ఇసుకరవాణాను అడ్డుకుంటే భౌతికదాడులు
అధికారుల అండదండలతోరెచ్చిపోతున్న ఇసుక మాఫియా
ఆత్మకూర్: ఈనెల 16న రాత్రి ఇసుకతరలింపును అడ్డుకున్న మానవపాడు ఆర్‌ఐపై దాడిచేసిన సంఘటనను మరువకముందే ఇసుకమాఫియా మరోసారి బరితెగించింది. భూగర్భజలాలు తగ్గిపోకుండా.. ఇసుకను కంటికిరెప్పలా కాపాడుకుంటున్న ఓ రైతును ట్రాక్టర్‌తో అడ్డంగా తొక్కించింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకెళ్తే.. ఆత్మకూరు మండలం కర్వెన, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ గ్రామశివారులో ఉన్న ఊకచెట్టు వాగులోంచి కొంతకాలంగా అక్రమంగా ఇసుకరవాణా కొనసాగుతోంది.
ఇసుకాసులు వాగులోంచి తవ్విన ఇసుకను రైతుల పొలాల్లో పెద్దఎత్తున డంప్‌చేస్తున్నారు. ఆ తర్వాత లారీల్లో హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈనెల 21న పిన్నంచర్ల గ్రామశివారులో తహశీల్దార్ గోపాల్‌నాయక్ బృందం ఇసుకరవాణాపై దాడులు నిర్వహించి రెండు లారీలను పట్టుకున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయ నాయకులు చిన్నచింతకుంట మండలం శివారులో లారీలను పట్టుకునే హక్కు మీకెక్కడిది..! అంటూ బెదిరింపులకు దిగి మరీ ఓ ఇసుకలారీని తరలించుకుపోయారు. నారాయణపేట ఆర్డీఓ స్వర్ణలత ఆదేశాల మేరకు చిన్నచింతకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు న మోదు చేయించారు. ఈ ఘటనను మరువకముందే ఓ రైతు ప్రాణం తీసుకున్నారు.
ఆత్మకూర్ మండలం పిన్నంచర్ల గ్రామానికి చెందిన రైతు లక్ష్మన్న(30)కు చెందిన వ్యవసాయ పొలం కర్వెన గ్రామ శివారులో ఉంది. నిత్యం తన పొలంలోంచి ఇసుక వాహనాలు వెళ్తుండడంతో పలుమార్లు వారించాడు. ఆదివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో తన పొలంలో నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకోబోయాడు. ఇసుక తరలిస్తున్న మాఫియా ముఠాసభ్యులు అడ్డువచ్చిన రైతుపైకి ట్రాక్టర్‌ను ఎక్కించడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇలా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది.
పెద్దఎత్తున మాముళ్లు
ఇసుక అక్రమరవాణా చేస్తున్న మాఫియా నుంచి పోలీసు, రెవెన్యూ అధికారులకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నాయని, అందుకే ఇసుక మాఫియా జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఇసుకవ్యాపారుల నుంచి నెలకు రూ.50 వేలకు ముడుతున్నాయని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇసుక మాఫియాకు ఎవరు సహకరిస్తున్నారనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు. ఈ సంఘటనపై కలెక్టర్ స్పందించి ఇసుకమాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
గ్రామస్తుల ఆందోళన
ఇసుకమాఫియా ఆగడాలను నిరసిస్తూ పిన్నంచర్ల గ్రామస్తులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘటనస్థలంలో ఆందోళనకుదిగారు. బాధ్యులైనవారిని శిక్షించాలని డిమాండ్‌చేశారు. బాధిత రైతు కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐ షేక్‌గౌస్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరు తహశీల్దార్ గోపాల్‌నాయక్, గద్వాల డీఎస్పీ బాలకోటితోపాటు సీఐ కిషన్ సంఘటనస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధ్యులు ఎంతటివారైనా సరే చట్టపరంగా శిక్షిస్తామన్నారు. బాధితరైతు లక్ష్మన్న కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చేందుకు ఇసుకమాఫియా అంగీకరించినట్లు తెలిసింది.
మానవపాడు ఆర్‌ఐపై దాడి
ఈనెల 16న మానవపాడు ఆర్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బారెడ్డితో పాటు గ్రామ తలారీలు కిష్ణ, బాష విధుల్లో ఉన్నారు. కర్నూలు జిల్లా పంచలింగాలకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆర్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు కొందరు ఇసుకవ్యాపారులు శ్రీకాంత్‌రెడ్డిపై దాడిచే శారు.
నిన్న ఆర్‌ఐపై దాడి.. నేడు రైతు హత్య
Published Tue, Sep 30 2014 2:25 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement