జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు! | school times will change from june | Sakshi
Sakshi News home page

జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!

Published Wed, Apr 22 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!

జూన్ నుంచి స్కూళ్ల వేళలు మార్పు!

 మార్చిలోనే కొత్త తరగతులు
 ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ సమావేశం

సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్ నుంచి) రాష్ట్రంలోని పాఠశాలల పని వేళలు మారనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న విద్యా విషయక క్యాలెండర్‌పై చర్చించేందుకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు, ఇతర అధికారులు.. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఉదయం ప్రధాన సంఘాలతో, మధ్యాహ్నం ఇతర సంఘాలతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ పాఠశాలల వేళలను ఉదయం 9:30 గంటల నుంచి కొనసాగించేలా మార్పు చేయాలని కోరాయి. ఇదే విషయాన్ని విద్యాశాఖ కూడా పరిశీలిస్తోందని ఈ సందర్భంగా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. దీంతో పాఠశాలల వేళలను మార్పు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగించేందుకు ఏకాభిప్రాయం కుదిరింది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ప్రాథమిక పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:45 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. అలాగే సమరేటివ్ 1, 2, 3   (త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక) పరీక్షల విధానం కాకుండా రెండు సమరేటివ్ పరీక్షలనే నిర్వహించాలని కోరాయి. ఈ సమావేశంలో  ప్రధాన సంఘాలతో ఉదయం, మిగతా సంఘాలతో సాయంత్రం సమావేశం నిర్వహించడంపై ఇతర సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌తోపాటు అదనపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్ జగన్నాధరెడ్డి, మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి, కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్, టీఎస్-యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్, టీటీయూ, పండిత పరిషత్తు, పీఆర్‌టీయూ-తెలంగాణ, జీటీఏ, బీటీఏ, టీఎస్‌టీఎఫ్, టీటీఎఫ్, హెచ్‌ఎంల సంఘం నేతలు పాల్గొన్నారు.
పాఠశాలల విలీనంపై భిన్నాభిప్రాయాలు
‘‘ఒక నివాస ప్రాంతంలో లేదా ఒకే స్కూల్ ఆవరణలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలను కిలోమీటరు పరిధిలోకి విలీనం చేస్తారు. ఇది చేసేప్పుడు ఎన్‌రోల్‌మెంట్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే ఒకటి నుంచి ఐదో తరగతి వరకున ్న ప్రతి ప్రాథమిక పాఠశాలలో కచ్చితంగా ముగ్గురు టీచర్లు ఉండేలా చర్యలు చేపడతారు. వారిలో ఒక టీచర్ పూర్తిగా తెలుగు/ఉర్దూ బోధనను, మరో టీచర్ ఇంగ్లిష్, ఇంకో టీచర్ గణితం ఇతర అంశాలను బోధించాలి’’ అని పాఠశాల విద్యా విషయక క్యాలెండర్‌లో పొందుపరిచిన నిబంధనలపై ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది.

ప్రాథమికోన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఒకవేళ 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నత పాఠశాల లేకపోతే ఆ ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేస్తారు. వాటిలో ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ను ఇస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే తక్కువ మంది విద్యార్థులుంటే ఆ స్కూళ్లను ఐదు కిలోమీటర్ల పరిధిలోని మరో స్కూల్లో విలీనం చేయాలా? కొనసాగించాలా? అన్న దానిపై సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు టీచర్లు ఉండాలన్న నిబంధనను సమర్థించారు.
ఏకాభిప్రాయం కుదిరిన అంశాలు..

  • టెన్త్ పరీక్షలను ఇంటర్ పరీక్షల్లాగే మార్చి 15కి పూర్తి చేయాలి.
  • మిగతా తరగతుల వార్షిక పరీక్షలను ఫిబ్రవరి చివరికి పూర్తి చేయాలి.
  • కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ పాఠశాలల తరహాలో వేసవి సెలవులకు ముందే పై తరగతికి వెళ్లే విద్యార్థులకు కొత్త పాఠ్యాంశాల బోధనను మార్చి 16 నుంచి ప్రారంభించాలి.
  • పాఠ్య పుస్తకాలను మార్చి మొదటి వారం నాటికే విద్యార్థులకు అందించాలి. అందుకోసం పక్కాగా ముద్రణ చేపట్టాలి.
  • స్కూళ్లను ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగించాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలి.
  •  ఉపాధ్యాయులకు నిష్ణాతులైన వారితో నాణ్యమైన శిక్షణను అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement