చగలిగాను. తెలుగు మీడియా సంస్థ నుంచి గుర్తింపు లభించడం సంతోషం. అవార్డులు మనసు మీద మనిషి మీద చాలా సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా బాగా పని చేయడానికి శక్తిని ఇస్తాయి.

సిద్ధార్థ్‌ శ్రీవాస్తవ్‌ పిల్లి: యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ఇది ఇయర్‌ (ఎడ్యుకేషన్‌)
తెనాలికి చెందిన ప్రియ మానస, రాజ్‌కుమార్‌ దంపతుల కుమారుడైన సిద్ధార్థ్‌ శ్రీవాత్సవ్, పసి వయసులోనే కంప్యూటర్స్‌లో ఆరితేరడంతో మాంటెగ్న్‌ కంపెనీ ఏడో తరగతిలోనే నెలకు 25 వేల జీతంతో ఐటీ జాబ్‌ ఆఫర్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ఫినిటీ లెర్న్‌ అనే సంస్థలో డేటా సైంటిస్టుగా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూనే అమెరికన్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా కోడింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో భూకంపాల రాకను ముందుగానే పసిగట్టే ప్రాజెక్టులో సీనియర్‌ ప్రొఫెసర్లతో కలిసి పరిశోధనలు చేస్తున్నాడు.

ఎంత శ్రద్ధ పెడితే అంత నేర్చుకుంటాం: డేటా సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ ఈ తరానికి చాలా అవసరం. మనం ఎంత నేర్చుకుంటామనేది... నేర్చుకోవడానికి మనం పెట్టిన శ్రద్ధాసక్తులను, ప్రాక్టీస్‌ని బట్టి ఉంటుంది. పేరెంట్స్‌ సపోర్టు, పిల్లల ఆసక్తి కలిస్తే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి.

డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి : తెలుగు పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌
ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజి చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ఒకవైపు పేషంట్లకు చికిత్సలు, మరోవైపు పరిశోధనలతో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నాయకత్వంలో ఏఐజీ హాస్పిటల్స్‌ జీర్ణకోశ సంబంధ వ్యాధుల పరిశోధనలకు, ఎండోస్కోపీ శిక్షణకు ప్రపంచానికి కేంద్రబిందువుగా అవతరించింది. మూడు దశాబ్దాలుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులకు ఎ.ఐ.జీలో అధునాతన ఎండోస్కోపీ విధానాలలో శిక్షణ ఇస్తున్నారు.

వైద్యుల త్యాగాలకు అంకితం: ఈ గౌరవం నాకు మాత్రమే దక్కుతున్న గుర్తింపు కాదు. మా డాక్టర్లందరికీ అందిన పురస్కారం. కోవిడ్‌ సమయంలో లక్షలాది పేషెంట్‌లకు వైద్య సేవలందించడంలోనూ, వ్యాక్సిన్‌ తయారీకి సహకారంలోనూ డాక్టర్‌ల భాగస్వామ్యం మరువలేనిది. ఈ అవార్డు... కోవిడ్‌ విధుల్లో భాగంగా అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలిన డాక్టర్లకు, వారి త్యాగాలకు అంకితం.

రవి పులి: తెలుగు ఎన్నారై ఆఫ్‌ ద ఇయర్‌
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఓ కుగ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన రవి అంచెలంచెలుగా ఎదిగి అమెరికాలో వాషింగ్టన్‌లో ఇంటర్నేషనల్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌కి వ్యవస్థాపక సీఈఓగా ఉన్నారు. అమెరికాలో పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇండియాలోని వారికి సేవలందిస్తున్నారు. వీటి ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఉద్యోగాల కోసం వేచి చూడకుండా.. ఎంట్రప్రెన్యూర్‌గా మారడానికి గైడె¯Œ ్స, మెంటార్‌షిప్‌ ఇవ్వడంతోపాటు కావాల్సిన పెట్టుబడి అందేలా సహకరిస్తున్నారు. కరోనా కాలంలో రవి చేసిన సాయం ఎంతోమంది తెలుగు వారిని సొంతగూటికి చేర్చింది.

అంత కష్టం వద్దు: పాతికేళ్ల కిందట నేను యూఎస్‌కి వెళ్లినప్పుడు వీసా వంటి ఇతర వివరాల కోసం గైడెన్స్‌ ఇచ్చేవాళ్లు లేక చాలా కష్టపడ్డాను. అందుకే విదేశాలకు వచ్చే విద్యార్థులకు ఇరవై ఏళ్లుగా సలహాలిస్తున్నాను. ప్రోత్సహిస్తున్నాను. దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం మరికొందరికి స్ఫూర్తినిస్తుంది. సాక్షికి కృతజ్ఞతలు.

కారింగుల ప్రణయ్‌: యంగ్‌ ఎచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (సోషల్‌ సర్వీస్‌)
అదిలాబాద్‌ జిల్లాకు చెందిన కారింగుల ప్రణయ్‌ సామాజిక స్పృహ కలిగిన తనలాంటి యువకులతో కలిసి స్వాస్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 11 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ...వేలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. పేద కుటుంబాల పిల్లలకు పౌష్ఠికాహారం అందించడం.. వారి చదువులకు తగిన ఆర్థిక భరోసా కల్పించడం, దివ్యాంగులు తమ కాళ్లపై తాము నిలబడేలా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ క్యాంపులు పెట్టి వారికి శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలతో తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు.

మా గ్రామాలకు సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం: పోషకాహారలోపంతో బతుకీడ్చే ఆదివాసీ మహిళలు, పిల్లల  కోసం ఏదో ఒకటి చేయాలనిపించి స్వాస్‌ను స్థాపించాం. మొదలు పెట్టేనాటికి మా బృందంలో ఉన్నది పదిమందికి లోపే. ఇప్పుడు 700 మంది సేవలందిస్తున్నారు. ఇది మా అందరి సేవలకు అందిన పురస్కారం.

సుంకరి చిన్నప్పల నాయుడు, సుజాత : బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (స్మాల్, మీడియమ్‌)
షీమాక్స్‌ ఎక్స్పర్‌ టెక్నోక్రాఫ్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ఎండీ సుంకరి చిన్నప్పల నాయుడు. పట్టణ యువతతో సమానంగా గ్రామీణ యువతకూ ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు 300 మంది గ్రామీణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి, సామాజిక బాధ్యతను పంచుకుంటున్నారు.

ఈ జ్ఞాపిక ఉత్తేజాన్నిస్తుంది: చిన్న చిన్న సంస్థలకు ఆదర్శంగా మమ్మల్ని చూపించాలనుకోవడమే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ అవార్డు నాలో ఉత్సాహాన్ని పెంచింది. భవిష్యత్తులో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనా సరే ఈ జ్ఞాపికను చూడగానే ఉత్తేజం వస్తుంది.

కె. లీలా లక్షా్మరెడ్డి : ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ (ఎన్జీఓ గ్రీన్‌ రివల్యూషన్‌)
కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ సంస్థ కె.లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన 2010లో ఏర్పాటైంది. నాటినుంచి మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారు. రెండు రాష్ట్రాల్లో 14 జిల్లాల్లో కలిపి 12,485 గ్రామాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటించారు. ఇప్పటివరకు 3,500 పాఠశాలలు, సుమారు 9 లక్షల మంది విద్యార్థులు కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

సేవకు పట్టం కడుతోంది: సమాజంలో సేవ చేసే వాళ్లను గుర్తించి, గౌరవించడం చాలా కష్టమైన విషయం. క్లిష్టమైనది కూడా. అలాంటిది ‘సేవకు పట్టం’ కట్టడాన్ని బాధ్యతగా తలకెత్తుకుంది. ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా çకొనసాగిస్తున్న సాక్షికి అభినందనలు.

చిన్నాలమ్మ: స్పెషల్‌ రికగ్నిషన్‌ ఇన్‌ ఫార్మింగ్‌
కొండ మీదినుంచి పారుతున్న నీటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించిన 75 ఏళ్ల ఈ బామ్మ పేరు చిన్నాలమ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిమిడిపల్లి గ్రామంలో నివసిస్తున్న దాదాపు 500 కుటుంబాల కోసం తన పెన్షన్‌ డబ్బులతో పాటు ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదువపెట్టి తెచ్చిన సొమ్ముకు గ్రామస్థుల భాగస్వామ్యంతో కాలువకు ఇరువైపులా కాంక్రీట్‌తో గట్లు నిర్మించుకునేలా చేసింది చిన్నాలమ్మ. ఈ చెక్‌డ్యామ్‌ వల్ల ఆ పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి.

నీటిని నిలుపుకున్నాం: ఊరందరికీ వ్యవసాయమే ఆధారం. పంట పండేనాటికి తుపానులొచ్చి వరదలో పంట కొట్టుకుపోతూ ఉంటే ఎన్నాళ్లని చూస్తూ ఉంటాం; నీళ్లు నిలుపుకునే వీల్లేకపోవడంతో పొలాలు బీడు పెట్టాల్సి వచ్చేది. దాంతో మా సొంత డబ్బుతో చెక్‌ డ్యామ్‌లు కట్టుకున్నాం. మరో ఐదారు ఊళ్ల వాళ్ల పంటలూ నిలిచేటట్లు డ్యామ్‌లు కట్టాం. అందుకు గుర్తుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది.

కూరెళ్ళ విఠలాచార్య : జ్యూరీ ప్రత్యేక గుర్తింపు
ప్రముఖ సాహితీవేత్త, రచయిత డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేముల గ్రామం. పుస్తకాలు కొనలేక ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో ఉద్యోగ విరమణ తరువాత 2014లో వెల్లంకి గ్రామంలో ప్రారంభించిన ఈ లైబ్రరీలో రెండు లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. విఠలాచార్య చేసిన కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు.

ఆశ్చర్యం కలిగించింది: నేను స్థాపించిన ఈ గ్రంథాలయానికి రీసెర్చ్‌ స్కాలర్‌లు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు వస్తుంటారు. ఎక్కడో మారుమూల పల్లెలో నా పని నేను చేసుకుంటూ ఉంటే ఆ సంగతి ఎలా తెలిసిందో ఏమో గానీ ప్రధాని నా గురించి మాట్లాడటం, సాక్షి పత్రిక వాళ్లు అవార్డుతో సత్కరించడానికి ఆహ్వానించడం ఆశ్చర్యంగా ఉంది. ఎనభై ఐదేళ్ల వయసులో ఇంతకంటే పెద్ద సంతోషాలు ఇంకేం కావాలి?

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement