పాస్ పుస్తకం ఇవ్వడానికి.. పట్టా మార్పిడికి ఓ వీఆర్‌ఓ ముప్పుతిప్పలు పెట్టాడు. వాటి కోసం తిరిగి తిరిగి అలసిపోయిన బాధితుడితో రూ. 30 వేలకు ‘బేరం’ కుదుర్చుకున్నాడు. ఇంటికి వచ్చి డబ్బు అందచేస్తానని చెప్పిన బాధితుడు.. మరోపక్క విషయాన్ని ఏసీబీకి ఉప్పందించాడు. మాటు వేసిన ఏసీబీ అధికారులు.. సదరు వీఆర్‌ఓ శరణప్పను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
న్యాల్‌కల్: ఓ వీఆర్‌ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మండలంలోని రుక్మాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఎండీ బషీర్ అనే వ్యక్తి హద్నూర్ గ్రామంలో 23 ఎకరాల 8 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని తన పేరిట మార్చడంతోపాటు పట్టాపాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం హద్నూర్ ఇన్‌చార్జి వీఆర్‌ఓ శరణప్పను ఆశ్రయించారు. భూమి మార్పు, పట్టా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం వీఆర్‌ఓ శరణప్ప రూ.44 వేలు డిమాండ్ చేశాడు. చివరకు బషీర్ రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు.
పట్టా మార్పు, పట్టా పాస్ పుస్తకాలిచ్చే విషయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ బషీర్ చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బషీర్ డబ్బులు తీసుకొని రుక్మాపూర్‌లోని శరణప్ప ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఏసీబీ అధికారులు కాపు కాశారు. బషీర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్‌ఓ శరణప్పను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సదరు డబ్బులను స్వాధీనం చేసుకొని శరణప్పను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
లంచం ‘పట్టా’డు.. ఏసీబీకి దొరికాడు
Published Sat, Jun 20 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement
Advertisement