పెట్టుబడులకు స్కాట్లాండ్ ఆసక్తి
పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లితో స్కాట్లాండ్ బృందం భేటీ
రాష్ట్రంలో పారిశ్రామికవిధానంపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్కాట్లాండ్ ఆసక్తి చూపింది. ఈ మేరకు గురువారం స్కాట్లాండ్ ప్రతినిధుల బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ అయింది. ఇక్కడి పారిశ్రామిక విధానాల గురించి తెలుసుకుంది. స్కాట్లాండ్‌కు చెందిన ఆసియా ఫసిఫిక్ ఫర్ స్కాటిష్ ఎంటర్‌ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జూలియన్ టేలర్, సౌత్ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ తియోదర్ ఇమ్మాన్యుయెల్, ఇండియా మేనేజర్ రూమ కుమార్ బుస్సీలు మంత్రితో చర్చించారు. స్కాట్లాండ్, తెలంగాణల మధ్య పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు, కొత్త అవకాశాలను విసృ్తతపరిచే అంశాలపై చర్చించారు. రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానాన్ని మంత్రి వివరించారు. కరచాలనం చేసినంత సులువుగా వ్యాపారం చేసేలా పారిశ్రామిక విధానాలున్నాయని చెప్పారు.
రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చడానికి అవినీతి, సమస్యలు లేని విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలైన ఐఐటీ, ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, సీసీఎంబీ వంటి సంస్థలు ఉండటంతో నైపుణ్యం గల మానవ వనరులకు కొదువలేదని చెప్పారు. మెగా ప్రాజెక్టులకు పారిశ్రామిక క్లియరెన్స్‌లను కేవలం 15 రోజుల్లో ఇచ్చేందుకు టీఎస్-ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. జీవశాస్త్రం, ఫార్మా, సంప్రదాయేతర ఇంధన వనరులు, నీటి నిర్వహణ, విద్య, స్మార్ట్ సిటీ అభివృద్ధి వంటి అంశాలపట్ల ఆసక్తిగా ఉన్నామని స్కాట్లాండ్ ప్రతినిధులు తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న రంగాల గురించి సమగ్ర నివేదిక ద్వారా తమకు తెలియజేయాలని మంత్రి సూచించారు. త్వరలో మళ్లీ హైదరాబాద్‌లో పర్యటిస్తామని స్కాట్లాండ్ ప్రతినిధులు వెల్లడించారు.