రణరంగంగా ‘శాతవాహన’ | Satavahana University becomes a tranquilizer | Sakshi
Sakshi News home page

రణరంగంగా ‘శాతవాహన’

Published Tue, Dec 26 2017 2:18 AM | Last Updated on Tue, Dec 26 2017 9:34 AM

Satavahana University becomes a tranquilizer - Sakshi

శాతవాహన యూనివర్సిటీ :  కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ రణరంగంగా మారింది. సోమవారం పీడీఎస్‌యూ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్, టీవీవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ ఎదుట మనుధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులను దహనం చేయడంతో వివాదం చెలరేగింది. ఫలితంగా ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సం ఘాలు.. వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్ప రం రాళ్లురువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

ఇరుసంఘాల నేతలు నినాదాలు చేసుకోవడం, రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. భరతమాత చిత్రపటాన్ని దహనం చేస్తున్నారన్న సమాచారం మేరకు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు రావటంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.  బీజేపీ నాయకులతో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్‌ చేశారు. నాలుగు గంటలపాటు వర్సిటీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. వర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు.

అనంతరం యూనివర్సిటీ అధికారులతో సమావేశమైన సీపీ కమలాసన్‌రెడ్డి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సీపీ అనుమతించలేదు. దీంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవం తంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు సహకరించాలని సీపీ కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది.  

వర్సిటీ బంద్‌: ఎం.కోమల్‌రెడ్డి, రిజిస్ట్రార్‌
గొడవల నేపథ్యంలో వర్సిటీని నిరవధికంగా బంద్‌ చేసినట్లు రిజిస్టార్‌ ఎం. కోమల్‌రెడ్డి ప్రకటించారు. ఎంబీఏ 3వ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. వర్సిటీ సైన్స్, ఆర్ట్స్, ఫార్మసీ కళాశాలలతో పాటు సంబంధిత మెస్‌లు, çహాస్టళ్లు బంద్‌ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు హాస్టళ్లు ఖాళీ చేసి వర్సిటీలో శాంతిని నెలకొల్పాలని కోరారు. జనవరి 2న జరగనున్న పీజీ  మొదటి, మూడవ సెమిస్టర్ల పరీక్షలపై ఈ నెల 27న ప్రకటిస్తామని తెలిపారు.  

దాడులకు నిరసనగా రేపు బంద్‌
దాడులకు నిరసనగా బుధవారం (27న) విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సం ఘాలు పిలుపునిచ్చాయి. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల దాడిని ఖండిస్తున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. 27న జరుగనున్న బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.  వర్సిటీలో శాంతియుతంగా కార్యక్రమం చేపడుతుంటే బీజేపీ నేతలు వచ్చి ఆటకం కల్పించడంతో పాటు గొడవలకు కారణమయ్యారని ఆరోపించారు.

విచారణకు ఆదేశించాం
విద్యార్థులు అల్లర్లకు పాల్పడితే వారి ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుంది. వర్సిటీ ఘటనపై గురించి విచారణకు ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా  బలగా లను ఏర్పాటు చేశాం. విద్యార్థి సంఘాల మధ్య జరిగిన దాడుల గురించి యూనివర్సిటీ అధికారులతో సమీక్షించి
తెలుసుకున్నాం.    – కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ  


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
వామపక్ష విద్యార్థి సంఘాలు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి  వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోం దని  పార్టీలు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు.  విద్యార్థులపై ఏబీవీపీ దాడులను నిరసిస్తూ సీపీఐ కార్యాలయంలో ప్రజాసంఘాల నేతలు సమావేశమయ్యారు. మనుధర్మశాస్త్ర దిష్టిబొమ్మను శాంతియుతంగా దహనం చేసేందుకు యత్నిస్తున్న వామపక్ష, బహుజన విద్యార్థి సంఘాలపై ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. దాడులు హేయమైనచర్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. కాగా, 27న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.  దాడులను ఖండించాలని కోరారు.


ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేయాలి
బీజేపీ నేతలు బండి సంజయ్, కొత్త శ్రీనివాస్‌రెడ్డి
కరీంనగర్‌: శాతవాహన యూనివర్సిటీలో అల్లర్లకు ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ సూరేపెల్లి సుజాతను వెంటనే సస్పెండ్‌ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు. వర్సిటీలో దేశభక్తి, మంచి నడవడిక నేర్పాల్సిన ప్రొఫెసర్లు విద్యార్థులను చెడుమార్గంలోకి మళ్లీస్తూ గొడవలకు కారకులవుతున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్‌ సుజాత విద్యార్థులను రెచ్చగొట్టి భరతమాత చిత్రపటాలను దహనం చేసేందుకు ప్రేరేపించడం వల్లే సంఘటన జరిగిందని ఆరోపించారు.    హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కేసీఆర్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement