మల్లూర్ తండాలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కావెంజర్
నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణతో పాటు పాఠశాలల పరిశుభ్రత కోసం నియమించిన స్కావెంజర్లే ఇప్పుడు టీచర్లు అయ్యారు. ఉపాధ్యాయులు లేని జీరో పాఠశాలల్లో స్కావెంజర్లు సార్లుగా మారి విద్యార్థులకు చదువు చెబుతున్నారు.
2018–19 విద్యాసంత్సరం ప్రారంభమై 20 రోజులవుతున్నా ప్రభుత్వం మాత్రం వీవీలను నియమించలేదు. దాంతో జీరో పాఠశాలల్లో విద్యార్థులకు చదువులు అందని ద్రాక్షగా మారాయి. సదరు జీరో పాఠశాలలకు స్థాని రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులకు ఇన్‌చార్జి అప్పగించారు. అయితే వారెవరు జీరో పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడంతోనే ఈ దుస్థితి దాపురిస్తోంది.
రెండేళ్లుగా అదే దుస్థితి
నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్, మల్లూర్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక జీరో పాఠశాలల్లో బుధవారం ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆ రెండు పాఠశాలల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల భర్తీ కావడం లేదు. రెండేళ్ల నుంచి వీవీలతోనే నెట్టుకొస్తున్నారు.
ఈ విద్యాసంవత్సరంలో ఇంకా వీవీల నియామకం చేపట్టలేదు. దీంతో చదువులు చెప్పేవారు కరువయ్యారు. జీరో పాఠశాలలు మూత పడకుండా ఎంఈవోలు రిసోర్స్ పర్సన్లను, పక్క పాఠశాలల టీచర్లకు డ్యూటీలు వేస్తూ నడిపిస్తున్నారు. అయితే సదరు రిసోర్స్‌పర్సన్లు, ఉపాధ్యాయులు జీరో పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాకుండా ఎంఈవోల పర్యవేక్షణ లేక జీరో పాఠశాలల్లో చదువులు గాడి తప్పుతున్నాయి.
గాడితప్పుతున్న విద్యావ్యవస్థ
జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ప్రభు త్వ పాఠశాలలు మారుమూల ప్రాంతాన ఉన్నా యి. మారుమూల గ్రామీణ, గిరిజన తండాల్లోని విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. ఆయా మండలాల్లోని జీరో పాఠశాలల్లో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరతతో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితో పాటు ఉపాధ్యాయులు అందుబాటుల లేక ప్రైవేట్ పాఠశాలల వైపు గ్రామీణులు ఆసక్తి చూపిస్తున్నారు. నిజాంసాగర్ మండలంలోని మర్‌పల్లి, లింగంపల్లి, జక్కాపూర్, తుర్కపల్లి, మల్లూర్‌తండా, పిప్పిరేగడి తండా, నల్లగుట్ట, చెరువుముందుతండా పాఠశాలలు జీరో పాఠశాలలు ఉన్నాయి. పిట్లం మండలంలోని కాటెపల్లి ఉర్దూమీడియం, చిల్లర్గి ఉర్దూమీడియం, మద్నూర్ మండలంలోని మారెపల్లి, జుక్కల్ మండలంలోని బాబుల్‌గావ్, కత్తల్‌వాడి పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు.
వీవీల నియామకమెప్పుడో..!
జిల్లాలో 1,062 ప్రభుత్వ పాఠశాలలకు 4,916 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పలు పాఠశాలల్లో 816 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా గతేడాది 440 వీవీలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే గతేడాది 436 మంది వీవీలు మాత్రం పనిచేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమైన 20 రోజులు కావస్తున్నా వీవీల ఊసేత్తడం లేదు. దాంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న జీరో పాఠశాలల్లో విద్యాబోధన విద్యార్థులకు అందని ద్రాక్షగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment