
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ డిమాండ్ న్యాయమైనదని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మంద కృష్ణను బేషరతుగా విడుదల చేసి, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసినా, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి ఆలస్యం చేయడం తగదన్నారు.
జనవరి 5న పార్ల మెంట్ సమావేశాలు ముగుస్తాయని, సీఎం చొరవ తీసుకుని ఢిల్లీ వెళ్లి ప్రధానితో మాట్లాడి వర్గీకరణకు కృషి చేయాలని కోరారు. ఉద్యమకారులను అరెస్ట్ చేసి అడ్డుకోవాలనుకుంటే ఉద్యమాలు ఆగవన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వెంటనే వదిలిపెట్టారే తప్ప ఇలా సెక్షన్ల మీద సెక్షన్లు పెట్టి హింసించలేదని గుర్తు చేశారు. చట్టం పేరుతో అరాచకం సృష్టించడం బాధాకరమన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కడుపు మండిన పోరాటమని, ఆ పోరాటం చేస్తున్న మంద కృష్ణను అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఫ్యూడల్ వ్యవస్థ వచ్చిందని, ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా మళ్లీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలందరూ ఏకమై రాజకీయశక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. మంద కృష్ణను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ సంఘీభావ, విడుదల కమిటీ ఈ నెల 27న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కమిటీ చైర్మన్ సాదం వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, సీపీఎం, సీపీఐ నేతలు జి.నాగయ్య, బాలమల్లేశ్, ప్రజాసంఘాల నేతలు మన్నారం నాగరాజు, స్కైలాబ్ బాబు, డాక్టర్ కాశీం, ఏపూరు సోమన్న, ప్రొఫెసర్ గాలివినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment