Saranappa
-
శరణప్ప హత్య కేసులో నలుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల విబేధాల కారణంగా పెట్రోల్ దాడిలో గాయపడి మరణించిన వాచ్మెన్ శరణప్ప కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో.. నార్త్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని శనివారం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తన కార్యలయంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశ్ రెడ్డి అనే ఫ్లాట్ యజమాని దగ్గర శరణప్ప వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. స్థల యాజమాన్య విషయమై గత కొన్నేళ్లుగా ప్రకాశ్‌రెడ్డి, మాధవరెడ్డిల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7న మాధవ రెడ్డి అనుచరులు అక్కడకు వెళ్లి గొడవకు దిగడంతో పాటు.. అడ్డుకున్న వాచ్ మెన్ శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. 40 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి శరణప్ప మృతి చెందాడు. సంచలనాత్మకంగా మారిన ఈ కేసును నార్త్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహాయంతో ఎట్టకేలకు ఛేదించారు. నిందితులు తూముకుంట మాధవ రెడ్డి, సమల మాధవ రెడ్డి, జక్కుల సురేందర్ రెడ్డితో పాటుగా కారు డ్రైవర్ నరేష్ సింగ్‌ను అరెస్ట్ చేశామని నగర సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. ప్రధాన నిందితుడు మాధవ రెడ్డిపై గతంలో ఐదు కేసులు ఉన్నాయని తెలిపారు. నలుగురు నిందితులపై 452, 302, 120(బీ), రెడ్ విత్ 212 కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సైఫాబాద్ జ్యూవెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు హైదరాబాద్: సైఫాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ చేసి జ్యూవెలరీ చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితులు హైదరాబాద్‌లో చోరీ చేసి ముంబైకు పారిపోయారని అన్నారు. చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 60. 20 క్యారెట్ డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మార్కెట్లో పట్టుబడిన డైమండ్స్ రూ. 40 లక్షలు విలువ పలుకుతుందని అన్నారు. నిందితుడుపై ఇప్పటికే ముంబైలో 11 చీటింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఐదు చెక్ బౌన్స్ కేసులతో పాటు మొత్తం 16 కేసుల్లో ట్రయల్ జరుగుతున్నాయని సీపీ నిందితుని చిట్టా విప్పారు. -
పెట్రోల్ దాడిలో గాయపడిన వాచ్మెన్ మృతి
కంటోన్మెంట్: రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య విబేధాల నేపథ్యంలో గత వారం పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన వాచ్మెన్ శరణప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. శివ ఎన్‌క్లేవ్‌లో ప్రకాశ్ రెడ్డి, సంతోష్‌కుమార్ అనే వ్యక్తులకు చెందిన ప్లాట్లకు శ్రీనివాస్, శరణప్ప అనే వ్యక్తులు వాచ్మెన్లుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్ అతని భార్య చిన్నలక్ష్మితో కలిసి వెంచర్‌లోని ఓ గదిలో నివాసముంటుండగా, శరణప్ప పగటి పూట మాత్రమే కాపలాకు వచ్చేవాడు. అయితే సదరు స్థల యాజమాన్య విషయంలో ప్రకాశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లకు టి. మాధవరెడ్డి, ఎస్. మాధవరెడ్డి మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో యజమానులు సదరు ప్లాట్ల చుట్టూ ప్రహరీ నిర్మించగా ఈ నెల 5న మాధవరెడ్డి వర్గీయులు కూల్చివేయించారు. దీనిని అడ్డుకున్నందుకు శ్రీనివాస్ అతని భార్య చిన్నలక్ష్మిలపై వారు దాడి చేయడంతో బాధితులు బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. దాడితో భయాందోళనకు గురైన శ్రీనివాస్ తనకు అండగా ఉండేందుకు శరణప్పను రప్పించుకున్నాడు. మరుసటి రోజు రాత్రి నిందితులు ఎస్. మాధవరెడ్డి, టి. మాధవరెడ్డి శరణప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన శరణప్పను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల నిర్లక్ష్యమే కారణం... వాచ్మెన్ శ్రీనివాస్– అతని భార్య చిన్నలక్ష్మిపై దాడి జరిగిన విషయమై బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చేశారు. పోలీసుల పరోక్ష సహకారంతోనే నిందితులు పెట్రోల్ దాడికి తెగబడ్డారని శరణప్ప బంధువులు, స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు సంచలనం కావడంతో ఎట్టకేలకు పోలీసులు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే కేసు తీవ్రత నేపథ్యంలో అరెస్టు విషయం బయటికి చెప్పకుండానే విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. కాగా వాచ్మెన్పై పెట్రోల్ దాడిలో ఎస్.మాధవరెడ్డి, టి. మాధవరెడ్డిలతో పాటు మరో ముగ్గురు పాల్గొన్నట్లు సమాచారం. ఎఫ్ఎస్ఎల్కు దాడి వీడియో దృశ్యాలు! వాచ్మెన్లపై వరుస దాడులకు సంబంధించిన పూర్తి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ మేరకు ఆయా సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్ధారణ కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపినట్లు తెలుస్తోంది. శరణప్ప చనిపోకముందు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. -
లంచం ‘పట్టా’డు.. ఏసీబీకి దొరికాడు
పాస్ పుస్తకం ఇవ్వడానికి.. పట్టా మార్పిడికి ఓ వీఆర్ఓ ముప్పుతిప్పలు పెట్టాడు. వాటి కోసం తిరిగి తిరిగి అలసిపోయిన బాధితుడితో రూ. 30 వేలకు ‘బేరం’ కుదుర్చుకున్నాడు. ఇంటికి వచ్చి డబ్బు అందచేస్తానని చెప్పిన బాధితుడు.. మరోపక్క విషయాన్ని ఏసీబీకి ఉప్పందించాడు. మాటు వేసిన ఏసీబీ అధికారులు.. సదరు వీఆర్ఓ శరణప్పను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. న్యాల్కల్: ఓ వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మండలంలోని రుక్మాపూర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఎండీ బషీర్ అనే వ్యక్తి హద్నూర్ గ్రామంలో 23 ఎకరాల 8 గుంటల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిని తన పేరిట మార్చడంతోపాటు పట్టాపాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం హద్నూర్ ఇన్చార్జి వీఆర్ఓ శరణప్పను ఆశ్రయించారు. భూమి మార్పు, పట్టా పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం వీఆర్ఓ శరణప్ప రూ.44 వేలు డిమాండ్ చేశాడు. చివరకు బషీర్ రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. పట్టా మార్పు, పట్టా పాస్ పుస్తకాలిచ్చే విషయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డ బషీర్ చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బషీర్ డబ్బులు తీసుకొని రుక్మాపూర్‌లోని శరణప్ప ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఏసీబీ అధికారులు కాపు కాశారు. బషీర్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ శరణప్పను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సదరు డబ్బులను స్వాధీనం చేసుకొని శరణప్పను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.