
ఫిల్టర్ ఇసుక తయారు చేసే ప్రదేశం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం. గూడూరు పంచాయతీలోని మఖ్తగూడలో ఓ వ్యక్తి తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేశాడు. రాత్రి వేళల్లో పాటు కాల్వలు, ఇతర పొలాల నుంచి మట్టిని జేసీబీలతో తవ్వి టిప్పర్ల ద్వారా ఫిల్టర్ వద్దకు తరలిస్తున్నాడు. అనంతరం మట్టిని ఫిల్టర్ వద్ద ఇసుకగా మార్చి నిల్వ చేసి ట్రాక్టర్‌కు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నాడు.
కొత్తూరు రంగారెడ్డి : ఇసుక వ్యాపారుల తవ్వకాల వల్ల పాటు కాల్వలు, చెరువులు ఉనికి కోల్పోతున్నాయి. మఖ్తగూడ శివారులోని నందులకత్వా వాగులో కొన్నేళ్ళ క్రితం చేపట్టిన మట్టి తవ్వకాల వల్ల వాగు చాలా చోట్ల ధ్వంసమైంది. తవ్వకాల కారణంగా వర్షాకాలంలో పాటు కాల్వలు దారి తప్పి ప్రవహిస్తున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. కొన్ని చోట్ల పాటు కాల్వలు ధ్వంసం కావడంతో వరద నీరు పంట భూములు, రోడ్లపై ప్రవహిస్తోందని చెప్పారు. చెరువులు, కుంటల్లోకి పార డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫిల్టర్ ఇసుక తయారీ ఇలా..
ఫిల్టర్ ఇసుక తయారీకి వ్యాపారులు ముందుగానే వ్యవసాయ పొలాల్లో పెద్ద ట్యాంకు నిర్మాణం చేపట్టి దానిపైన ఒక సన్నటి ఇనుప జాలీ అమరుస్తారు. అక్కడికి పాటు కాల్వలు, చెరువులు, వ్యవసాయ భూముల నుంచి తరలించిన మట్టిని కడగడానికి రెండు వైపులా నీరు(ప్రెషర్) వేగంగా వచ్చే విధంగా బోరు పైపులను ఏర్పాటు చేస్తారు. మట్టిని ట్యాంకు పైన పోసి సన్నటి జాలిపై నీటితో కడుగుతారు.
ఈ క్రమంలో మట్టి నీటితో పాటు బయటకు పోయి చిన్న చిన్న ఇసుక రేణువులు ట్యాంకులో ఉంటాయి. ఇలా రెండు మూడు ట్రాక్టర్ల మట్టితో ఒక ట్రాక్టర్ ఇసుకను తయారు చేస్తున్నారు.
ఇసుక ఫిల్టర్ల నిర్వహణ నేరం
అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, పాటుకాల్వలు, చెరువుల నుంచి మట్టిని తవ్వి ఇసుక ఫిల్టర్ల వద్దకు తరలించడం నేరం. మట్టిని తవ్వే జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిస్తే ప్రజలు మాకు సమాచారం ఇవ్వాలి.
– శకుంతల, తహసీల్దార్, కొత్తూరు
Comments
Please login to add a commentAdd a comment