
గాయపడిన శరణప్ప(ఫైల్) శరణప్ప (ఫైల్)
కంటోన్మెంట్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య విబేధాల నేపథ్యంలో గత వారం పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన వాచ్‌మెన్ శరణప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. శివ ఎన్‌క్లేవ్‌లో ప్రకాశ్ రెడ్డి, సంతోష్‌కుమార్ అనే వ్యక్తులకు చెందిన ప్లాట్‌లకు శ్రీనివాస్, శరణప్ప అనే వ్యక్తులు వాచ్‌మెన్లుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్ అతని భార్య చిన్నలక్ష్మితో కలిసి వెంచర్‌లోని ఓ గదిలో నివాసముంటుండగా, శరణప్ప పగటి పూట మాత్రమే కాపలాకు వచ్చేవాడు. అయితే సదరు స్థల యాజమాన్య విషయంలో ప్రకాశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లకు టి. మాధవరెడ్డి, ఎస్. మాధవరెడ్డి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో యజమానులు సదరు ప్లాట్‌ల చుట్టూ ప్రహరీ నిర్మించగా ఈ నెల 5న మాధవరెడ్డి వర్గీయులు కూల్చివేయించారు. దీనిని అడ్డుకున్నందుకు శ్రీనివాస్ అతని భార్య చిన్నలక్ష్మిలపై వారు దాడి చేయడంతో బాధితులు బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. దాడితో భయాందోళనకు గురైన శ్రీనివాస్ తనకు అండగా ఉండేందుకు శరణప్పను రప్పించుకున్నాడు. మరుసటి రోజు రాత్రి నిందితులు ఎస్. మాధవరెడ్డి, టి. మాధవరెడ్డి శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన శరణప్పను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
పోలీసుల నిర్లక్ష్యమే కారణం...
వాచ్‌మెన్ శ్రీనివాస్– అతని భార్య చిన్నలక్ష్మిపై దాడి జరిగిన విషయమై బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చేశారు. పోలీసుల పరోక్ష సహకారంతోనే నిందితులు పెట్రోల్ దాడికి తెగబడ్డారని శరణప్ప బంధువులు, స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు సంచలనం కావడంతో ఎట్టకేలకు పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే కేసు తీవ్రత నేపథ్యంలో అరెస్టు విషయం బయటికి చెప్పకుండానే విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. కాగా వాచ్‌మెన్‌పై పెట్రోల్ దాడిలో ఎస్.మాధవరెడ్డి, టి. మాధవరెడ్డిలతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నట్లు సమాచారం.
ఎఫ్‌ఎస్‌ఎల్‌కు దాడి వీడియో దృశ్యాలు!
వాచ్‌మెన్‌లపై వరుస దాడులకు సంబంధించిన పూర్తి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు ఆయా సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్ధారణ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు తెలుస్తోంది. శరణప్ప చనిపోకముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment